ఫాంహౌస్ ప్లాన్ చెదిరిపోతుంటే కేసీఆర్‌ కు కోపం రాదా?

Update: 2018-10-04 06:30 GMT
అస‌లే కేసీఆర్‌. ఆ పైన కోపం వ‌స్తే? ప‌్ర‌త్య‌ర్థుల‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌టాన్ని పలువురు త‌ప్పు ప‌డుతున్నారు. రాజ‌కీయాల్లో దాడి మామూలే కానీ.. మ‌రీ ఇంత తీవ్ర‌స్థాయిలో మ‌హోగ్ర దాడి అన్న‌ట్లుగా ఉండొద్ద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అయినా.. గిరి గీసుకొని ఆడ‌టానికి ఇదేమైనా గోలీలాట‌? 
రాజ‌కీయాలు క‌ర్క‌సంగా ఉంటాయి. ఆ విష‌యం రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ముందే హెచ్చ‌రిస్తారు. మొమ‌హాటాల‌కు అస్స‌లు పోకూడ‌దు.. ప్ర‌త్య‌ర్థిని క‌త్తితో కోసేసిన‌ట్లుగా మాట్లాడేందుకు సైతం వెనుకాడ‌కూడ‌ద‌ని.. అలాంటి మైండ్ సెట్ ఉన్నోళ్ల‌కే త‌ప్పించి.. మామూలోళ్లు.. మంచోళ్లు రాజ‌కీయాలు చేస్తామంటూ బుర‌ద నిండా అంటించుకోవ‌టం మిన‌హా మిగిలేదేమీ ఉండ‌ద‌ని హెచ్చ‌రిస్తుంటారు. దూకుడు రాజ‌కీయాల‌కు మ‌సాలా మాట‌లే ప్రాణ‌మ‌ని.. ఎంత‌గా చెల‌రేగిపోతే అంత‌గా స్పంద‌న ఉంటుంద‌న్న విష‌యం.. కేసీఆర్ తిట్ల వ‌ర్షం కురిపిస్తున్న వేళ‌.. స‌భ‌కు వ‌చ్చినోళ్ల కేరింత‌ల్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ఇంత‌కీ కేసీఆర్‌ కు అంత కోపం ఎందుకు వ‌చ్చింది? క‌త్తితో కండ‌.. కండాలుగా చీల్చేసిన‌ట్లుగా ఆయ‌న అంత ప‌రుష వ్యాఖ్య‌లు ఎందుకు చేశారు?  ఆరంభ‌మే ఇంత‌లా ఉంటే.. ఎన్నిక‌ల ప్ర‌చారం చివ‌ర‌కు వ‌చ్చేస‌రికి వాతావ‌ర‌ణం మ‌రెంత హీటెక్కి పోతుంద‌న్న‌ది ఆలోచిస్తేనే చెమ‌ట‌లు ప‌ట్టటం ఖాయం.

ఆవేశ‌కావేశాల‌తో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌న్న‌ది తాజాగా కేసీఆర్ మాట‌ల్ని వింటే ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పాలి. కేసీఆర్‌కు ఎందుకింత కోపం అన్న ప్ర‌శ్న‌ను కాస్త మార్చి.. ఇంత కోపం ఎందుకు రాద‌న్న ప్ర‌శ్న‌ను వేసుకుంటే స‌బ‌బుగా ఉంటుందేమో.

నెల‌ల త‌ర‌బ‌డి ఫాంహౌస్ లో కూర్చొని ముచ్చ‌ట‌ప‌డి గీసుకున్న ముంద‌స్తు ప్లాన్ తో మ‌రో ఐదేళ్లు అధికారం ఏటీఎంలోకి వెళ్లి కార్డు పెట్టి.. నాలుగు బ‌ట‌న్లు నొక్కినంత‌నే వ‌చ్చి ప‌డే నోట్ల మాదిరి వ‌చ్చేస్తుంద‌న్న ధీమాతో ఉన్న కేసీఆర్ కు.. మ‌హా కూట‌మి అంటూ క‌ల చెదిరిపోయేలా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతుంటే ఆ మాత్రం కోపం రాకుండా ఉంటుందా?

ఏదో కేసీఆర్ కాబ‌ట్టి మాట‌లు స‌రి పెట్టారు. అదే ఇంకెవ‌రైనా అంటూ గులాబీ నేత‌లు ఆవేశంతో చెబుతున్న మాట‌లు వింటే.. కేసీఆర్ అండ్ కో తెలంగాణను త‌మ సొంత‌మ‌న్న భావ‌న‌లో ఉన్న‌ది అర్థం కాక మాన‌దు.

మ‌రి.. తెలంగాణ అధికారాన్ని చేతిలో ఉంచుకోవాల‌ని విప‌రీతంగా త‌పించే కేసీఆర్ లాంటి అధినేత ఆగ్ర‌హాన్ని నిండు మ‌న‌సుతో అర్థం చేసుకోవాలే కానీ.. ఆవేద‌న చెంద‌టం పాప‌మ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. కేసీఆర్ లాంటి నేత అధికారం ఎంత కాలం కావాలంటే అంత కాలం ఇచ్చేయాలే కానీ.. ఎదురు తిరిగి ప్ర‌శ్నించే సాహ‌సం చేస్తే సారుకు కోపం రాదా ఏంటి?  మామూలుగా అయితే.. చూసిచూడ‌న‌ట్లుగా ఊరుకుండే వారే. కానీ.. త‌న‌కేమాత్రం న‌చ్చిన చంద్ర‌బాబు మ‌ళ్లీ సీన్లోకి వ‌స్తున్న‌ప్పుడు ఆయ‌న ఆవేశం క‌ట్ట‌లు తెగ‌కుండా ఉంటుందా?
Tags:    

Similar News