కరోనా నుంచి కోలుకున్నా.. 9 నెలలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలట

Update: 2021-05-27 08:30 GMT
ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా మహమ్మారి.. సెకండ్ వేవ్ దెబ్బకు భారత్ ఎంతలా ఇబ్బంది పడిందో తెలిసిందే. కొవిడ్ టార్గెట్ మొత్తం మనిషిలోని ఊపిరితిత్తులే అన్నది తెలిసిందే. నిజానికి ఈ వైరస్ బారిన పడి చనిపోయే వారిలో ఎక్కువమంది ఊపిరితిత్తులకు సోకే ఇన్ఫెక్షన్ కారణమనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పటివరకు ఉన్న అంచనా.. అవగాహన ప్రకారం.. వైరస్ బారిన పడిన తర్వాత మూడు నెలల పాటు ఊపిరితిత్తులు దెబ్బ తినే అవకాశం ఉందన్న కొత్త విషయాన్ని యూకేలోని షెఫీల్డ్ వర్సిటీ.. ఆక్స్ ఫర్డ్ వర్సిటీ పరిశోధకులు సంయుక్త అధ్యయనంలో తేలింది.

కొన్ని కేసుల్లో అయితే మూడు కాదు ఏకంగా తొమ్మిది నెలల పాటు ఈ డ్యామేజీ కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. కరోనాతో కోలుకున్న తర్వాత లంగ్స్ మునుపటి స్థాయికి చేరుకోవాలంటే మూడు నెలలకు పైనే పడుతుందని.. అప్పటివరకు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. సాధారణంగా ఊపిరితిత్తులకు జరిగే డ్యామేజ్ ను గుర్తించటానికి సిటీ స్కాన్.. క్లినికల్ పరీక్షల ద్వారా తెలుసుకుంటాం కదా? కానీ.. వాస్తవంగా జరిగే డ్యామేజ్ ను వీటితో సరిగా గుర్తించలేమని.. ఇమేజింగ్ అనే ఆధునిక విదానంతో మరింత బాగా తెలుసుకునే వీలుందని చెబుతున్నారు.

తాజా అధ్యయన వివరాల్ని రేడియాలజీ జర్నల్ లో ప్రచురించారు. కరోనా బారిన పడి ఇంట్లో ఉండి కోలుకున్న వారు.. దీర్ఘకాలం శ్వాస సమస్యలు ఉంటే.. వారి ఊపిరితిత్తులు ఇంకా కోలుకోనట్లేనని పరిశోధకులు చెబుతున్నారు. కరోనా పెద్దగా రాలేదు.. నన్నేమీ చేయలేదన్న అనవసరమైన ధీమాను డిలీట్ చేసి.. ఒళ్లు దగ్గర పెట్టుకొని అనుక్షణం శరీరం చెప్పే మాటల్ని ఎప్పటికప్పుడు వినాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉండగలుగుతాం.
Tags:    

Similar News