కూటమిని కుదిపేస్తున్న ఆ ఇద్దరు

Update: 2018-10-16 10:07 GMT
మహా కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు.  టిక్కెట్ల కోసం పోటీ పడుతున్న కాంగ్రెస్ - టీడీపీ నేతలు ఆయా ప్రాంతాల్లో బలంగా ఉండటమే ఇందుకు కారణం. ఇరు పార్టీల నేతలు తమకే సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అలకలు బూనుతున్నారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఇదే జరుగుతోంది. ఇక్కడ సీట్ల సర్దుబాటు కూటమికి పెద్ద సవాల్ గా మారింది.

ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్.. అంతే వేగంగా అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థుల పై సవాల్ విసిరింది. టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహా కూటమి తరుపున పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఇంకా ఒక కొలిక్కిరాలేదు. సూర్యాపేటలో టీఆర్ఎస్ తరుపున మంత్రి జగదీష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరుపున ఎవరు బరిలో నిలుస్తారోనన్న విషయం  ఇంకా తేలలేదు.

కాంగ్రెస్ తరుపున పోటీకి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి పోటీ పడుతున్నారు. మంత్రి దామోదర్ రెడ్డి గతంలో సూర్యాపేటలో ఒకసారి పోటీ చేసి గెలుపొందారు. రమేష్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. మొదట్లో ఇద్దరు కలిసి నియోజవకర్గంలో బాగానే పనిచేశారు.  అయితే, ఇటీవల కాంగ్రెస్ ర్యాలీ జరిగినప్పుడు ఇక్కడకొచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రమేష్ రెడ్డి వర్గానికి ఆగ్రహం తెప్పించాయి.

దామోదర్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఉత్తమ్ పిలుపునివ్వడమే రమేష్ రెడ్డి వర్గం ఆగ్రహానికి గురవడానికి గల కారణం. రమేష్ రెడ్డి కూడా పార్టీ టిక్కెట్ ఆశిస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నది వారి వాదన. దీంతో ఈయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపైనే ఆశలు పెట్టుకున్నారు.

ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారమే రేపుతోంది. సీట్ల సర్దుబాటు అంతా జరిగిపోయి అభ్యర్థులను ప్రకటిస్తామన్న వేళ ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టడం ఎలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నారట. ఎవరికి సీటు కేటాయిస్తే ఎవరు అలకబూనుతారో.. పార్టీకి సహకారం అందిస్తారో లేదోనన్న మీమాంసలో పడిపోయారట..
Tags:    

Similar News