జోలెపట్టి బిచ్చమెత్తిన ఎంపీ!

Update: 2015-09-15 04:28 GMT
ఆర్తిలో ఉన్న వారిని ఆదుకోవడానికి, పట్టించుకోని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి తమ నిరసనలిన వ్యక్తంచేయడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మార్గం ఉంటుంది. ప్రభుత్వాలు చేయదలచుకుంటే ఖజానానుంచి సొమ్ము విడుదల చేసేస్తాయి. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా ఎంపీ కవిత చేయదల్చుకుంటే దత్తత మాట చెబుతుంది. అక్కడితో చేతులు దులిపేసుకుంటుంది. అదే కాంగ్రెస్‌ పార్టీ నేతల విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు - సాఫ్ట్‌ వేర్‌ వారంతా ఒకరోజు జీతం విరాళం ఇవ్వండి.. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను అదుకుందాం.. అంటూ పబ్లిక్‌ కు ఒక పిలుపు ఇచ్చి.. ఎదురుచూస్తూ కూర్చుంటారు. కానీ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ ఎంపీ రాపోలు కాస్త భిన్నంగా వ్యవహరించారు. రాజకీయాల్లో తన విలక్షణ పోకడను ఆయన కనబరిచారు.

తెలంగాణ లోని భూదాన్‌ పోచంపల్లిలో ఒక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటే.. ఆయన కుటుంబనికి ఆర్థిక సాయం చేయడానికి ఎంపీ రాపోలు ఆ గ్రామంలో భిక్షమెత్తారు. ఒకవైపు రైతుల ఆత్మహత్యలే తెలంగాణ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుండగా.. మరోవైపు చేనేత కార్మికుడి ఆత్మహత్య పులిమీద పుట్రలాగా మారడమే. ప్రభుత్వాల అసమర్థ విధానాల వల్లే ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయన్న ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌.. భూదాన్‌ పోచంపల్లిలో సదరు మరణించిన కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించారు.

చేనేత కార్మికుల్ని ఆదుకోవడం గురించి స్థానికులు అందరికీ కూడా అవగాహన కల్పించడం లక్ష్యంగా.. ఆయన ఆ గ్రామంలో తొలుత భిక్షాటన నిర్వహించి.. వసూలైన రూ.50 వేలను మరణించిన పగడాల నగేష్‌ కుటుంబసభ్యులకు అందించారు. నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడకుండా భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని ఆయన చెప్పారు.

అయితే.. ఇక్కడ కామెడీ ఏంటంటే.. భూదాన్‌ పోచంపల్లిలో దాదాపు అందరు నేతన్నల దుస్థితి అదేతీరుగా ఉండవచ్చు. రాపోలు వంటి నాయకుడికి వారి కష్టాలు, బాధల గురించి తెలంగాణ సమాజానికి అవగాహన కల్పించడం లక్ష్యం అయితే.. ఆ పల్లె కాకుండా.. మరో నగరంలో బిచ్చమెత్తాలి. దానివల్ల చేనేత పరిశ్రమ బాగుపడుతుంది. వారి జీవితాలకు పనికి భరోసా ఇచ్చేలా విక్రయాలు పెరుగుతాయి. భిక్షమెత్తడం ద్వారా వచ్చే మొత్తం కూడా ఎక్కువ అవుతుంది. దానివల్ల మరణించిన వారి కుటుంబానికి సాయం చేయడం మాత్రమే కాదు.. చావలేక బతుకుతున్న అనేక కుటుంబాలకు ఆసరాగా నిలవడం కూడా సాధ్యం అవుతుంది.
Tags:    

Similar News