2014 సీనే తాజాగా కేసీఆర్ కు ఎదురైంద‌ట‌!

Update: 2019-06-15 04:24 GMT
2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌లో.. మోడీని ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన అతి కొద్ది మంది అధినేత‌ల్లో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఒక‌రుగా చెప్పాలి. బీజేపీ ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా ఉన్న ఆయ‌న్ను ఉద్దేశించి అప్ప‌ట్లో ఎవ‌రూ అన‌ని రీతిలో వ్యాఖ్య‌లు చేసిన తీరు సంచ‌ల‌నంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ కూడా జ‌రిగింది. దీని ఫ‌లిత‌మే.. అప్ప‌టి ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత చాలా కాలం పాటు త‌న అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌కుండా మోడీ బ‌దులు తీర్చుకున్నార‌ని చెబుతారు.

త‌ర్వాతి కాలంలో అదే ప‌నిగా జ‌రిపిన రాయ‌బారాల‌తో మెత్త‌బ‌డిన మోడీ.. కేసీఆర్ కు టైమిచ్చిన‌ట్లుగా చెబుతారు. అప్ప‌టివ‌ర‌కూ త‌న ఢిల్లీ టూర్ ను ప్ర‌క‌టించ‌టం.. అంత‌లోనే కాన్సిల్ చేసుకోవ‌టం లాంటివి చేసేవారు. ఢిల్లీకి వెళ‌తాన‌ని చెప్ప‌టం.. ఆ త‌ర్వాత ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకోవ‌టం రివాజుగా మారేది.

ప్ర‌జ‌ల మ‌ధ్య పెద్ద‌గా ఉండ‌ని కేసీఆర్.. త‌న‌కు ప్ర‌ధాని మోడీ టైమివ్వ‌టం లేద‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం వ‌చ్చేది కాదు. ఢిల్లీ స్థాయిలో త‌న‌కున్న‌ప‌రిచ‌యాల‌తో మోడీ మ‌న‌సును మార్చ‌గ‌లిగిన కేసీఆర్.. అప్ప‌టి నుంచి ఆచితూచి అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించేవారు. ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో కాసింత హ‌డావుడి చేయ‌ట‌మే కాదు.. కాంగ్రెస్‌.. బీజేపీల‌కు ప్ర‌త్యామ్నాయంగా కూట‌మి ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి ప‌లు రాష్ట్రాల్లోని ప్ర‌ముఖుల్ని క‌లిసి.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంశంపై చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లుగా చెబుతారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా త‌మ‌ను ఉద్దేశించి కేసీఆర్ చేసిన విమ‌ర్శ‌ల విష‌యంలో మోడీ చాలా సీరియ‌స్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఊహించ‌ని రీతిలో తెలంగాణ‌లో నాలుగు ఎంపీ స్థానాల్ని గెలుచుకోవ‌టంతో.. ప్ర‌జాక్షేత్రంలో మోడీకున్న ఇమేజ్ ను అర్థం చేసుకున్న బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం తెలంగాణ‌లో పార్టీని మ‌రింత పటిష్టం చేసుకునేలా ప్ర‌య‌త్నాలు షురూ చేశారు.

ఇలాంటివేళ‌.. మ‌ళ్లీ రాజీ మార్గానికి సంకేతాలు ఇస్తూ కేంద్రానికి ద‌గ్గ‌ర‌య్యేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. ఈ వాద‌న‌ను బ‌ల‌ప‌రుస్తూ కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి ప్ర‌ధాని మోడీని పిల‌వాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. త‌న‌కు టైమిచ్చిన‌ట్లే ఇచ్చి.. ఇప్పుడు చేతులు ఎత్తేయ‌టంతో తాజాగా కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ర‌ద్దైన‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే 2014లో మోడీ మాష్టారి దగ్గ‌ర కేసీఆర్ ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయో.. తాజాగా అదే రిపీట్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. మోడీ నుంచి సానుకూలత రాని నేప‌థ్యంలో కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News