కడుపులోని మంటనంతా కక్కేశారు

Update: 2016-08-11 06:40 GMT
తనను తీవ్రంగా అవమానించిన వారి మీద ఇప్పటివరకూ ఆచితూచి మాట్లాడిన ఆర్ బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. ఆర్ బీఐ గవర్నర్ గా రెండో దఫా బాధ్యతలు చేపట్టకుండా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు.. ఆయనపై వచ్చిన తీవ్ర విమర్శల నేపథ్యంలో మనసును కష్టపెట్టుకున్న ఆయన.. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవీకాలం పూర్తి అయిన వెంటనే అధ్యాపక వృత్తిలోకి వెళ్లనున్నట్లుగా గతంలో వెల్లడించారు. తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన సందర్భంగా ఆయన తన మనసులోని బాధనంతా కక్కేశారు. తనపై విమర్శలు.. ఆరోపణలు సంధించిన వారికి కౌంటర్ ఇచ్చేలా మాట్లాడిన ఆయన.. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవి తనకు సైడ్ జాబ్ మాత్రమే అంటూ సంచలన వ్యాఖ్య చేశారు.

దేశ ఆర్థిక పరిస్థితికి అత్యంత కీలకమైన రిజర్వ్ బ్యాంకు గవర్నర్ పదవిని సైడ్ జాబ్ గా రాజన్ అభివర్ణించటంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజన్ చేసిన వ్యాఖ్యను చూస్తే.. ‘‘నేను చాలాసార్లే చెప్పా. మరోసారి స్పష్టం చేస్తున్నా. నేను ప్రాథమికంగా విద్యావేత్తను. ఆర్ బీఐ గవర్నర్ పదవి అనేది నాకు ప్రధానమైన వ్యాపకం (సైడ్ జాబ్) కాదు’’ అని వ్యాఖ్యానించారు.

మూడేళ్లుగా కీలక బాధ్యతలు పోషించిన ఆయన.. తన బాధ్యతను చిన్నదిగా చేస్తూ వ్యాఖ్యానించటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అయితే.. రాజన్ వ్యాఖ్యల్ని మరీ భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని.. ఆయన చెప్పిన ‘‘సైడ్ జాబ్’’ అన్న మాటను తప్పుడు కోణంలో చూడటం తప్పన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజన్ మాటల్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఆయన వ్యాఖ్యలో ఆర్ బీఐ గవర్నర్ పదవిని కించపర్చాలన్న ఉద్దేశం లేదన్న విషయం స్పష్టమవుతుంది. ఆయన మాటల్ని నిశితంగా పరిశీలిస్తే.. తన ప్రధాన వ్యాపకం అధ్యాపక వృత్తి అని.. ఆర్ బీఐ గవర్నర్ పదవి అనుకోకుండా తనకు లభించిన అవకాశమే అన్న ఉద్దేశమే తప్పించి మరొకటి కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన చేసిన పలు వ్యాఖ్యలు చూస్తే.. రాజకీయ కారణాలతో తనను తప్పు పట్టిన వారి పట్ల ఆయన తీవ్రంగా గాయపడినట్లుగా కనిపిస్తుంది. ఈ వాదనకు బలం చేకూరేలా ఆయన చేసిన వ్యాఖ్యలు చెప్పేస్తున్నాయి.
రాజన్ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యల్ని చూస్తే..

‘‘ప్రభుత్వ అభిప్రాయాన్ని వ్యతిరేకించాల్సి వచ్చినప్పుడు.. మళ్లీ నాకీ పదవి వస్తుందో.. రాదోనన్న బెంగ కలగలేదు. అలాగే ఇది కాకపోతే ప్రభుత్వంలో మరేదైనా పదవి దక్కుతుందా? అన్న ఆలోచన కూడా రాలేదు. ఆర్ బీఐ టీంలో సభ్యుడిగా.. దేశ శ్రేయస్సుకు అత్యుత్తమ చర్యలే తీసుకున్నానని మాత్రం చెప్పగలను’’
‘‘బోధనా వృత్తిలో ఉన్నప్పుడు వచ్చే విమర్శలు మరీ నీచంగా ఏమీ ఉండవు. కానీ.. ఇటీవల కాలంలో నాపై వచ్చిన విమర్శలు మాత్రం చాలా హేయమైనవి. ఎలాంటి ప్రాతిపదిక లేకుండానే.. ఉద్దేశపూర్వకంగానే నాపై ఆరోపణలు చేశారు’’

‘‘రాజకీయ నాయకుల విమర్శల్ని పట్టించుకోలేదు. వాటిపై దృష్టి కేంద్రీకరించలేదు. ఆర్ బీఐ గవర్నర్ పదవిలో రెండో విడత కొనసాగటం మీకు ఇష్టమా.. కాదా? అని పలువురు నన్ను ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థ మేలు కోసం.. బ్యాంకింగ్ రంగాన్ని తీర్చి దిద్దేందుకు ఆర్ బీఐలో నేను ప్రారంభించిన చర్యలన్నీ నా మూడేళ్ల పదవీకాలాన్ని దృష్టిలో ఉంచుకొని చేపట్టినవే. అయితే.. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఖాతాల్ని పారదర్శకంగా తయారు చేసేందుకు మరికొంత పని మిగిలి ది. పరపతి విధాన సమీక్ష కమిటీ రూల్స్ ను మార్చాల్సిన అవసరం ఉంది. ఈ పనులు పూర్తి చేసేందుకు.. మరికొంత కాలం పదవిలో కొనసాగేందుకు నేను సముఖంగానే ఉన్నా. ఇప్పుడు సంతోషంగానే నేను బాధ్యతల నుంచి వైదొలగనున్నా’’
‘‘రెండో విడత పదవిలో కొనసాగకపోవటంపై ఏదో నిగూఢమైన హస్తం ఉందని బావించటం లేదు. ఏం అవసరం ఉందో అదే చేశాను. నేనేం చేయాలనుకున్నానో అది చేశారు. ఒకవేళ నన్ను అడ్డుకోగలిగిన సామర్థ్యం వారికే ఉండి ఉంటే.. నా పనులకు అడ్డుపడే వాళ్లు కదా?’’

‘‘మూడున్నరేళ్లు అంతర్జాతీయ ద్రవ్యనిధిలో.. నాలుగేళ్లు భారత్ లో గడిపా. అంతమాత్రం చేత.. నేను అధికారాన్నే వృత్తిగా.. సాంకేతిక నిపుణుడిగా పేరొందలేదు. నా ఆలోచనలు.. సంస్కరణలు అమలు చేయగలిగే వృత్తినే కోరుకున్నా. గొప్ప మార్పును చూపించగలిగాం అనే సంతృప్తితోనే వైదొలుగుతున్నా’’
Tags:    

Similar News