కేసీఆర్ 'నో కామెంట్' పాలిటిక్సు

Update: 2016-11-20 11:11 GMT
 నోట్ల రద్దు వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పిల్లిమొగ్గలు వేస్తుండడంపై రాజకీయ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.  తొలుత వ్యతిరేకించి.. మళ్లీ సమర్థించి - ఆ తరువాత వ్యతిరేకించి మళ్లీ ఇప్పుడు సమర్థిస్తున్న కేసీఆర్ ఇంతటి కీలక విషయంలో సరైన స్టాండ్ ఎందుకు తీసుకోలేకపోతున్నారన్న ప్రశ్న వినిపిస్తోంది. దీని వెనుక రాజకీయ కోణాలున్నాయని చెబుతున్నారు.

కేసీఆర్ ఈ విషయంలో త‌న వ్యూహాన్ని అక‌స్మాత్తుగా ఎందుకు మార్చుకున్నారు? నోట్ల ర‌ద్దుపై మొద‌ట ఆందోళ‌న వ్యక్తం చేసిన ఆయన ఇప్పుడు మోడీకి మ‌ద్దతు ప‌ల‌కాల‌ని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? అన్న చ‌ర్చ సాగుతోంది. నోట్ల ర‌ద్దుపై సీఎం కేసీఆర్ తొలుత అసంతృప్తినే వ్యక్తం చేశారు. దీంతో ఆయ‌న కేబినెట్‌ లో కీల‌క మంత్రులు హ‌రీశ్‌ - కేటీఆర్ లు కూడా కేంద్రాన్ని త‌ప్పుబ‌ట్టారు. ఇదే విష‌యాన్ని కేంద్రానికి నివేదిక రూపంలో తెలియ‌జేయాల‌ని అనుకున్నారు. 16న పార్లమెంటు స‌మావేశాలు మొద‌లు కాగానే టీఆర్ ఎస్ ఎంపీలు కూడా ఈ విష‌య‌మై ఆందోళ‌న‌ చేయాలనుకున్నారు. కానీ.. మ‌ధ్యాహ్నానికి ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది.  నోట్ల ర‌ద్దుపై ప్రతిపక్షాలు పోడియం వ‌ద్దకు వెళ్లి నిర‌స‌న‌లు తెలిపాయి. అదే స‌మ‌యంలో కేసీఆర్ నుంచి టీఆర్ ఎస్ ఎంపీల‌కు సందేశాలు వెళ్లాయి. పోడియం వ‌ద్దకు వెళ్లొద్దని ఆదేశాలు అందాయి. గులాబీద‌ళంలో ఒక్కసారిగా వ‌చ్చిన ఈ మార్పు చూసి అంతా అవాక్కవుతున్నారు.

ప‌్రజా తిరుగుబాటు వ‌స్తుంద‌ని ఆందోళ‌న వ్యక్తం చేసిన కేసీఆరే మళ్లీ ఎందుకు వెనక్కు తగ్గారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.  అయితే... రాజకీయ విశ్లేషకులు దీనికి కారణాలు చెబుతున్నారు. కేంద్రంతో అవసరాలు... చంద్రబాబు కేంద్రానికి మరింత దగ్గర కాకుండా చూడడానికి ఆయన తన స్టాండ్ మార్చుకున్నారని చెబుతున్నారు.

తెలంగాణ కొత్తరాష్ట్రం. పైగా ఆస్తుల విభ‌జ‌న‌ - ఉద్యోగులు - ఆస్తుల పంప‌కాలు ఇంకా పూర్తి కాలేదు. ఈ స‌మ‌యంలో కేంద్రంతో క‌య్యానికి కాలు దువ్వితే.. ఆర్థికంగా ఇబ్బందులు త‌ప్పవ‌న్న ఆందోళ‌న‌తో వెన‌క‌డుగు వేశార‌ని విశ్లేషిస్తున్నారు. కేంద్రానికి కేసీఆర్ మీద కోపం పెరిగితే.. చంద్రబాబు మ‌రింత ద‌గ్గర‌య్యే ప్రమాద‌ముంది. బాబు మ‌రింత చేరువైతే.. త‌నను ఇబ్బంది పెట్టడానికి ఆయ‌న మ‌రిన్ని ఎత్తులు వేస్తాడని కేసీఆర్ భ‌య‌ప‌డ్డారని.  అందుకే కేంద్రాన్ని విమ‌ర్శించ‌డం మాని ఇబ్బందులు తెలియ‌జేస్తే స‌రిపోతుంది క‌దా! అన్న నిర్ణయానికి వ‌చ్చారని చెబుతున్నారు.

మరోవైసు నోట్ల రద్దు అంశం రాష్ట్రం పరిధిలోనిది కాదు.. కాబట్టి దాని మంచైనా చెడైనా టీఆరెస్ పై పడదు. అలాంటప్పుడు అనవరసర విషయంలో వేలు పెట్టడం ఎందుకన్న ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. రద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేసీఆర్ నివేదిక ఇచ్చిన విషయంలో ప్రజలకు తెలిస్తే చాలని ఆయన అనుకుంటున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News