అసలు వర్మకు కావాల్సిందేమిటి?

Update: 2016-03-13 07:11 GMT
అవునన్నా కాదన్నా వర్మ కరెంటు లాంటోడు. ఒక్కోళ్లకు ఒక్కో అలవాటు ఉంటుంది. మనసుకు అనిపించినవన్నీ బయటకు చెప్పుకోలేరు. కానీ.. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అందుకు కాస్త డిఫరెంట్. తన మనసుకు తోచినవన్నీ బయటకు ఓపెన్ గా చెప్పేస్తుంటాడు. నలుగురు సినిమా అభిమానులో.. సినిమాల మీద ఇంట్రస్ట్ ఉన్నోళ్లు కలిసినప్పుడు వంద మాటలు వస్తుంటాయి. వాటిల్లో  నిజానిజాల మాట దేవుడికే ఎరుక. కానీ.. అవన్నీ ఎవరూ అధికారికంగా పోస్ట్ ల రూపంలో పెట్టరు. పెట్టినా తమ వివరాల్ని పూర్తిగా వెల్లడించేలా పెట్టరు. కానీ.. అలా పెట్టే దమ్ము.. ధైర్యం సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకే ఉంది. ఆ హీరోయిన్ ఆ సెట్లో ఇలా చేసిందంట.. అక్కడ అలా ఉందట లాంటివి చాలానే చెబుతుంటారు. అలా చెప్పే వాటిల్లో నిజం ఉండొచ్చు.. అబద్ధం ఉండొచ్చు.

ఒకవేళ తమకు నిజం తెలిసినా.. ఓపెన్ గా అందరికి తన అడ్రస్ చెప్పి మరీ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయరు. కానీ.. అలా చేసే సత్తా ఎవరికైనా ఉందంటే.. అది రాంగోపాల్ వర్మకే అని ప్రత్యేకంగా చెప్పాలా? తన సినిమాలతో కంటే.. తన వివాదాస్పద మాటలతోనే నిత్యం వార్తల్లో ఉండే ఆయన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఇష్యూ గురించి తనదైన శైలిలో ట్వీట్లు చేయటం తెలిసిందే.

తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని చాలానే మీడియా సంస్థలు లైట్ గా టచ్ చేశాయే కానీ.. ఓపెన్  గా ఆయన కోట్ చేసిన ట్వీట్లను ఎవరూ అచ్చుగుద్దినట్లుగా ప్రచురించటానికి పెద్దగా ఇష్టపడలేదు. కొన్ని ప్రముఖ మీడియా సంస్థలైతే.. జస్ట్ ఇగ్నోర్ చేసినట్లుగా కనిపించాయి. ‘‘మెరిసే వాటిని బంగారంలా బ్యాంకర్లకు చూపించి వజ్రాలు ఎలా తెచ్చుకోవాలో మాల్యాకు బాగా తెలుసనుకుంటాను’’ అని నర్మగర్బంగా చెప్పిన వర్మ.. తర్వాతి ట్వీట్ లో ఆ మొహమాటపు పరదాను తీసి పారేసి.. ‘బ్యాంకులకు మాల్యా సెక్యూరిటీ విషయంలో ఈ బికినీ భామలు కీలకపాత్ర పోషించారు. ఆయన ప్రతిపాదనకు బ్యాంకులు ఒప్పుకోకపోవచ్చు. కానీ.. బ్యాంకర్లు ఒప్పుకొని ఉండొచ్చు. కాబట్టి దీనిపై బ్యాంకర్లు ఫిర్యాదు చేయలేరు. అప్పులిచ్చిన ఒక్కొక్క బ్యాంకు తన పర్సనల్ బ్యాంకులా భావించి.. ఒక్కో బ్యాంకుకు ఒక్కో బికినీ భామను మాల్యా పంపించారేమో’’ అంటూ.. వ్యాఖ్యలోని ఆఖరి మాటలో మాత్రమే ఊహను జోడించి.. తాను చెప్పాల్సిన విషయాన్ని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేసినట్లుగా కనిపించక మానదు.

ఇన్ని మాటలు చెప్పినోడు మాల్యా క్యాలెండర్ గర్ల్స్ లోని పేర్లును ప్రస్తావించకుండా ఉంటారా? కాకుంటే.. ఆయన ప్రస్తావించిన పేర్లు మామూలు పేర్లు కావు. బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిపోతున్న పేర్లు. దీపికా పదుకునే.. కత్రినా కైఫ్.. నర్గిస్ ఫక్రీ.. ఈషా గుప్తా లాంటోళ్ల పేర్లను ప్రస్తావించిన వర్మ.. ‘‘మాల్యా క్యాలెండర్ గర్ల్ గురించి ప్రస్తావిస్తూ.. బ్యాంకర్లు ఊగిసలాడటానికి దీపిక.. కత్రినా.. నర్గిస్ ఫక్రీ.. ఈషా గుప్తా లాంటి క్యాలెండర్ గర్ల్స్ కారణమై ఉంటారని భావిస్తున్నానన్నట్లు చెప్పేశారు.

