ఢీ కొట్టి ప్రాణం తీసిన కారులో ఎంపీ భరత్ ఉన్నారా?

Update: 2023-05-13 10:00 GMT
ఎంపీగా కంటే కూడా సోషల్ మీడియాలో ఎంపీగా పాపులర్ అయిన రాజమహేంద్రవరం వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఇబ్బందిలో చిక్కుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ఒక రిటైర్డు పశువైద్యుడ్ని ఢీ కొన్నదని.. దీంతో ఆ పెద్ద వయస్కుడు అక్కడికక్కడే మరణించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. ప్రమాదం చోటు చేసుకున్న కారులో ఉన్నది ఎంపీ భరత్ కాదని.. వారి కుటుంబ సభ్యులుగా స్పష్టం చేస్తున్నారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం సీతంపేట సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం చోటు చేసుకున్న యాక్సిడెంట్ లో 65 ఏళ్ల నరసయ్య మరణించారు.

నల్లజర్ల వైపు నుంచి విజయవాడకు వెళుతున్న కారు సీతంపేట సమీపంలో టూ వీలర్ మీద రోడ్డు దాటుతున్న నరసయ్యను ఢీ కొట్టింది. దీంతో కిందపడిపోయిన ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బ తింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి డెడ్ బాడీని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ కారులో ఉన్నది ఎంపీ భరత్ అంటూ ప్రచారం జరిగింది. అయితే.. ఆ కారులో ఉన్నది తాను కాదని.. తన కుటుంబ సభ్యులుగా ఎంపీ పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.అయితే.. కారు మాత్రం ఎంపీకి చెందినదన్న మాట వినిపిస్తోంది.

Similar News