కేసీఆర్ ముంద‌స్తు ధీమా ఇదేన‌ట‌!

Update: 2018-10-08 05:00 GMT
మొత్తం 119 స్థానాల్లో వంద స్థానాల్ని అధికార పార్టీ సొంతం చేసుకోవ‌టం మామూలేనా?  అంటే.. లేదు.. చాలా క‌ష్ట‌మ‌న్న మాట రాజ‌కీయాల మీద ఏ మాత్రం అవ‌గాహ‌న ఉన్నోళ్లు అయినా చెబుతుంటారు. కానీ.. అందుకు భిన్న‌మైన మాట‌లు తెలంగాణ రాష్ట్ర ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నోటి నుంచి వినిపిస్తుంటాయి. వంద ఏంటి?  అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే 110 సీట్లు వ‌చ్చేస్తాయంటూ ఆయ‌న చెబుతున్న మాట‌లు కాస్త ఎట‌కారంగా అనిపిస్తున్నాయి. అయితే.. త‌మ సారూ ప్లానింగ్ ఎలా ఉంటుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోయి అలా అంటున్నారు కానీ.. వంద‌కు త‌గ్గ‌కుండా సీట్లు ఎలా? అన్న విష‌యాన్ని గులాబీ నేత‌లు ఇప్పుడు లెక్క‌ల మీద లెక్క‌లు చెబుతున్నారు.

ముంద‌స్తు గెలుపు ధీమా గురించి ఇప్ప‌టివ‌ర‌కూ సాగిన ప్ర‌చారానికి భిన్నంగా ఇప్పుడు స‌రికొత్త ప్ర‌చారాన్ని గులాబీ బాస్ తెర మీద‌కు తెస్తున్నారు. ముంద‌స్తుకు ముందు గులాబీ బ్యాచ్ కు గెలుపు పెద్ద క‌ష్టం కాద‌న్న ప్ర‌చారం సాగినా.. ప్ర‌భుత్వం ర‌ద్దై.. ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌ట‌న తెర మీద‌కు వ‌చ్చేస‌రికి వాతావ‌ర‌ణం మారిపోయిన వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు. మొన్న‌టివ‌ర‌కూ గులాబీ పార్టీకి తిరుగులేద‌న్న మాట చెప్పినోళ్లు సైతం.. అంత తేలికేం కాదు.. కాస్త క‌ష్ట‌ప‌డాల్సిందేన‌న్న మాట వినిపిస్తోంది.

ఇలాంటి వేళ‌.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం గెలుపు మీద ధీమాగా ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఎవ‌రెన్ని చెప్పినా తాము గెల‌వ‌టం ఖాయ‌మ‌ని ఆయ‌న తేల్చేస్తున్నారు. ఎందుకంత కాన్ఫిడెంట్ అంటే.. అందుకు కార‌ణం లేక‌పోలేద‌న్న వాద‌న‌ను వినిపించ‌ట‌మే కాదు.. గ‌ణాంకాల్ని చూపిస్తూ గెలుపు ధీమాను ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

ముంద‌స్తులో గెలుపు ఖాయ‌మ‌న్న ధీమా కేసీఆర్ కు ఎందుకు? అన్న ప్ర‌శ్న వేస్తే.. దానికి ఆ పార్టీకి చెందిన కీల‌క నేత‌ల వ‌ద్ద కేసీఆర్ చెప్పిన లెక్క‌ల్ని తాజాగా ప్ర‌స్తావిస్తున్నారు. పార్టీ గ‌ణాంకాల ప్ర‌కారం కేసీఆర్ స‌ర్కారు అమ‌లు చేసిన ప‌థ‌కాల ల‌బ్థిదారుల సంఖ్య ప్ర‌తి కుటుంబంలో ఇద్ద‌రు వ‌ర‌కూ ఉంటార‌ని చెబుతున్నారు.

కొన్ని కుటుంబాల్లో అయితే.. ఒకే వ్య‌క్తి రెండు మూడు ప‌థ‌కాల కింద ల‌బ్థి పొంద‌ట‌మే కాదు.. ప్ర‌భుత్వం కార‌ణంగా ఆర్థికంగా కాసింత బ‌ల‌ప‌డేందుకు సాయంగా నిలిచింద‌ని చెబుతున్నారు. గ‌ణాంకాల ప్ర‌కారం చూస్తే.. తెలంగాణ‌లో 90 శాతం మంది దారిద్య్ర రేఖ‌కు దిగువ‌న ఉన్న వారే. అలాంటి వారంతా ఏదో ఒక ప‌థ‌కం కింద కేసీఆర్ స‌ర్కారులో ల‌బ్థి పొందినోళ్లేన‌ని చెబుతున్నారు.

కేసీఆర్ స‌ర్కారు అమ‌లు చేసిన ప‌థ‌కాల్లో ఆసరా - వృద్ధాప్య - వితంతు - ఒంటరి మహిళలకు పింఛన్లు - బీడీ కార్మికులకు భృతి - కల్యాణలక్ష్మి - షాదీ ముబారక్‌ - ఓవర్‌ సీస్‌ స్కాలర్‌ షిప్స్‌ - వ్యవసాయ రుణ మాఫీ - రైతు బంధు - రైతు జీవిత బీమా - పాఠశాలలు - హాస్టళ్లలో సన్నబియ్యం లాంటి ప‌థ‌కాలెన్నో అమ‌ల్లోకి రావటం.. వాటి ల‌బ్థిదారులు ప్ర‌తి కుటుంబంలో ఉండ‌టంతో.. అధికార‌పార్టీకి గెలుపు ఖాయ‌మ‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి.. కేసీఆర్ అండ్ కో చెబుతున్న లెక్క‌లు ఎంత‌వ‌ర‌కు వ‌ర్క్ వుట్ అవుతాయ‌న్న‌ది ప్ర‌శ్న‌. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సంక్షేమ‌ ప‌థ‌కాల్ని పొంద‌టం త‌మ హ‌క్కుగా భావిస్తున్న ప్ర‌జ‌ల మైండ్ సెట్ ఉన్న నేప‌థ్యంలో.. మీ బ‌తుకుల్ని మార్చేందుకు మేమెంత చేశారో తెలుసు క‌దా? అన్న మాట‌లు వారిపై ఎంత‌మేర ప్ర‌భావం చూపిస్తాయ‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News