ఎందుకిన్ని మాటలు.. ఎందుకిన్ని సంచలనాలు అని వర్మను అమితంగా అభిమానించే వారి మనసుల్ని తొలిచేస్తుంటుంది. వర్మ పూర్తిగా గాడి తప్పిపోయాడని సంప్రదాయబద్ధంగా.. కొందరు విమర్శలు చేస్తే.. వర్మ పర్వర్టెడ్ అయిపోయాడు.. అందుకే అలాంటి మాటలు అని దూకుడుగా వ్యాఖ్యలు చేసే వాళ్లు పిచ్చ బోలెడు మంది. తన ట్వీట్ల ద్వారా వర్మ ఏం చెప్పాలనుకుంటన్నాడు? ఈ ప్రశ్నకు చాలామంది నోటి నుంచి వచ్చే సమాధానం.. ప్రచారం కావాలని.. తనను తాను ప్రమోషన్ చేసుకోవాలనే మాటలు చెబుతుంటారు.

నిజానికి అలాంటి మాటలకు వర్మకు ఏ మాత్రం సంబంధం ఉండదు. పేరు ప్రఖ్యాతులు కోరుకునే వారు.. నలుగరితో తగదా పెట్టుకోవాలనుకోరు. ప్రముఖుల గురించి మాట్లాడేసి వారి ఆగ్రహానికి గురి కావాలని అస్సలు అనుకోరు. అందులోకి సినిమాను వ్యాపార కోణంలో చూసే వర్మ లాంటి వాళ్లకు లాభాల మీద దృష్టి ఉండాలే కానీ.. వివాదాల మీద కాదుకదా.
ఇక్కడే మరికొందరు ఇంకోలాంటి వ్యాఖ్యలు చేస్తారు. తనకు అందని స్టార్ల మీద అక్కసు వెళ్లగక్కటానికి వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారన్న మాటను చెబుతారు. ఒకవేళ అదే నిజమైతే కనుక తాను పని చేసిన అమితాబ్ లాంటి వ్యక్తి మీద కూడా ఓపెన్ గా చాలానే వ్యాఖ్యల్ని వర్మ చేసిన విషయాన్ని మర్చిపోకూడదు.

మరైతే.. వర్మకు ఏం కావాలి? ఆయన లక్ష్యం ఏమిటి? తాజాగా చేసిన ట్వీట్ల మర్మం ఏమిటి? మాల్యాను తిట్టాలనుకుంటే నేరుగానే తిట్టేయొచ్చు. ఆ దమ్ము.. ధైర్యం వర్మకు పుష్కలంగా ఉంది. అలాంటిది మధ్యలో క్యాలెండర్ గర్ల్స్ అంటూ దీపికా.. కత్రినా అండ్ కో పేర్లను ఎందుకు ప్రస్తావించినట్లు? తను చేసిన తాజా ట్వీట్లు వారికెన్ని కష్టాలు తెచ్చి పెడతాయన్న విషయాన్ని వర్మ గుర్తించలేదా? అన్నది ఒక ప్రశ్న.

ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నంలో.. వర్మ మైండ్ సెట్ ను చెక్ చేసినప్పుడు.. ఆయనలోకి ఒక కోణం బయటకు వస్తుంది. ఆయనకు నిజం చెపాలన్న దురద కాస్త ఎక్కువన్నది అర్థమవుతుంది. తనకు తెలిసిన విషయాల్ని సందర్భానికి తగ్గట్లుగా చెప్పటమో లేదంటే.. తానే సందర్భాన్ని సృష్టించటమో (మీడియా సంస్థలు కనుక తమ సంచలన కథనాలు అచ్చేసే టైపులో) లాంటివి చేసేదంతా  తన లోపలి ‘కాంక్ష’ను తీర్చుకోవటం కోసమే కావొచ్చు. వర్మను పర్వెర్టెడ్ గా చూసే వాళ్లంతా.. ఆయనలోని ఇంకో కోణాన్ని మర్చిపోతారు. తాజా ఇష్యూనే చూస్తే.. రూ.9వేల కోట్ల ప్రజల సొమ్మును దోచుకున్న ఒక బడా వ్యక్తి చీకటి కోణాలు చెబితే పోయేదేముంది? జనాల్ని ఆ రేంజ్ లో మోసం చేసినోడికి.. తమ వంతుగా ఎంతోకొంత సాయం చేసినోళ్లను ప్రస్తావిస్తే జరిగే నష్టం ఎంత? అని వర్మ అనుకొని ఉండొచ్చు. దానికి కాస్తంత కమర్షియల్ టచ్ ఇచ్చి ఉండొచ్చు. అందులో భాగంగానే బికినీ భామల ప్రస్తావన చేసి ఉండొచ్చు.

