బాబుకు దిమ్మ తిరిగేలా రావెల వ్యాఖ్య‌లు

Update: 2018-03-05 04:30 GMT
రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థి పార్టీ వారు విమ‌ర్శ‌లు చేయ‌టం కామ‌న్. కానీ.. క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా చెప్పే టీడీపీలో.. అందునా బాబు స‌ర్కారులో మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన నేత ఒక‌రు పార్టీపైనా.. ప్ర‌భుత్వం పైనా తాజాగా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. షాకింగ్ గా మారాయి. తెలుగుదేశం పార్టీలో ద‌ళిత ప్ర‌జాప్ర‌తినిధుల‌కు మ‌ర్యాద‌.. గౌర‌వం ల‌భించ‌టం లేద‌న్నారు.

త‌మ ఆత్మ‌గౌర‌వం దెబ్బ తింటోంద‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. టీడీపీలో ద‌ళిత నేత‌ల‌కు ప‌ద‌వులు ఉన్నా.. అధికారం మాత్రం ఉండ‌ద‌న్నారు ద‌ళిత మంత్రుల‌కు క‌నీస మ‌ర్యాద కూడా ల‌భించ‌ద‌న్నారు. ప‌ద‌వులు మావి.. అధికారం మాత్రం వాళ్ల‌దా? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు.. తాజాగా ఒక టీవీ ఛాన‌ల్లో మాట్లాడిన ఆయ‌న‌.. బాబు పార్టీపైనా.. స‌ర్కారుపైనా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలోనే కాదు.. రాష్ట్రం మొత్త‌మ్మీదా ఇలాంటి ప‌రిస్థితే ఉంద‌న్నారు. ఏపీ మొత్తంగా ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అగ్ర‌కుల నేత‌ల‌దే పెత్త‌నంగా ఉంద‌న్నారు. ఎస్సీ మంత్రులు.. ఎమ్మెల్యేల‌కు ప‌ద‌వులు మాత్ర‌మే ఉంటాయ‌ని..అధికారం మాత్రం ఉండ‌ద‌న్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా క‌ర్నూలు జిల్లా కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గాన్ని ప్ర‌స్తావించారు. అక్క‌డ ఎమ్మెల్యే మ‌ణిగాంధీ నామమాత్రంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని.. అక్క‌డ పెత్త‌నం మొత్తం టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్ ఛార్జ్ విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డిదేన‌న్నారు. ఈ ఉదాహ‌ర‌ణ‌తో వ‌ద‌ల‌ని రావెల‌.. కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గాన్ని ప్ర‌స్తావించారు.

ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న జ‌వ‌హ‌ర్ మంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. కానీ.. అధికారం మొత్తం మాత్రం సుబ్బ‌రాజు చౌద‌రిదేన‌న్నారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా గోపాల‌పురం ఎమ్మెల్యే వెంక‌టేశ్వ‌ర‌రావుగా ఉన్న‌ప్ప‌టికీ ప‌వ‌ర్ మొత్తం అక్క‌డి ఛైర్మ‌న్ బాపిరాజు చేతులో ఉంద‌న్నారు. వేమూరు నియోజ‌క‌వ‌ర్గం ప‌వ‌ర్ అంతా తెనాలి ఎమ్మెల్యే అల‌పాటిరాజా చేతుల్లో ఉంద‌న్న ఆయ‌న‌.. ప్ర‌కాశం జిల్లా కొండెపిలోనూ ఇలాంటి ప‌రిస్థితే ఉంద‌న్నారు.

అక్క‌డి ఎమ్మెల్యే ప‌ద‌విలో స్వామి ఉన్నా.. అధికారాన్ని చెలాయించేది మాత్రం ప్ర‌కాశం జిల్లా పార్టీ అధ్య‌క్షుడు జ‌నార్ధ‌న్ చేతిలోనే ఉంద‌న్నారు. దళితుల‌కు నామ‌మాత్ర‌మ‌పు అధికారాన్ని ఇచ్చేసి.. అగ్ర‌కుల నేత‌లు త‌మ హ‌వా న‌డిపిస్తుంటార‌న్నారు.
Tags:    

Similar News