గ్రౌండ్ రిపోర్ట్: 'రాయచోటి' గడ్డపై నిలిచేదెవరో..?

Update: 2019-03-22 17:30 GMT
అసెంబ్లీ నియోజకవర్గం: రాయచోటి

వైసీపీ: గడికోట శ్రీకాంత్‌ రెడ్డి
టీడీపీ: రెడ్డప్పగారి రమేశ్‌ రెడ్డి
జనసేన - ఎస్‌ కే.హసన్‌ బాషా
-------------------------
రాయలసీమలో కరువుగడ్డగా రాయచోటి పేరొందింది. ఇక్కడ ప్రజల కనీస సమస్యలపైనే ప్రతీసారి ప్రభావం కనిపిస్తుంటుంది. ప్రజల కష్టాలు తీర్చేవారినే.. స్థానికంగా ఉండే వారినే గెలిపిస్తామని ఓటర్లు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా తాగునీటి సమస్యపై ఎందరో నాయకులు హామీలు ఇస్తూ గెలుస్తున్నారే తప్ప తమ సమస్యను ఎవరు పరిష్కరించడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తాగునీటి సమస్యపై స్పష్టమైన హామీ ఇచ్చే నేతకే ప్రజలు హామీ కట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

*'రాయచోటి' చరిత్ర:

ఓటర్లు: లక్షా 93వేల 400
మండలాలు: గాలివీడు - లక్కిరెడ్డిపల్లి - రామాపురం - సంబెపల్లి - చిన్నమండెం

1955లో నియోజకవర్గం ఏర్పడింది.. 2008 నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా లక్కీరెడ్డిపల్లి - రాయచోటి నియోజకవర్గాలు ఒక్కటయ్యాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఇక్కడ జరిగిన ఎన్నికల్లో స్వాతంత్య్ర సమరయోధుడు యర్రపురెడ్డి ఆదినారాయణరెడ్డి విజయం సాధించారు. ఆ తరువాత 1955లో కాంగ్రెస్‌ తరుపున పోటీ చేసిన ఆయన ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి 15 సార్లు ఎన్నికలు జరగగా అత్యధికంగా కాంగ్రెస్‌ నేతలే విజయం సాధించారు. రెండుసార్లు టీడీపీ.. ఆ తరువాత వైసీపీ రెండుసార్లు జయకేతనం ఎగురవేసింది.ఇక్కడి నుంచి అత్యధికంగా పాలకొండ్రునాయుడు విజయం సాధించారు. ముందుగా ఇండిపెండెంట్‌ గా గెలుపొందిన ఆయన ఆ తరువాత టీడీపీ నుంచి రెండుసార్లు గెలిచారు. ముస్లింలు - బలిజ సమాజిక వర్గం వారే ఇక్కడి నేతల గెలుపొటములలో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది.

* వైసీపీ నుంచి మరోసారి శ్రీకాంత్‌ రెడ్డి..

గడికోట మోహన్‌ రెడ్డి వారసుడిగా 2009లో గడికోట శ్రీకాంత్‌ రెడ్డి రాజకీయారంగేట్రం చేశారు. అప్పటి సిట్టింగ్‌ ఎమ్మెల్యే.. సీనియర్ అయిన వరుస విజయాల పాలకొండ్రు నాయుడిపై విజయం సాధించారు. ఆ తరువాత 2012 ఉప ఎన్నికల్లో, 2014 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు. వైసీపీ నేత జగన్‌ కు సన్నిహిత నేతగా గుర్తింపు పొందారు. సమస్యలు పరిష్కరించడంలో ముందున్నారని చెప్పుకుంటున్నారు. గతంతో పోలిస్తే వలసలను ఆపగలిగారని - అలాగే తాగునీటి సమస్య కొంత తీరిందని చెబుతున్నారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వారు శ్రీకాంత్‌ రెడ్డికి మద్దతిచ్చారు.

*శ్రీకాంత్ రెడ్డి అనుకూలతలు:

- వరుసగా విజయం సాధించడం.
- ముస్లింల మద్దతు ఎక్కువ.
- వలసల నివారణలో చొరవ

* శ్రీకాంత్ రెడ్డి ప్రతికూలతలు:

- తాగునీటి సమస్య ఇంకా తీరకపోవడం
- ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే ఆరోపణలు

* టీడీపీ నుంచి రెడ్డప్పగారి రమేశ్‌ రెడ్డి ..

రాయచోటి టీడీపీ నియోజకవర్గ ఇన్‌ చార్జిగా ఉన్న రెడ్డప్పగారి రమేశ్‌ రెడ్డికే పార్టీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. దీంతో నియోజకవర్గం మీద పట్టున్న రమేశ్‌ రెడ్డి ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. అయితే మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రునాయకుడు కుమారుడు ప్రసాద్‌ బాబు సైతం తనకే టికెట్‌ వస్తుందని ఆశించారు. దీంతో వీరిద్దరి మధ్య కొంతకాలంగా రాజకీయ వైరం సాగింది. పార్టీ అధినేత చంద్రబాబు ఇద్దరితో మాట్లాడి ఒక్కటయ్యేలా చేశారు. రమేశ్‌ రెడ్డి గెలుపుకోసం పాటుపడుతానని ప్రసాద్‌ బాబు ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది.

*రమేశ్ రెడ్డి అనుకూలతలు:

-నియోజకవర్గంలోని సమస్యలపై పోరాటం చేయడం
-టీడీపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తానని స్పష్టమైన హామీ ఇవ్వడం

*రమేశ్ రెడ్డి ప్రతికూలతలు:

-మొదటిసారి పోటీలో నిలబడడం
-వైసీపీ కంచుకోటలో పోటీని ఎదుర్కొవడం

*జనసేన అభ్యర్థిగా ఎస్‌ కే.హసన్‌ బాషా

ఇక ముచ్చటగా మూడో పోటీదారుగా ఎస్‌ కే.హసన్‌ బాషా  జనసేన నుంచి పోటీచేస్తున్నారు. జనసేన కార్యకలాపాల్లో యాక్టివ్ గా ఉండే ఈ స్థానికుడికి పవన్ టికెట్ కేటాయించారు. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ముస్లిం ఓట్లను టార్గెట్ చేసి ఈయనను పవన్ నిలబెట్టారని అర్థం చేసుకోవచ్చు.

*అంతిమంగా టీడీపీ - జనసేన కలిపి వైసీపీ ఢీకొడుతాయా.?

వైఎస్ జగన్ కు సన్నిహితుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి ను ఓడించడానికే ఇక్కడ పవన్ జనసేన తరుఫున ముస్లిం అభ్యర్థిని దింపాడని సమాచారం. శ్రీకాంత్ రెడ్డి ముస్లింలు మద్దతిస్తున్నారు.కీలకంగా ఉన్న వారి ఓట్లు చీల్చితే టీడీపీ అభ్యర్థికి లాభం. అందుకే ఈ ఎత్తుగడ వేసినట్లు అర్థమవుతోంది. కానీ బలమైన శ్రీకాంత్ రెడ్డిని రాయచోటిలో ఓడించడం అంత సులువు అయ్యే పరిస్థితి లేదని గ్రౌండ్ రిపోర్టులో తేలింది. చూడాలి మరి టీడీపీ - జనసేన ఎత్తుగడ రాయచోటి పరిస్థితులను మారుస్తుందో లేదో..
Tags:    

Similar News