మోడీ డ్రీమ్‌ కు మ‌ద్ద‌తిచ్చిన ర‌జ‌నీ

Update: 2018-07-15 17:01 GMT
దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్‌ సభ - అసెంబ్లిలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ దిశగా కేంద్రం అడుగులు వేస్తుండటంతో ఆయా రాజకీయ పార్టీల‌న్నీ త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల లా క‌మిష‌న్ అభిప్రాయాలు స్వీక‌రించిన స‌మ‌యంలో ప్రతీసారి 4నుంచి 6 నెలల సుధీర్ఘ సమయం ఎన్నికలకే సరిపోవడంతో అభివృద్ధి పథకాలపై దీని ప్రభావం పడుతోందని చాలా రాష్ట్రాలు కేంద్రానికి నివేదించాయి. లోక్‌ సభ - అసెంబ్లీ ఎన్నికలను విడివిడిగా జరపడం వల్ల‌ అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఆటంకాలు - ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే అధికార యంత్రాంగం పడే పాట్లు - వృధా అవుతున్న ప్రజాధనాలను కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు వివరించింది. దీనికి ప‌లు ప్రాంతీయ పార్టీలు మ‌ద్ద‌తివ్వగా...మ‌రికొన్ని పార్టీలు వ్య‌తిరేకించాయి.

కాగా, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ తాజాగా జ‌మిలి ఎన్నిక‌ల‌పై ఆస‌క్తిక‌రంగా స్పందించారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు మంచి నిర్ణయమేనని ఆయ‌న ప్ర‌ధాని మోడీకి మ‌ద్ద‌తిచ్చారు.  జమిలీ ఎన్నికలకు అన్ని పార్టీలు ఆమోదం తెలపాలని దీని వలన సమయం - డబ్బు రెండూ ఆదా అవుతాయని ర‌జ‌నీ స్ప‌ష్టం చేశారు. ఇక త్వ‌ర‌లో రాజ‌కీయ రంగ ప్రవేశం చేయ‌నున్న ర‌జ‌నీకాంత్ త‌న పార్టీ గురించి వివ‌రిస్తూ  పార్లమెంట్‌ ఎన్నికల సమయం నాటికి తమ పార్టీ కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు. తనను స్ఫూర్తిగా తీసుకొని దొరికిన యాభై వేల రూపాయలను పోలీసులకు అందించిన మహ్మద్‌ యాసిన్‌ ను రజనీ అభినందించారు. అదేవిధంగా ఏడేళ్ల యాసిన్‌ కు అతను చదువుకునేంత వరకు విద్యాబ్యాసం చేయిస్తానని హామీ ఇచ్చారు.

కాగా,  జమిలి ఎన్నికలకు వీలుగా ముందస్తు ఎలక్షన్లు తప్పదేమోననే సంకేతాలకు బలం చేకూరేలా ప‌రిణామాలు చోటుచేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ బుధవారం హైదరాబాద్‌ లో పర్యటించడం ఈ ప‌రిణామాన్ని అవున‌నే రీతిలోనే చాటిచెప్తోంది. తెలంగాణ ఎన్నికల సంఘం సీఈఓ రజత్‌ కుమార్‌ - ఏపీ ఎన్నికల సంఘం అధికారి ఆర్‌పి సిసోడియాతో సమావేశమై అసెంబ్లీ - లోక్‌ సభకు సాధారణ ఎన్నికల నిర్వహణపై సమీక్షించడంతో ముంద‌స్తు జ‌మిలి ఖాయ‌మంటున్నారు. ఇదిలాఉండ‌గా...కాగా,  దేశంలో 1952నుంచి 1968 వరకు లోక్‌ సభ - అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించారు. కొన్ని రాష్ట్రాల్లో ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలు రావడంతో షెడ్యూల్‌ లో మార్పులు వచ్చాయి. దీంతో రాష్ట్రాల్లో ఒక్కో సమయంలో - లోక్‌ సభకు మరోసారి ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే ఉమ్మడి ఏపీలో 1999 - 2004 - 2014లలో జమిలి ఎన్నికలు జరిగాయి.

Tags:    

Similar News