చీకోటి ప్రవీణ్ 'క్యాసినో' దందా వెనుక కారణమేంటి?

Update: 2022-08-01 05:42 GMT
చీకోటి ప్రవీణ్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇతగాడి పేరే వినిపిస్తోంది. తెలుగురాష్ట్రాల్లో సంచలనమైన 'క్యాసినో' కేసులో ఇతడే ప్రధాన ముద్దాయి. చీకోటి ప్రవీణ్ తోపాటు మరో ముగ్గురు లావాదేవీలు, బ్యాంకు అకౌంట్లను పరిశీలించిన ఈడీ మొత్తంగా రూ.25 కోట్ల లావాదేవీలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ నగదు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఎలా మార్పిడి చేశారు? వంటి అంశాలపై ఈడీ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. తాజాగా ఈడీ ఈ కేసులో ఏడుగురికి నోటీసులు జారీ చేసింది. వారంతా సోమవారం తమ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది.

ఏడుగురిలో మొదటి వ్యక్తి చీకోటి ప్రవీణ్ కాగా.. రెండో వ్యక్తి మాధవరెడ్డి, మూడో వ్యక్తి సంపత్, మిగతా నలుగురు హవాలా ఆపరేటర్లు. వీరందరి అకౌంట్లను పరిశీలించిన తర్వాత నోటీసులు జారీ చేసింది. చీకోటి ప్రవీణ్ వద్ద స్వాధీనం చేసుకున్న ఫోన్లు, కంప్యూటర్ ఇతర ఆధారాలను సాకేంతికంగా విశ్లేషించిన తర్వాత పెద్ద ఎత్తున కేసినో నిర్వహణ, హవాలా లావాదేవీలకు సంబంధించిన సమాచారం తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రాథమిక ఆధారాలు లభించడంతో చీకోటి ప్రవీణ్ తోపాటు మాధవరెడ్డి, సంపత్, ఇతర హవాలా ఆపరేటర్ల దగ్గర నుంచి మరిన్ని వివరాలు రాబట్టి హవాలా ద్వారా నగదు చెలామణీ చేసిన వారికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. వీరంతా ప్రస్తుతానికి కేసినోలు, హవాలాకు పాల్పడిన వారే. అలా వ్యవహరించి కమీషన్లు పొందారు. కానీ అసలు డబ్బులు చెలామణి చేసిన వారిలో ఎక్కువ మంది పంటర్లు ఉన్నారు.

కేసినోలకు అలవాటు పడిన ప్రముఖులు, రాజకీయ నేతలు, సంపన్నులు చీకోటి ప్రవీణ్ ద్వారా గోవా, నేపాల్, బ్యాంక్ కేసినోలకు వెళ్లేవారు. వారు ఇక్కడ నగదు రూపంలో లక్షలు చీకోటి ప్రవీణ్ అతడి ఏజెంట్లకు చెల్లిస్తే .. వారు ఏ దేశానికి వెళతారో? ఆ దేశం కరెన్సీని కమిషన్ మినహాయించుకొని సమకూరుస్తారు.ఇలా కరెన్సీ కంటే ఎక్కువగా వారు కేసినోలో ఆడే కాయిన్స్ ఇస్తారని చెబుతున్నారు. తర్వాత అక్కడ ఓడిపోతే ఇక్కడ తీసుకునే సమస్య ఉండదు.ఇక కేసినోల్లో విదేశాల్లో గెలుచుకుంటే వాటిని వైట్ మనీగా ఇండియాకు చేర్చే బాధ్యత కూడా చీకోటి ప్రవీణ్ తీసుకుంటారని చెబుతున్నారు. దానికీ కమిషన్ పొందుతాడని అంటున్నారు.

చీకోటి ప్రవీణ్, మాధవ్ రెడ్డి ఇంట్లో ఈడీ సుమారుడు 16 గంటలు సోదాలు చేసింది. వీరిద్దరు నడుపుతున్న క్యాసినోలలో అవకతవకలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. అయితే ఇందులో కొంత మంది సినిమా వాళ్లు, రాజకీయ నేతలు కూడా ఉన్నారన్న వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ క్యాసినోను ఎలా నిర్వహిస్తారు.? ఇప్పుడు వీటిని నిర్వహించే వారిపై ఈడీ ఎందుకు సోదాలు చేస్తోంది.

-చీకోటి ప్రవీణ్, మాధవ్ రెడ్డికి కనెక్షన్ ఏంటి?

చీకోటి ప్రవీణ్ ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నారు. గోవా, శ్రీలంక, నేపాల్, థాయ్ లాండ్లలో క్యాసినో నిర్వహణతో పాడు స్థానికంగానూ జూదం నిర్వహించి అతడు పోలీసులకు పట్టుబడిన సందర్భాలున్నాయి. గతంలో సంక్రాంతికి ప్రవీణ్ కుమార్ గుడివాడలో క్యాసినో ఏర్పాటు చేయడం కూడా అప్పట్లో వివాదాస్పదమైంది. అప్పట్లో ఆయనకు సహకరించిన వారు ఇప్పుడు ఈడీ సోదాలతో ఉలిక్కిపడుతున్నారు. ప్రవీణ్ కుమార్ కు అత్యంత సన్నిహితుడు మాధవ్ రెడ్డి.

విదేశాల్లో క్యాసినోలకు అనుమతి ఉంది. నేపాల్ లో క్యాసినో నిర్వహణ చట్టవిరుద్ధం కాదు. కానీ పంటర్స్, ఏజెంట్లు చేసిన లావాదేవీలు మాత్రం దొడ్డిదారిన చేసినట్లు ఈడీ చెబుతోంది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి నేపాల్ లోని బాగ్డోడ్రా విమానాశ్రయం వరకూ పేకాటరాయుళ్లకి నాలుగు రోజుల ప్యాకేజీ అందించేవారు. లక్షల్లో ఉండే ఈ ప్యాకేజీలో వారికి కావాల్సిన సౌకర్యాలు, పేకాట ఆడటానికి అన్ని వసతులు అందించేవారని ఈడీ విచారణలో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News