తానెంత తోపునో చెప్పుకున్న రావెల‌

Update: 2017-10-01 07:57 GMT
ప‌వ‌ర్ ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీలో అధినేత మీద మండిప‌డ‌టం.. బాహాటంగా ఎట‌కారం చేసుకోవ‌టం.. స‌ర‌దా వ్యాఖ్య‌లు చేయ‌టం.. లాంటివేమీ ఉండేవి కాదు. కానీ.. మారిన కాలానికి త‌గ్గ‌ట్లే పార్టీలో  జీ హుజూర్ అన్న ద‌శ నుంచి అయితే ఏంటంట‌? అనే వ‌ర‌కూ వ‌చ్చింది. గ‌తంలో బాబు పేరును మాట వ‌ర‌స‌కు  ప్ర‌స్తావించేందుకు సైతం నో చెప్పే నేత‌ల‌కు భిన్నంగా ఇప్పుడు ప‌రిస్థితులు వ‌చ్చేశాయ‌ని చెప్పాలి.

ఇటీవ‌ల కాలంలో మంద‌కృష్ణ మాదిగ నిర్వ‌హించే స‌భ‌ను ఏపీ స‌ర్కారు అడ్డుకుందంటూ తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేసిన మాజీ మంత్రి రావెల వ్యాఖ్య‌లు పార్టీలో దుమారాన్నే రేపాయి. ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు ధీటుగా స‌మాధానం ఇచ్చేందుకు కొంద‌రు నేత‌లు సీన్లోకి దిగారు. రావెలను తిట్టే క్ర‌మంలో అధినేత‌ను పొగిడేశారు తెలుగు త‌మ్ముళ్లు. అదే స‌మ‌యంలో రావెల‌పైనా ఫైర్ అయ్యారు.

త‌న‌పై విమ‌ర్శ‌లు చేసినోళ్ల‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకు రావెల రెఢీ అయ్యారు. మొద‌ట అధినేత మీద త‌న‌కు అసంతృప్తి ఉంద‌న్న‌ట్లుగా సాగుతున్న ప్ర‌చారానికి పుల్ స్టాప్ పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. త‌న‌కు పార్టీ పైనా.. చంద్ర‌బాబు పైనా ఎక్క‌డా అసంతృప్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌పై మంత్రి జ‌వ‌హ‌ర్‌.. మంత్రి వ‌ర్త రామ‌య్య చేసిన వ్యాఖ్య‌ల్ని ఖండించారు. వ‌ర్ల‌లో అవ‌గాహ‌న లోపం క‌నిపిస్తోంద‌న్నారు. టీడీపీ హ‌యాంలో మాదిగ‌ల కంటే మాల‌ల‌కు ఎక్కువ‌ ప్రాధాన్య‌త ల‌భిస్తున్న‌ట్లుగా ఆరోపించారు. టీడీపీతో మొద‌ట్నించి ఉన్న మాదిగ‌ల‌కు పార్టీ దూరం కాకూడ‌ద‌న్న ఉద్దేశంతోనే మంద‌కృష్ణ‌తో తాను స‌ఖ్య‌త‌తో ఉన్న‌ట్లుగా వెల్ల‌డించారు.

తాను మంత్రిగా ఉన్న‌ప్పుడు మాదిగ‌ల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ వ‌చ్చిన‌ట్లు చెప్పిన రావెల‌.. మంద‌కృష్న నిర్వ‌హించాల‌నుకున్న కురుక్షేత్ర మ‌హాస‌భ‌ను బ‌ల‌వంతంగా అణిచివేసిన‌ట్లుగా చెప్పారు. ఈ కార‌ణంతోనే ప్ర‌భుత్వం పైనా మాదిగ‌ల‌కు అభ‌ద్ర‌తా భావం ఏర్ప‌డిన‌ట్లుగా చెప్పారు. తాగుబోతుల శాఖ మాదిగ‌ల‌కు ఇచ్చి.. సంక్షేమం మాల‌ల‌కు ఇచ్చిన‌ట్లుగా రావెల వ్యాఖ్యానించారు.

జాషువా జ‌యంతి వేడుక‌ల్లో ద‌ళితుల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌న్న రావెల‌.. జాతీయ నేత‌ల్ని జాతి నేత‌లుగా అన‌టాన్ని త‌ప్పు ప‌ట్టే వారంతా అంబేడ్క‌ర్‌.. జ‌గ‌జ్జీవ‌న్ రావు విగ్ర‌హాల్ని ఊరి మ‌ధ్య‌లో పెట్టించ‌గ‌ల‌రా? అంటూ ప్ర‌శ్నించారు. గాలి వాటంలో త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాలేద‌ని.. తాను ఎమ్మెల్యేల‌కే బీఫారాలు ఇచ్చినోడినంటూ గ‌తాన్ని గుర్తు చేసుకున్నారు. అంతా బాగుంది కానీ.. బాబుప‌ట్ల అసంతృప్తి లేదంటూనే.. మ‌న‌సులోని అసంతృప్తినంతా కుమ్మ‌రించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి.. ఇంత‌లా చెల‌రేగుతున్న రావెల‌ను బాబు ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి.
Tags:    

Similar News