బాబు తాజా బ‌క‌రా.. జ‌క్క‌న్న!

Update: 2017-09-28 03:52 GMT
ప్ర‌పంచంలో చాలా త‌క్కువ మందికి వ‌చ్చే విచిత్ర‌మైన ఐడియాలు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు వ‌స్తుంటాయి. అప‌ర మేధావిగా కీర్తించుకునే ఆయ‌న‌.. కొన్నిసార్లు తీసుకునే నిర్ణ‌యాలు మ‌హా విచిత్రంగా ఉంటాయి. ఎంత‌వ‌ర‌కు సాధ్య‌మ‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెట్టేసి మ‌రీ ముందుకెళ్లే ఆయ‌న తీరు అవాక్కు అయ్యేలా చేస్తుంటాయి.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌యం త‌ర్వాత అధికారం చేప‌ట్టిన బాబుకున్న అతిపెద్ద బాధ్య‌త ఏమిటంటే.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ఒక షేప్ లోకి తీసుకురావ‌టం.

యుద్ధ‌ప్రాతిప‌దిక‌న రాజ‌ధాని నిర్మాణం జ‌రుగుతుంద‌న్న మాట‌ను ప‌దే ప‌దే చెప్పిన చంద్ర‌బాబు.. త‌న నోటికి ఏ దేశం గుర్తుకు వ‌స్తే ఆ దేశం మాదిరి అమ‌రావ‌తి నిర్మాణం సాగుతుంద‌ని చెప్పారు. అమెరికా.. బ్రిట‌న్ దేశాల్లోని కొన్ని న‌గ‌రాలను ప్ర‌స్తావించిన నోటితోనే ఇస్తాంబుల్ స్ఫూర్తిగా అమ‌రావ‌తి నిర్మాణం సాగుతుంద‌ని చెప్పారు. అక్క‌డితో అయినా ఆగారా? అంటే అదీ లేదు. చివ‌ర‌కు శ్రీలంక స్ఫూర్తితో అమరావ‌తిని నిర్మిస్తామ‌ని చెప్పుకొచ్చారు.

ఇలా రోజుకో మాట‌తో ఏళ్ల‌కు ఏళ్లు గ‌డిపేసిన చంద్ర‌బాబు.. రాజ‌ధాని నిర్మాణంలో ఐడియాల‌జీ కోసం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అలియాస్ జ‌క్క‌న్న‌ను తీసుకొచ్చారు. బాహుబ‌లి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని డైరెక్ట్  చేసిన జ‌క్క‌న్న భుజాల మీద అమ‌రావ‌తి నిర్మాణ డిజైన్ల ఎంపిక కార్య‌క్ర‌మాన్ని పెట్టిన‌ట్లు ప్ర‌క‌టించి చాలామంది నోట మాట రాకుండా చేశారు.

అద్భుత‌మైన సినిమా సెట్టింగుల్ని నిర్మించే విష‌యంలో జ‌క్క‌న్న‌కున్న అవ‌గాహ‌న‌ను తీసిపారేయ‌లేం. అలా అని.. ఒక మ‌హాన‌గ‌రానికి డిజైన్ల‌ను ఎంపిక చేసే బాధ్య‌త‌ను ఆయ‌న‌పై పెట్ట‌ట‌మా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌. బాహుబ‌లి లాంటి సినిమాలోనే గ్రాఫిక్స్ ప‌రంగా చాలా త‌ప్పుల్ని ఆ రంగానికి చెందిన నిపుణులు ఎత్తి చూపిస్తుంటారు. అంత‌దాకా ఎందుకు ప్ర‌భాస్‌.. అనుష్క‌లు ఇద్ద‌రు క‌లిసి విల్లున‌ను చేత ప‌ట్టుకొని బాణాలు సంధించే పోస్ట‌ర్ లోపంపై సోష‌ల్ మీడియాలో ఎంత ఎట‌కారం చేసుకున్నారో ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకోవ‌టం స‌బ‌బు.

