ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పద‌వికి గుడ్ బై!

Update: 2019-06-24 05:39 GMT
ఒక ప్ర‌ముఖ యూనివ‌ర్సిటీలో పాఠాలు చెప్పే ప్రొఫెస‌ర్ ఉద్యోగం గొప్పా?  దేశ ఆర్థికరంగానికి వెన్నుముక లాంటి ఆర్బీఐలో డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి గొప్పా? ఈ ప్ర‌శ్న వేస్తే స‌మాధానం చెప్పే వారంతా రెండోదానికే త‌మ ఓటు వేస్తారు. కానీ.. ఆర్బీఐలో కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న కొంత‌మంది మాత్రం త‌మ‌కు ఈ ప‌ద‌వి కంటే పాఠాలు చెప్పుకోవ‌ట‌మే బెస్ట్ అంటూ వెళ్లిపోవ‌టం విశేషం.

యూపీఏ హ‌యాంలో ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ గా ఉంటూ దేశ ఆర్థిక స్థితికి స‌రైన రీతిలో చికిత్స చేసిన వైద్యుడిగా అభివ‌ర్ణించే రాజ‌న్.. మోడీ హ‌యాంలో ప్ర‌శంసలు అందుకున్నా. .ఆయ‌న ప‌ద‌వి మాత్రం పొడిగింపున‌కు నోచుకోలేదు. దీంతో.. ఆయ‌న విదేశాల్లో పాఠాలు చెప్పుకుంటున్నారు. తాజాగా ఆయ‌న బాట‌లో న‌డుస్తున్నారు విరాల్ ఆచార్య‌.

అతి చిన్న వ‌య‌సులోనే రిజ‌ర్వ్ బ్యాంక్ డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ల‌లో ఒక‌రిగా ఎంపికై.. త‌న ప‌ద‌వీ కాలం మ‌రో ఆర్నెల్లు ఉండ‌గానే.. కీల‌క ప‌ద‌వికి రాజీనామా చేసేసి వ‌ర్సిటీలో పాఠాలు చెప్పుకోవ‌టానికి వెళ్లిపోయేందుకు వీలుగా నిర్ణ‌యం తీసుకున్నారు.  2017 జ‌న‌వ‌రిలో బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆయ‌న‌.. త‌న రాజీనామా లేఖ‌ను ఈ నెల మొద‌ట్లో జ‌రిగిన ప‌ర‌ప‌తి స‌మీక్ష స‌మావేశానికి కొన్ని రోజులు ముందే స‌మ‌ర్పించిన‌ట్లుగా తెలుస్తోంది.

గ‌తంలో తాను ప‌ని చేసిన న్యూయార్క్ యూనివ‌ర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కు అర్థ‌శాస్త్రం ప్రొఫెస‌ర్ గా ఆయ‌న వెళుతున్న‌ట్లు చెబుతున్నారు. ఆర్బీఐ.. కేంద్రం మధ్య స‌రైన సంబంధాలు లేవ‌న్న మాట బ‌లంగా వినిపిస్తున్న వేళ‌.. ఆర్బీఐకి స్వ‌తంత్రత ఉండాల‌ని గ‌ట్టిగా వినిపించిన విరాల్ తాజాగా త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌టం చూస్తుంటే.. మోడీ ప్ర‌భుత్వంతో తాను పోరాడ‌లేన‌న్న విష‌యాన్ని గుర్తించిన‌ట్లుగా స‌మాచారం.

ఆర్బీఐ నిర్ణ‌యాల్లో కేంద్రం ప్ర‌త్య‌క్షంగా జోక్యం చేసుకోవ‌టం ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు మంచిదికాద‌ని అప్ప‌ట్లో విరాల్ వ్యాఖ్యానించ‌టం పెను సంచ‌ల‌నంగా మారింది. రాజ‌కీయంగా పెను దుమార‌మే రేపింది. ఆర్బీఐకు స్వేచ్ఛ‌ను కోరుకున్న విరాల్ లాంటి వాళ్లు.. త‌మ దారిన తాము చూసుకోవ‌టం చూస్తే.. రానున్న రోజుల్లో ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌ప్ప‌వా? అన్న సందేహం క‌లుగ‌క మాన‌దు.


Tags:    

Similar News