మే 23న ఫలితాలు కష్టమే..

Update: 2019-05-20 09:52 GMT
మే 23. ఇప్పుడు ఈ తేదీ కోసమే దేశ ప్రజలంతా ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నారు. ఏపీలోనూ ఈసారి ఎవరిది అధికారం అనేది తేలేది 23నే. ఈ నేపథ్యంలో ఈరోజుకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఆరోజు ఫలితం అంత త్వరగా తేలదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకు గల కారణాలను వెల్లడిస్తున్నారు.

*వీవీ ప్యాట్స్, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపే కారణం
మే 23న ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. కానీ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 14 నుంచి 16 గంటలు పడుతుందని అధికారులు అంచనావేస్తున్నారు.  ఈవీఎంలను ప్రతీ రౌండులో రెండింటిని లెక్కిస్తారు. ఒక్కో ఈవీఎం ఓట్ల రౌండు లెక్కింపును 30 నుంచి 40 నిమిషాలు పడుతుందని అంచనా.ముందుగా పోస్టల్ బ్యాలెట్లు.. ఆతర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపును చేపడుతారు. ఈ రెండూ పూర్తయిన తర్వాత వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కిస్తారు. వీవీ ప్యాట్ లను ఒక్కో నియోజకవర్గానికి ఐదింటిని లెక్కించాలి. దీనికి ఆరుగంటల సమయం పట్టే అవకాశం ఉందని తేల్చారు. పోస్టల్ బ్యాలెట్స్, ఈవీఎంల ఓట్ల లెక్కింపును సాయంత్రం 6 గంటల వరకు పూర్తి చేస్తే.. వీవీ ప్యాట్స్ లెక్కింపునకు మరో 6 గంటల సమయం పడుతుంది. దీంతో అర్ధరాత్రి దాటిన తర్వాతే అధికారికంగా ఫలితాలను, ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారు..

*ఆలస్యానికి కారణమిదే..
2014 ఎన్నికలతో పోల్చితే 2019 ఎన్నికల్లో అనేక మార్పులు వచ్చాయి. అప్పట్లో వీవీ ప్యాట్ లు లేవు. ఈసారి ప్రవేశపెట్టారు. వాటి లెక్క తేల్చడానికే చాలా సమయం పడుతుంది.  ర్యాండమ్ పద్ధతిలో  కేంద్ర ఎన్నికల పరిశీలకులు ఎంపిక చేసి లెక్కించి ఓట్ల ఫలితాన్ని రౌండ్ల లెక్కన వెల్లడిస్తారు. అందుకే ఈసారి ఆలస్యం అనివార్యంగా మారింది. తొలి రౌండ్ పూర్తయ్యి ఫలితం అధికారికంగా ప్రకటించాలంటే కనీసం గంటన్నర సమయం పడుతుంది. ప్రతీ రౌండుకు 30 నిమిషాలు వేసుకున్నా 17 రౌండ్లు ఉండడంతో 9 గంటల సమయం పడుతుంది. అయితే కొన్నింటి ఫలితాలు సాయంత్రం 7లోపు వచ్చే అవకాశాలున్నాయి.

*విరామాలు, అభ్యంతరాలతో మరింత ఆలస్యం..
ఇక లెక్కించే సిబ్బంది మధ్యాహ్నం, రాత్రి భోజనాల విరామాలు కూడా లెక్కించాల్సి ఉంటుంది. దీంతోపాటు ఎవరైనా అభ్యంతరాలు, అవాంతరాలు సృష్టిస్తే లెక్కింపు మరింత ఆలస్యమవుతుంది. వీవీ ప్యాట్స్ లెక్కింపే అసలు ఆలస్యానికి కారణంగా ఉంది. తొలుత అభ్యర్థుల ఓట్లను వేరే చేయడం.. తర్వాత లెక్కించడం ఎంతలేదన్నా గంటల సమయం పడుతుందని అధికారులు అంచనావేస్తున్నారు. ఆ తర్వాత ఈసీ అనుమతితో అధికారికంగా విజేతను ప్రకటిస్తారు. కొన్ని మే 23న కొన్ని 23 అర్థరాత్రి దాటాక 24వ తేదీన ఫలితం తేలే అవకాశం ఉంది.

    

Tags:    

Similar News