ఇక్క‌డ రాజ‌మౌళిని కించ‌ప‌ర్చాల‌ని అనుకోవ‌టం లేదు.  ఒక మ‌హాన‌గ‌ర నిర్మాణంలో బాబు తీరును ధ‌ర్మ బ‌ద్ధంగా.. త‌ర్క బ‌ద్ధంగా ప్ర‌శ్నించాల‌న్న‌దే అస‌లు ఉద్దేశం. ఇప్ప‌టికే అమ‌రావ‌తి నిర్మాణానికి అయిన ఆల‌స్యం ఎక్కువ‌. ఇప్పుడు డిజైన్ల పేరిట చేస్తున్న సాగ‌తీత కార్య‌క్ర‌మంతో కాలం మాత్ర‌మే కాదు.. నిర్మాణ ఖ‌రీదు పెరుగుతుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

అమ‌రావ‌తి నిర్మాణం బాబుతో మొద‌లై బాబుతో పూర్తయ్యే కార్య‌క్ర‌మం ఎంత‌మాత్రం కాదు. కానీ.. ఆ దిశ‌గా బాబు ఆలోచించ‌టం లేద‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. నిజానికి అమ‌రావ‌తి నిర్మాణాన్ని సాపేక్షంగా నిర్మించాల‌న్న‌దే బాబు ల‌క్ష్య‌మైతే.. ఇప్పుడు అనుస‌రించే ప‌ద్ద‌తికి పూర్తి భిన్నంగా వ్య‌వ‌హ‌రించే వార‌న‌టంలో సందేహం లేదు. దేశ వ్యాప్తంగా పేరు మోసి ఆర్కిటెక్చ‌ర్లు ఎంతోమంది ఉన్నారు. అదే స‌మ‌యంలో ఏపీకి చెందిన అన్ని పార్టీల్లో మేధావులైన నాయ‌కులు ప‌లువురు ఉన్నారు. ఈ కాంబినేష‌న్లో ఒక కమిటీని ఏర్పాటు చేసి రాజ‌కీయాల‌కు అతీతంగా రాజ‌ధాని నిర్మాణాన్ని జ‌ర‌పాల్సింది.

కానీ.. అమ‌రావ‌తి న‌గ‌ర నిర్మాణ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్నే సొంత పార్టీ కార్య‌క్ర‌మంగా మార్చేసిన చంద్ర‌బాబు. డిజైన్లు.. నిర్మాణ విష‌యంలో రాజ‌కీయాల‌కు అతీతంగా ఆలోచిస్తారని అనుకోలేం. అవ‌న్నీ ప‌క్క‌న పెట్టినా.. ఒక సినిమా ద‌ర్శ‌కుడితో అమ‌రావ‌తి మ‌హాన‌గ‌ర డిజైన్ల ఎంపిక కార్య‌క్ర‌మాన్ని చేప‌డ‌తారా? అన్న సందేహం విస్మ‌యానికి గురి చేస్తుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

ఒక ద‌ర్శ‌కుడు తాను తీసే సినిమాలో ఏ దృశ్యం ఎలా రావాలి? అందుకు అవ‌స‌ర‌మైనవి కెమేరా ఫ్రేంలో ఎక్క‌డ ఉండాల‌న్న విష‌యం మీద విజువల్ మ‌న‌సులో ఉంటుంది. కానీ.. రాజ‌ధాని నిర్మాణం అలా కాదే. అందులో చాలానే అంశాలు ఉంటాయి. బాబు తీరు చూస్తుంటే అలాంటివేమీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌న్న‌ట్లుగా అనిపిస్తుంది. త‌న‌కు తాను మొన‌గాడిన‌ని చెప్పుకునే చంద్ర‌బాబుకు రాజ‌మౌళి అవ‌స‌రం ఇప్పుడు ఎందుకు వ‌చ్చింద‌న్న‌ది మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌.
 
ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతికేందుకు మ‌రింత లోతుగా  వెళ్ల‌టం మొద‌లు పెడితే బాబు ప్లాన్ ఏమిట‌న్న‌ది అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పాలి. అమ‌రావ‌తి నిర్మాణం అనుకున్నంత తేలిక కాదు. ఐడియాల సంగ‌తి ఎలా ఉన్నా.. వాటిని అమ‌లు చేయ‌టానికి అవ‌స‌ర‌మైన నిధులు ఏపీ స‌ర్కారు ద‌గ్గ‌ర లేవ‌న్న‌ది నిజం. అలా అని.. డ‌బ్బుల్లేక రాజ‌ధాని నిర్మాణాన్ని ఆపిన‌ట్లు చెబితే  ప్రజలు ఊరుకునే అవ‌కాశ‌మే లేదు.

ఇలాంట‌ప్పుడు ప‌ని మ‌హా జోరుగా సాగుతోంద‌ని.. ఆ విష‌యంలో తాను ఎలాంటి రాజీ ప‌డ‌టం లేద‌న్న భ్ర‌మ‌ను ప్ర‌జ‌ల‌కు క‌ల్పించ‌టంలో భాగంగానే రాజ‌మౌళిని తెర మీద‌కు తీసుకొచ్చారా? అన్న సందేహాన్ని ప‌లువురు వ్య‌క్తం చేయ‌టాన్ని ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన అవ‌స‌రం ఉంది.

నాట‌కీయ ప‌రిణామాల అనంత‌రం రాజ‌మౌళి పేరు తెర మీద‌కు వ‌చ్చింది. బాహుబ‌లి త‌ర్వాత జ‌క్క‌న్న‌కు వ‌చ్చిన విశేష‌మైన పేరుప్ర‌ఖ్యాతుల్ని త‌న‌కు త‌గ్గ‌ట్లు వాడుకునే అంకానికి బాబు తెర తీశార‌ని చెప్పాలి.  నిర్మాణ రంగంలో పేరు ప్ర‌ఖ్యాతులున్న నార్మ‌ర్ ఫోస్ట‌ర్ ప్ర‌తినిధులు ఇచ్చిన రాజ‌ధాని డిజైన్ల‌పై పెద‌వి విరిచిన చంద్ర‌బాబు.. త‌న మ‌న‌సును అర్థం చేసుకొని.. అందుకు త‌గ్గ‌ట్లు డిజైన్లు త‌యారు చేయించాల‌న్న పేరుతో రాజ‌మౌళిని తెర మీద‌కు తీసుకొచ్చారు.

ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి త‌న‌కు తానుగా పిలిస్తే ఎవ‌రు మాత్రం కాదంటారు? అప్ప‌టికి రాజ‌ధాని నిర్మాణ డిజైన్ల విష‌యంలో త‌న పేరు వినిపించినంత‌నే.. త‌న‌కా రంగంలో పెద్దగా అవ‌గాహ‌న లేద‌ని చెప్పుకున్నారు. ఈ మ‌ధ్య‌న అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించి.. స‌ల‌హాలు ఇచ్చే విష‌యంలో వెల్లువెత్తిన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. తాజా ప‌రిస్థితి చూస్తే.. అమ‌రావ‌తి డిజైన్ల‌ను ఖ‌రారు చేసే ప‌నిలో రాజ‌మౌళి మ‌రింత లోతుల్లోకి దిగిపోతున్నార‌ని చెప్పక త‌ప్ప‌దు.

ఇప్ప‌టికే ద‌శ‌ల వారీగా ఒక‌రి త‌ర్వాత ఒక‌రితో స‌మావేశం అవుతున్న రాజ‌మౌళిని.. తాజాగా డిజైన్లకు సంబంధించిన స‌ల‌హాలు.. సూచ‌న‌ల కోసం లండ‌న్ టూర్‌ ను క‌న్ఫ‌ర్మ్ చేశారు. అక్టోబ‌రు 11.. 12.. 13 తేదీల్లో లండ‌న్ లోని నార్మ‌ర్ పోస్ట‌ర్ ఆఫీసులో నిర్వ‌హించే వ‌ర్క్ షాప్ లో పాల్గొన‌నున్నారు. అనంత‌రం రాజ‌మౌళి స‌ల‌హాలు తీసుకొని.. మార్పుల‌తో తుది డిజైన్ల‌ను సిద్ధం చేస్తారు. వాటిని వ‌చ్చే నెల 24.. 25 తేదీల్లో లండన్‌ కు  వెళ్ల‌నున్న చంద్ర‌బాబు అక్క‌డ నార్మ‌ర్ పోస్ట‌ర్ ఆఫీసుకు వెళ్లి చూడ‌నున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తం రాజ‌మౌళి ప్ర‌ముఖంగా క‌నిపించ‌నున్నారు.

