పక్కోడిదైతే ప్రాంతీయ తీవ్రవాదమా రావెల?

Update: 2016-04-24 04:32 GMT
మనది కాకుంటే చాలు ఎవరినైనా.. ఏదైనా అనటానికి రాజకీయ నాయకులు అస్సలు సంకోచించరు. తమ మాదిరి వైఖరి అనుసరిస్తున్న ఎదుటోడ్ని ఇష్టారాజ్యంగా అనేసే రాజకీయ నాయకులు.. తమను తాము మాత్రం ఎంతగా కవర్ చేసుకుంటారన్నది ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు మాటల్ని వింటే ఇట్టే అర్థమవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారపక్షాలు నిర్వహిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు ఆయా విపక్షాలు ఎంతగా విలవిలలాడిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తెలంగాణ అధికారపక్షంతో పోలిస్తే.. ఏపీ అధికారపక్షానిది కాస్త చిత్రమైన అనుభవం. ఒకే వ్యూహానికి ఒకచోట బాధితులుగా.. మరోచోట బాధ్యులుగా ఉండే చిత్రమైన పరిస్థితి తెలుగు తమ్ముళ్ల దగ్గరే కనిపిస్తుంది. దేనివల్ల అయితే అమితంగా లాభపడ్డారో.. అదే తీరుతోమరోచోట అంతేదారుణంగా దెబ్బతిన్న ఘనత టీడీపీకే దక్కుతుంది. అయితే.. ఇలాంటి విచిత్రమైన అంశాలపై మాట్లాడేటప్పుడు మాటలు ఆచితూచి మాట్లాడాలి. నోటికి వచ్చేసినట్లు మాట్లాడకూడదు. ఒకవేళ అలాంటి తప్పు చేస్తే ప్రజల్లో చులకన కావటం ఖాయం.

తాజాగా ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు మాటల్నే తీసుకుంటే.. తెలంగాణలో ప్రాంతీయ తీవ్రవాదం కారణంగానే తెలంగాణ అధికారపక్షంలో చేరుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఏపీలో విపక్షం మునుగుతున్న పడవ.. తగలబడుతున్న ఇల్లుగా అభివర్ణించటం విశేషం. ఒకేలాంటి సందర్భాల్ని రెండు చోట్ల వేర్వేరుగా అన్వయించటంలో మంత్రి కిశోర్ బాబు తడబడినట్లుగా కనిపిస్తుంది. తాను చెప్పిన పోలిక తమకు కూడా వర్తిస్తుందన్న విషయాన్ని రావెల మర్చిపోయినట్లున్నారు. తమ దగ్గర విపక్షం మునుగుతున్న నావ అయినప్పుడు.. పక్కరాష్ట్రంలోనూ విపక్షాలు మునుగుతున్న నావ అని ఎందుకు అనుకోకూడదు? ని జానికి ఇలాంటి అంశాల మీద మాట్లాడాల్సిన అవసరం లేకున్నా.. ప్రచార యావతో ఏదో చెప్పే బదులు మరేదో చెప్పేసి అడ్డంగా బుక్ కావటం రావెల లాంటి వారికి ఒక అలవాటుగా మారింది. ఇలాంటి వారి మాటల ప్రవాహానికి చంద్రబాబు అడ్డుకట్ట వేస్తే మంచిది. లేదంటే.. పలుచన కావటం ఖాయం.
Tags:    

Similar News