అవును! ఇప్పుడు ఇదే విషయాన్ని వినియోగదారులను ఆర్ బీఐ ప్రశ్నిస్తోంది. సాధారణంగా మనం ఏ రకం అకౌంట్ కింద అయినా సరే ఏ బ్యాంకులో అయినా ఓ అకౌంట్ ఓపెన్ చేస్తే.. దీనికి ముందు జరిగే ప్రక్రియ - అనంతరం మన చేతికి పాస్ బుక్ వచ్చే వరకు మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయం. ఒక వేళ మనం అమౌంట్ కట్టినా.. అది మన అకౌంట్ లోనే పడుతుంది తప్ప ఒక్క రూపాయి కూడా అకౌంట్ ఓపెన్ చేసినందుకు బ్యాకులు తీసుకోవు. దీంతో మనకు ఫ్రీగానే అకౌంట్ కు సంబంధించిన పాస్ బుక్కు - ఏటీఎం డెబిట్ కార్డు అందుతున్నాయి. అయితే, ఇది ఫ్రీ గా వినియోగదారులకు ఇస్తున్నా.. దీనివెనుక చాలానే ఖర్చవుతోందని, చాలా సమయం కూడా పడుతోందని ఆర్ బీఐ గణాంకాలతో సహా వివరించింది. మరి అవేంటో చూద్దామా?
ఒక బ్యాకు ఖాతా తెరిచేందుకు దాదాపు 139 రూపాయల మేర ఖర్చు అవుతోందని ఆర్ బీఐ వెల్లడించింది. అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఇచ్చే ఫారం మొదలుకుని కంప్యూటర్ లో ఓ పేజ్ క్రియేట్ చేసి వినియోగదారుని వివరాలు నింపేందుకు - వినియోగదారుడి నుంచి సేకరించిన ధ్రువపత్రాలు నిక్షిప్తం చేయడం - పాస్ బుక్ ప్రింటింగ్ - ఏటీఎం కార్డు కేటాయింపు వంటి వాటికి ఈ మొత్తం ఖర్చువుతున్నట్టు బ్యాంకు వెల్లడించింది. అదేసమయంలో అకౌంట్ ఓపెన్ చేసే వినియోగదారునితో బ్యాంకు సిబ్బంది కేటాయించే సమయం గురించి కూడా ఆర్ బీఐ లెక్కలు చెప్పింది. ముఖ్యంగా డాక్యుమెంటేషన్ సమయంలో ఎక్కువగా సమయం వెచ్చించాల్సి వస్తుందని వెల్లడించింది.
2016లో బ్యాంకుల ఆడిట్ లో వెల్లడైన డేటా మేరకు ముందస్తు ప్రక్రియలన్నీ అయిపోయిన తర్వాత కేవలం డాక్యుమెంటేషన్ కోసమే రెండు గంటల మేర సమయం పడుతుందట. దీని ఖర్చు కూడా 77 రూపాయలని తెలిసింది. పలు పత్రాల్లో వివరాలు నింపడానికి 20 నిమిషాల సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. ట్రావెలింగ్ కు 3 గంటల 22 నిమిషాలు.. ఇలా మొత్తంగా ఏడు గంటల 28 నిమిషాల మేర సమయాన్ని బ్యాంకు అకౌంట్ తెరవడానికే వినియోగించాల్సి వస్తుందని ఆర్ బీఐ రిపోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే టెక్నాలజీ మార్గాలతో బేసిక్ బ్యాంకింగ్ ఖర్చులను తగ్గించాలని భావిస్తున్నట్టు తెలిపింది. అంటే ఇకపై... ఆన్‌లైన్ అకౌంట్లు తెరిచేందుకు, పెన్ను, పేపరు లేని విధానానికి మొగ్గు చూపేందుకు ఆర్ బీఐ సిద్ధమవుతోందని తెలుస్తోంది. మరి ఆ విధానం ఎలా ఉంటుందో చూడాలి.