డిజైన్ల ఎంపిక‌లో రాజ‌మౌళి పాత్ర చాలా ప‌రిమితం అన్న‌ది అంద‌రికి తెలిసిందే. ఆ ప‌రిమితుల్లో అంద‌రిని ఒప్పించి.. మెప్పించేలా ఉండ‌టం క‌త్తి మీద సామే. అన్నింటికి మించి ఇక్క‌డ గుర్తు పెట్టుకోవాల్సిన విష‌యం మ‌రొక‌టి ఉంది. ఒక సినిమాకు అవ‌స‌ర‌మైన సెట్టింగ్‌ను విజువ‌లైజ్ చేసి.. దాన్ని తాను కోరుకున్నట్లుగా త‌యారు చేయించుకొని.. వాటిని ఏ సీన్లో ఏ యాంగిల్ లో షూట్ చేయాల‌న్న దానిపై ద‌ర్శ‌కుడికి ప‌క్కా అవ‌గాహ‌న ఉంటుంది. ఈ విష‌యాలన్నీ రాజ‌మౌళికి కొట్టిన పిండే. కానీ.. అమ‌రావ‌తి డిజైన్ల ఎపిసోడ్ ఇందుకు పూర్తి భిన్నం.

బాబు మ‌దిలోని ఆలోచ‌న‌ల్ని అర్థం చేసుకొని.. ఆయనకు త‌గ్గ‌ట్లుగా డిజైన్లు త‌యారు చేయించ‌టం. కెమేరా క‌న్నుకు అవ‌స‌ర‌మైన‌ట్లుగా సెట్టింగులు సెట్ చేసే ద‌ర్శ‌కుడికి.. రియ‌ల్ డిజైన్ల‌ను ఎంత‌మేర చేస్తార‌న్న‌ది ఒక పెద్ద సందేహం. దానికి సంతృప్త‌క‌ర‌మైన స‌మాధాన్ని ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు. అలా అని రాజ‌మౌళిని విమ‌ర్శించ‌టంలోనూ అర్థం లేద‌నే చెప్పాలి. ఒక ముఖ్య‌మంత్రి నువ్వీ ప‌ని చేయాల్సిందేన‌ని ఒక‌రిని కోరిన త‌ర్వాత కాద‌నేంత శ‌క్తి ఇప్ప‌టి కాలంలో ఎవ‌రికి ఉంటుంది చెప్పండి? అందులోకి సున్నిత మ‌న‌స్కుడు.. బిడియం ఎక్కువైన‌ రాజ‌మౌళి ఇది త‌న ప‌ని కాదే కాద‌ని ఎలా చెప్ప‌గ‌ల‌డు?  డిజైన్ల ఎంపిక ఎపిసోడ్ చూస్తే అర్థ‌మ‌య్యేది ఒక్క‌టే.. బాబు తాజా బ‌క‌రా జ‌క్క‌న్న అన్న మాట బలంగా వినిపిస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కూ ప‌లు కార‌ణాలు చూపి రాజ‌ధాని నిర్మాణాన్ని స్టార్ట్ చేయ‌ని చంద్ర‌బాబు.. ఇప్పుడు జ‌క్క‌న్న పేరుతో మ‌రికొంత కాలం సా..గ‌తీస్తార‌న‌టంలో సందేహం లేదు. జ‌క్క‌న్న భుజాల మీద డిజైన్ల ఎంపిక బాధ్య‌త తుపాకీ పెట్టి తాను కోరుకున్న రీతిలో కాల్చే ప‌నికి బాబు శ్రీ‌కారం చుట్టార‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. మ‌రి.. ఈ వాద‌న ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌న్న‌ది కాలం మాత్ర‌మే స‌రైన స‌మాధానం చెప్ప‌గ‌ల‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News