జనాల్ని చైతన్యపర్చటం వర్మ ట్వీట్లలోకనిపిస్తుంది. బయటకు ఓపెన్ గా చెప్పినట్లు.. ఇష్టారాజ్యంగా మాట్లాడినట్లు కనిపించినా.. వర్మ చేసే ట్వీట్లలో ఒకింత ఆవేదన.. మరికొంత మొండితనం.. తానున్న సొసైటీలో ఎవరికి లేనంత ‘నిజాన్ని’ బయటకు చెప్పాలన్న తపన కనిపించక మానదు. ఒక్కమాటలో చెప్పాలంటే వర్మ కరెంటు లాంటోడు. కరెంటును ఉత్పత్తి చేశాక దాన్ని దాచి పెట్టటం సాధ్యం కాదు. అది ప్రవహిస్తూనే ఉండాలి. దాన్ని ప్రాపర్ ఛానల్ చేయకుంటే ప్రమాదం. అదే సమయంలో తన దారిన తాను పోయే టైంలో ఎవరైనా పొరపాటున తన మీద చేయి వేస్తే.. ప్రాణం తీసే షాకిస్తుంది.

కరెంటులో ఉన్న గుణం వర్మలోనూ కనిపిస్తుంది. తనకు తెలిసిన విషయాలకు సంబంధించి.. సమాజానికి నష్టం జరిగే లింకు బయటకొచ్చినప్పుడు.. లేదంటే ఆయనకు ఆయనకు అనిపించినప్పుడు ట్వీట్స్ తో చెప్పేస్తుంటాడు. కాకపోతే సమస్యల్లా ఏమిటంటే.. పెద్ద మనుషులుగా.. ప్రముఖులుగా వెలిగిపోయే వారంతా తమలోని కోణాన్ని.. తమకు తెలిసిన నిజాల్ని చెప్పేందుకు ఏ మాత్రం ఇష్టపడరు. వారికి కాస్త భిన్నమైన కేసు వర్మ.

ఇంతమంది గురించి నిజాలు చెప్పేటోడికి తన గురించిన ‘వ్యక్తిగత’ విషయాలు వర్మ ఎందుకు ప్రస్తావించరని కొందరు అడుగుతుంటారు. ఆ పాయింట్ లోనూ నిజం కనిపించక మానదు. కాకుంటే.. కరెంటు నేను శక్తిని.. నేను ఎలా ఉంటానో తెలుసా అని తనకు తానుగా చెప్పుకోదుగా. ఒకవేళ.. వర్మలోని మరో ‘కోణాన్ని’ ఎవరైనా ఆవిష్కరిస్తే ఆయనకేమీ అభ్యంతరం ఉండదేమో. కాకపోతే.. అంతటి సాహసం ఎవరు చేయగలరు?

అయితే.. ఏదో ఒక రోజున తనకు సంబంధించిన విషయాల్ని కూడా ఆయన చెప్పేయొచ్చు. కాకుంటే.. ఆ భావన ఆయన మనసుకు రావాలంతే. మన గురించిన విషయాలు చెబితే పోయేదేముంది? అని వర్మ కానీ అనుకుంటే.. విషయాలు చెప్పటం పెద్ద కష్టమేమీ కాదు.

కాకుంటే.. ఆ విషయాల కారణంగా సమాజంలోని చీకటి కోణాలో.. వేల కోట్ల రూపాయిల ప్రజల సొమ్ముల్ని తమ పలుకుబడితో దొబ్బేసి నష్టం చేయటానికి ఏమేం జరిగి ఉంటుందో? తెలుసా అన్న అవగాహన కలిగించే అవకాశం ఉండదు కదా. అలాంటివేమీ లేనప్పుడు వర్మ వ్యక్తిగత విషయాలు నలుగురికి ఉపయోగపడే అవకాశం ఉండదు కదా? అలాంటప్పుడు వర్మ తన గురించి తాను ఓపెన్ కావాల్సిన అవసరం లేదు కదా? కరెంటు తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తుంటుంది. తన గురించి చెప్పుకోదే?
Tags:    

Similar News