గుడ్డలిప్పి పరీక్ష రాస్తేనే గ్రూప్ 1 పోస్ట్

Update: 2015-11-07 05:44 GMT
తెలుగు రాష్ట్రాల్లో ఏపీపీఎస్సీ - టీపీఎస్సీ పరీక్షల మాదిరిగానే రాజస్థాన్ లో అక్కడి పబ్లిక్ సర్వీసెస్ పరీక్షకు మంచి డిమాండు ఉంటుంది. గ్రూప్ 1 - గ్రూప్ 2 కేడర్ల ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ రాత పరీక్ష రీసెంటుగా నిర్వహించారు. సుమారు నాలుగున్నర లక్షల మంది ఈ పరీక్ష రాశారు. ఇదంతా బాగానే ఉన్నా ఈ పరీక్ష రాయడానికి వచ్చినవారికి దుస్తులకు సంబంధించి పెట్టిన నిబంధనల విషయంలో మాత్రం తీవ్ర గందరగోళం ఏర్పడి కొందరు అభ్యర్థులు చొక్కాల్లేకుండా అర్ధనగ్నంగా పరీక్షలు రాయాల్సివచ్చింది.

రాజస్థాన్ అడ్మినిస్ట్రేషన్ పరీక్షకు ఎలాంటి దుస్తులు ధరించి రావాలో ముందుగానే ప్రకటించారు. దాని ప్రకారం ఫుల్ హాండ్స్ చొక్కాలు వేసుకోరాదు. కానీ కొత్త నిబంధనలపై అవగాహన లేకనో... లేదంటే సీరియస్ గా తీసుకోకనో కొందరు ఫుల్ హ్యాండ్స్ చొక్కాలు వేసుకుని వచ్చారు. అయితే... నిబంధనలను చూపుతూ అధికారులు వారందరితో చొక్కాలు విప్పించారు. కొందరు బనియన్లు వేసుకోకపోవడంతో వారంతా అర్ధనగ్నంగా పరీక్ష రాశారు.

ఇక అమ్మాయిల విషయానికొస్తే తలకు స్కార్ఫ్ కట్టుకున్నవారితో దాన్ని తీయించారు. చున్నీలు, దుపట్టాలు కూడా తీయించేశారు. అయితే... పరీక్షకు చీర, పంజాబీ డ్రెస్ మాత్రమే ధరించి రావాలని చెప్పారని.. చున్నీ వద్దని ముందే ఎందుకు చెప్పలేదని అమ్మాయిలు అధికారులపై విరుచుకుపడ్డారు.

రాజస్థాన్ లో ఉద్యోగ పరీక్షల్లో గతంలో పలుమార్లు అక్రమాలు బయటపడ్డాయి. వాటిలో ఉన్నతాధికారులే నిందితులు. కొందరు ఉన్నతాధికారులు దోషులుగా తేలి అరెస్టయ్యారు కూడా. అలాంటి వారిని కట్టడి చేయలేకపోగా పరీక్ష రాయడానికి వచ్చేవారితో బట్టలిప్పించడం విడ్డూరమే. పరీక్షల్లో అక్రమాలు నివారించడం చేతకాని రాజస్థాన్ అధికారులు భవిష్యత్తుల్లో బట్టలు లేకుండా పరీక్ష హాలుకు రమ్మంటారో ఏమో.
Tags:    

Similar News