బాబు నిర్ణ‌యాన్ని విశ్లేషించిన రాజ్ దీప్

Update: 2018-03-08 04:50 GMT
అనుకున్న‌దే జ‌రిగింది. అంచ‌నాలే నిజ‌మ‌య్యాయి. నాలుగేళ్ల పాటు న‌డిపిన డ్రామాకు బాబు తెర దించారు. ప్ర‌త్యేక హోదా త‌ప్పించి ఇంకేమీ వ‌ద్ద‌న్న ద‌గ్గ‌ర నుంచి హోదా లేకున్నా ఫ‌ర్లేదు.. ప్ర‌త్యేక ప్యాకేజీకి ఓకే చెబుతున్నామ‌న్న బాబు మాట ద‌గ్గ‌ర నుంచి.. మ‌ళ్లీ యూట‌ర్న్ తీసుకొని ప్ర‌త్యేక హోదా తప్ప‌నిస‌రి అన్న బాబు మాట‌లు ఏపీకి లాభం కంటే న‌ష్టాన్నే క‌లుగ‌జేశాయి.

హోదా విష‌యంలో ఏపీ ప్ర‌జ‌లు మొద‌ట్నించి ఒక మాట మీదే ఉన్నారు. విభ‌జ‌న గాయానికి హోదానే మందుగా భావించారు. అదే చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నంగా ఫీల‌య్యారు. హోదా సాధ‌న కోసం ఏపీ అధికార‌ప‌క్షం పోరాడితే మంచిది అనుకున్నారు. కానీ.. హోదా విష‌యంలో ఏపీ అధికార‌ప‌క్షం వేసిన కుప్పిగంతులు ఇష్యూ డైల్యూట్ అయ్యేలా చేయ‌ట‌మే కాదు.. తామేం చేసినా ఏపీ ప్ర‌జ‌ల నుంచి పెద్ద‌గా స్పంద‌న ఉండ‌ద‌న్న భావ‌న‌కు మోడీ స‌ర్కారు వ‌చ్చేలా చేసింది.

మోడీ స‌ర్కారుకు ఎంత ధైర్యం కాక‌పోతే.. ప్రెస్ మీట్ పెట్టి సానుభూతి ఉంది కానీ.. సానుభూతి ఉంది క‌దా అని నిధులు ఇస్తూ పోలేం క‌దా? అని జైట్లీ పొగ‌రుగా మాట్లాడ‌తారు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ ప్ర‌త్యేక ప్యాకేజీ రాగాన్ని ఆల‌పించిన బాబు.. మోడీ మీద త‌న‌కు ఎంతో విశ్వాసం ఉంద‌ని.. న‌మ్మ‌కం ఉంద‌న్న‌ట్లుగా మాట్లాడిన ఆయ‌న.. వారాల వ్య‌వ‌ధిలోనే హోదా విష‌యంలో భారీ నిర్ణ‌యాన్ని ఎందుకు తీసుకున్న‌ట్లు?

మోడీ స‌ర్కారుతో స్నేహాన్ని కొన‌సాగిస్తూనే.. కేంద్రం త‌మ‌కిచ్చిన మంత్రి ప‌ద‌వులకు రాజీనామా చేయ‌టం ద్వారా బాబు ఎలాంటి సందేశాన్ని ఇచ్చారు?  మంత్రి ప‌ద‌వుల రాజీనామా త‌ర్వాత కూడా ఎన్డీయేలో ఎందుకు కొన‌సాగుతున్న‌ట్లు?  బాబు వ్యూహం ఏమిటి? అన్న విష‌యానికి వ‌స్తే.. బాబు తీరుపై ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు రాజ్ దీప్ స‌ర్దేశాయ్ విశ్లేషించారు. బాబు ఆలోచ‌న‌లు ఏమిట‌న్న‌ది చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

చంద్ర‌బాబు పాలిటిక్స్ లో బాగా ఆరితేరిన వార‌ని.. ఒక్కొక్క అడుగు ఆచితూచి వేస్తార‌న్నారు. ప్ర‌జ‌ల మూడ్ ను గుర్తించే కేంద్ర ప్ర‌భుత్వం నుంచి త‌మ మంత్రుల‌ను ఉప‌సంహ‌రించి ప్ర‌త్యేక హోదాపై స్వ‌రం పెంచార‌న్నారు. ఎన్డీయే నుంచి బాబు ఇప్ప‌టికిప్పుడు బ‌య‌ట‌కు రాక‌పోవ‌చ్చ‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. అన్ని ప్రాంతీయ పార్టీల మాదిరే త‌మ రాజ‌కీయ అవ‌కాశాల్ని చివ‌రి వ‌ర‌కూ సజీవంగా ఉంచుకునే ప్ర‌య‌త్నం బాబు చేస్తున్నార‌న్నారు.

మోడీ మంత్రి వ‌ర్గం నుంచి త‌మ మంత్రుల ఉప‌సంహ‌ర‌ణ విష‌యంలో కేంద్రానికి ఫోన్ చేశాన‌ని చెప్ప‌టం ద్వారా వారితో స‌యోధ్య కొన‌సాగేలా చూసుకున్నార‌ని చెప్పాలి. ప్ర‌జ‌ల్లో బాగా వెళ్లిపోయిన ప్ర‌త్యేక హోదా ఉద్య‌మ మైలేజీ జ‌గ‌న్ కు ద‌క్క‌కుండా చూసేందుకే బాబు తాజా నిర్ణ‌యంగా చెప్ప‌క త‌ప్ప‌దన్నారు. జ‌గ‌న్ ఎంపీలు రాజీనామాకు డెడ్ లైన్ ఇచ్చిన నేప‌థ్యంలో వారి కంటే ముందే తాము పెద్ద నిర్ణ‌యం తీసుకున్నామ‌న్న భావ‌న ప్ర‌జ‌ల‌కు క‌లిగేలా చేయ‌ట‌మే బాబు ఆలోచ‌న అన్న విష‌యాన్ని రాజ్ దీప్ చెప్ప‌క‌నే చెప్పేశార‌ని చెప్పాలి.

Tags:    

Similar News