ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చెప్పినట్లే చేస్తే.. అచ్చెన్న.. నిమ్మలకు భారీ షాక్

Update: 2021-09-22 06:06 GMT
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభ్యులు మాట్లాడిన మాటల్లో.. ప్రస్తావించిన అంశాల్లో తప్పులు జరిగితే శిక్ష ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయాన్ని తెలియజేసేలా తాజాగా ఏపీ ప్రివిలేజ్ కమిటీ డిసైడ్ చేసింది. తాజాగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు పంపిన సిఫార్సుల్లో. 2024 వరకు టీడీపీ శాసనసభాపక్ష ఉప నాయకులు కింజరాపు అచ్చెన్నాయుడు.. నిమ్మల రామానాయుడుకు మైకు ఇవ్వకూడదని పేర్కొంది.

ఉద్దేశపూర్వకంగా అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు ఫలితంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. మద్యం షాపులు.. పింఛన్లకు సంబంధించి అచ్చెన్నాయుడు.. నిమ్మల రామానాయుడు అసెంబ్లీకి తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని పేర్కొంది. తమ నిర్ణయాన్ని స్పీకర్ కు తెలియజేస్తామని.. ఎప్పుడు అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకుంటారో అప్పటి నుంచి 2024 వరకు మైక్ ఇవ్వరని పేర్కొన్నారు.

స్పీకర్ తమ నిర్ణయాన్ని అమలు చేయటానికి ముందు.. సభ్యుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే స్పీకర్ హక్కులకు భంగం కలిగే విధంగా ప్రకటనలు చేసిన కూన రవికుమార్ ఉద్దేశ పూర్వకంగా ప్రివిలేజ్ కమిటీ నోటీసులు తీసుకోవటం లేదని.. దీనిపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఒకవేళ ఆ ఆరోపణ నిజమని తేలితే.. తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. మొత్తంగా చూస్తే.. సభలోని టీడీపీ సభ్యులకు సంబంధించి తీసుకుంటున్న చర్యల పుణ్యమా అని.. రానున్న రోజుల్లో అసెంబ్లీలో వారి తరఫున బలంగా గళాన్ని వినిపించే వారు కరువు అయ్యే ముప్పు ఉంది. మరి.. దీనిపై ప్రధాన ప్రతిపక్షం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.






Tags:    

Similar News