రాజ‌గోపాల‌రెడ్డి మాట‌ల్లో కాంగ్రెస్ గెలుపు.. భ‌య‌ప‌డుతున్నారా..!

Update: 2022-07-30 23:30 GMT
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల‌రెడ్డి తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. గ‌త వారం ప‌ది రోజులుగా ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న‌తో మాట‌ల‌తో అన్ని పార్టీల‌ను గంద‌ర‌గోళంలో ప‌డేస్తున్నారు. బీజేపీలో చేర‌తాన‌ని మూడేళ్ల క్రిత‌మే ప్ర‌క‌టించిన ఆయ‌న ఎప్పుడు చేర‌తార‌నే విష‌యంలో మాత్రం మీమాంస‌లో ప‌డిపోయారు. టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే అది బీజేపీతోనే సాధ్య‌మ‌న్న ఆయ‌న త‌న ప్ర‌క‌ట‌న‌ల్లో మాత్రం ద్వంద విధానం పాటిస్తున్నారు.

ఒక‌వైపు కేసీఆర్ ను నిలువ‌రించాలంటే అది మోదీ అమిత్ షా ద్వ‌యం వ‌ల్లే అవుతుంద‌ని భావిస్తున్న రాజ‌గోపాల‌రెడ్డి ఆ పార్టీలో చేరే విష‌యంపై మాత్రం నాన్చుతున్నారు. మ‌రోవైపు రాజీనామా చేస్తే ఉప ఎన్నిక జ‌రిగి నిధులు వ‌స్తాయ‌ని.. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ది చెందుతుంద‌ని ప్ర‌జ‌లు భావిస్తే దానికే క‌ట్టుబ‌డ‌తాన‌ని చెబుతున్నారు. ఇంకోవైపు త‌మ కుటుంబానికి కాంగ్రెస్ అన్యాయం చేస్తోంద‌ని స‌రైన ప‌ద‌వులు ఇవ్వ‌డం లేద‌ని ఆరోపిస్తున్నారు.

ఇలా మూడు ర‌కాల వాద‌న‌ల‌తో అంద‌ర్నీ గంద‌ర‌గోళానికి గురిచేస్తున్నారు. త‌న ల‌క్ష్యం ఏమిటో తెలియ‌క అయోమ‌యానికి గుర‌వుతున్నారు. ఆయ‌న ఏదో ఒక వాద‌న‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌ని అభిమానులు కూడా సూచిస్తున్నారు. కాంగ్రెస్ లో ప‌ద‌వుల విష‌యంలో అన్యాయం జ‌రిగినందుకా.. లేదా ఉప ఎన్నిక వ‌స్తే అభివృద్ధి జ‌రుగుతుంద‌నా.. లేదా టీఆర్ఎస్ కు దీటుగా నిల‌బ‌డేది బీజేపీ అనా. దీంట్లో ఏదో ఒక వైఖ‌రి పైనే స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని కోరుకుంటున్నారు.

ఒక‌వేళ కాంగ్రెస్ అధిష్ఠానం కీల‌క ప‌ద‌వి ఇస్తామ‌ని చెబితే ఆ పార్టీలోనే కొన‌సాగుతారా.. ఆ పార్టీ గెలుపున‌కు కృషి చేస్తారా.. అపుడు అధికార పార్టీని ఢీకొట్టేది బీజేపీయేన‌నే వాద‌న ఎటు పోతుంద‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఒక స్ప‌ష్ట‌మైన వైఖ‌రితో ముందుకు వెళితేనే ఆయ‌న‌కు లాభం చేకూరుతుంద‌ని సూచిస్తున్నారు. అందుకే రాజ‌గోపాల‌రెడ్డి రాజీనామాకు సంశ‌యిస్తున్నార‌ని.. ఉప ఎన్నికలో ఓడిపోతాన‌ని భ‌య‌ప‌డుతున్నార‌ని నియోజ‌క‌వ‌ర్గ‌ కార్య‌క‌ర్త‌లే చ‌ర్చించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఆయ‌న మాట‌ల్లో కాంగ్రెస్ గెలుపు క‌న‌ప‌డుతోంద‌ని కొంద‌రు నేత‌లు వాదిస్తున్నారు. ఇటీవ‌ల రాజ‌గోపాల‌రెడ్డితో భేటీ అయిన భ‌ట్టి విక్ర‌మార్క పలు విష‌యాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు. రేవంతుకు ప‌ద‌వులు ఇవ్వ‌డంపై ఆయ‌న వ‌ద్ద‌ తీవ్ర అభ్యంత‌రం తెలిపార‌ట‌.

అయితే ఆయ‌న ఒక వాద‌న ప‌ట్ల కార్య‌క‌ర్త‌లు కాంగ్రెస్ గెలుపుపై  అవ‌కాశం ఉంద‌ని చ‌ర్చించుకుంటున్నారు. అడ్డ‌దారిలో కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌ట్టిన వ్య‌క్తులకు అధికారం తెచ్చిపెట్టేందుకు తాను ఆయుధంగా మార‌లేన‌ని ఆయ‌న అన్న‌ట్లు తెలిసింది. అంటే ఆయ‌న ప‌రోక్షంగా కాంగ్రెస్ గెలుపును.. రేవంత్ విజ‌యాన్ని ధృవీక‌రించిన‌ట్లుగానే ఉంద‌నే ధీమాను శ్రేణులు వ్య‌క్తం చేస్తున్నాయి. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!
Tags:    

Similar News