ఏపీలో పాద‌యాత్ర సీజ‌న్‌

Update: 2016-10-30 05:53 GMT
ఆంధ్రప్ర‌దేశ్‌ లో ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ పాద‌యాత్రల సీజ‌న్ న‌డుస్తోంది. కొద్దికాలం క్రితం ప్ర‌త్యేక హోదా - ఇటీవ‌ల అక్వా ఫుడ్ పార్క్‌ ను నిర‌సిస్తూ పాద‌యాత్ర సాగ‌గా..ప్ర‌స్తుతం కాపులకు రిజ‌ర్వేష‌న్ విష‌యంలో ఈ పేచీ జ‌రుగుతోంది. అయితే తమను బీసీ జాబితాలో చేర్చాలంటూ ఉద్యమిస్తున్న కాపులలో వర్గ విభేదాలు బట్టబయలవుతుండ‌టం వ‌ల్ల పోటాపోటీ యాత్ర‌లు సాగుతుండ‌టం ఆస‌క్తిక‌రం.

కాపులను బీసీల్లో చేర్చాలంటూ నవంబర్ 16 నుంచి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి సత్యాగ్రహ పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. అదేరోజు టీడీపీ నేత - కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ కడప జిల్లా ఇడుపులపాయ నుంచి బలిజల శంఖారావం పేరుతో ఐదురోజుల పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. దీనితో తాము ఎవరి వెంట నడవాలి? ఎవరికి మద్దతునివ్వాలన్న గందరగోళం కాపువర్గాల్లో మొదలయింది. రెండువర్గాల నుంచీ ఒత్తిళ్లు వస్తుండటం  రెండు వర్గాలకు చెందిన జిల్లా స్థాయి నాయకులు సన్నిహితులు కావడమే దానికి కారణం. ముద్రగడకు మద్దతునిస్తున్న కోస్తా కాపుల్లో మెజారిటీ వర్గం ఆయన వెంట నడిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఆ మేరకు కాపునాడు జిల్లా జాక్‌ లు ఇప్పటికే సమావేశాలు నిర్వహించాయి. ఈ పాదయాత్ర ద్వారా సర్కారుకు కాపుల సత్తా చూపాలన్న పట్టుదల ముద్రగడ వర్గంలో కనిపిస్తోంది. ఉభయ గోదావరి - గుంటూరు - కృష్ణా జిల్లాల నుంచి వేలమందిని సమీకరిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, అదేరోజు కాపు-బలిజలకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను జనంలోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో కాపుకార్పొరేషన్ చైర్మన్ రామానుజయ సారథ్యంలో పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.

ఇడుపులపాయలో నవంబర్ 16 నుంచి ఐదురోజులపాటు జరిగే బలిజ శంఖారావం పాదయాత్రలో బలిజలను భారీ సంఖ్యలో సమీకరించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ యాత్ర పులివెందుల నుంచి వెళ్లనుంది. కడప జిల్లాలో జనాభాపరంగా ఎక్కువ సంఖ్యలోని బలిజలను ఆకట్టుకుని, వారిని తెదేపా వైపు మళ్లించే వ్యూహంలో భాగంగా ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సందర్భంగా రామానుజయ వర్గం వైసీపీకి వినూత్న నిరసన తెలపడం ద్వారా, కాపు-బలిజలకు సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుపడుతున్నారన్న ప్రచారానికి తెరలేపనున్నారు. అందులోభాగంగా ఇడుపులపాయలోని వైఎస్ సమాధికి జగన్ మీద ఫిర్యాదులతో కూడిన వినతిపత్రం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ‘మీరు 2004లో మాకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ ఆ ప్రస్తావనే లేదు. మళ్లీ 2009లో అదేమాట చెబితే నమ్మి ఓట్లేసినా మమ్మల్ని నిలువునా మోసం చేశారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు సారథ్యంలోని తెదేపా ప్రభుత్వం కాపు-బలిజలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంటే మీ కొడుకు దానికీ అడ్డుపడుతున్నాడు. ముద్రగడ అనే శిఖండిని అడ్డుపెట్టుకుని మాకు ఫలాలు అందకుండా కుట్ర చేస్తున్నారు. కాపు-బలిజలు మీకేం అన్యాయం చేశారు? మీకు ఓట్లు వేయడమే మా నేరమా? మీ కుమారుడైన జగన్ మీ సమాధి దగ్గరకు వచ్చినప్పుడు మీరైనా బుద్ధి చెప్పండి. లేకపోతే మీ కుటుంబాన్ని మా జాతి క్షమించద’ని వినతిపత్రంలో పేర్కొననున్నట్లు సమాచారం.

రాయలసీమలో రెడ్డి-బలిజ వర్గాల మధ్య ఉన్న వైరం దృష్ట్యా, జనాభాపరంగా అధిక సంఖ్యలోఉన్న బలిజలను తమవైపు మళ్లించుకోవడం ద్వారా, జగన్‌ కు సొంత జిల్లాలో చెక్ చెప్పాలన్న వ్యూహంతో వెళుతున్నారు. కర్నూలు - చిత్తూరు - అనంతపురం జిల్లాల్లోని బలిజలను కూడా తన వైపు మళ్లించుకునే వ్యూహంలో భాగంగా, ఇకపై ఆ జిల్లాల్లో కూడా పాదయాత్రలు నిర్వహించేందుకు రామానుజయ సారథ్యంలోని కాపువర్గం సిద్ధమవుతోంది.

కోస్తా కాపులపై ముద్రగడ ప్రభావం పడి - కాపులు ఒకవేళ ఆయన వైపు అడుగులు వేసినా, వారి కంటే ఎక్కువ జనాభా ఉన్న సీమ బలిజలను తనవైపు మళ్లించుకునే కులసమీకరణలో భాగంగానే ఈ పాదయాత్రలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. బలిజలకు వచ్చే సంక్షేమ ఫలాలను అందకుండా ముద్రగడ ద్వారా జగన్ అడ్డుకుంటున్నారని తెదేపాలోని కాపు వర్గానికి నాయకత్వం వహిస్తున్న రామానుజయ ప్రచారం చేస్తుండగా, కాపులకు ఇచ్చిన హామీ మరచిన బాబుకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ముద్రగడ వర్గం ప్రచారం చేస్తోంది. అయితే, సీమలో తెదేపాకు చెప్పుకోదగ్గ స్థాయిలో బలిజ నేతలు లేరు. ఇటు కోస్తా కాపులకు కులంపై అభిమానం ఉన్నప్పటికీ, వారికి ముద్రగడ నాయకత్వంపై నమ్మకం లేదు. ఆయన ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారన్న విమర్శలే దానికి కారణం. తుని సభలో ముద్రగడ ఏకపక్ష నిర్ణయాలను కోస్తా కాపునేతలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News