సుడి అంటే బాబుదే.. జగన్ మాట చెప్పి బతికేయొచ్చు

Update: 2021-07-03 00:30 GMT
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని చూస్తే.. ఆయన ప్రత్యర్థులు సైతం ఒక్కోసారి అయ్యో పాపం అని జాలి పడే పరిస్థితి. ముఖ్యమంత్రుల్ని చేస్తా.. ప్రధానమంత్రిని తయారు చేస్తానంటూ చెప్పే ఆయన ఇప్పుడు రాజకీయ ఉనికి కోసం కిందామీదా పడుతున్న పరిస్థితి. అంతేనా.. తన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న నీళ్ల పంచాయితీ విషయంలో ఏపీ విపక్ష నేతగా చంద్రబాబు స్పందించాల్సి ఉంది. తన వాదనను వినిపించాల్సి ఉంది. అనూహ్యంగా ఆయన మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఈ తీరును పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని చూసిన వ్యక్తిగా.. మూడుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన అధినేతగా.. ప్రాజెక్టుల గురించి అవగాహన ఉండకుండా ఉండదు. ఎవరు తప్పు చేస్తే వారి తప్పును ఎత్తి చూపించాల్సి ఉంటుంది. అయినప్పటికీ నోట మాట రాని వ్యక్తిలా ఉంటున్నారే తప్పించి.. తాజాగా జరుగుతున్న లొల్లి మీద మాత్రం ఆయన మాట్లాడటం లేదు.

ఆ మాటకు వస్తే.. తాను ఏం మాట్లాడితే ఏమవుతుందన్న భయాందోళనలో ఆయన ఉన్నట్లు చెబుతారు. ఇలాంటి వేళ.. అనుకోని వరంలా ఏపీ సీఎం జగన్ మాట ఒకటి ఆయనకు లభించినట్లు చెబుతున్నారు. జల వివాదం ఎపిసోడ్ లో తెలంగాణ అధికారపక్ష నేతలు చెలరేగిపోతుంటే.. తాను.. తన టీం సభ్యులు మౌనంగా ఉండటానికి కారణం తమ వారు తెలంగాణలో ఉండటమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగానే కాదు.. తెలంగాణ అధికారపక్షాన్ని ఆత్మరక్షణలో పడేసేలా చేశాయి.

సరిగ్గా ఇవే మాటలు చంద్రబాబుకు వరంగా మారినట్లుగా చెప్పాలి. ఎందుకంటే.. జల వివాదం గురించి మీరెందుకు నోరు విప్పలేదు? ఇంత సీనియర్ అయి ఉండి ఎందుకు స్పందించలేదన్న మాటకు.. జగన్ చెప్పిన మాటల్ని కాస్త తిప్పి తిప్పి చెప్పే వీలుందన్న మాట వినిపిస్తోంది. జలవివాద వేళ.. ఏం చేయాలో తోచక.. ఎలా స్పందించాలో అర్థం కాని వేళ.. జగన్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు తోవను చూపించాయన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
Tags:    

Similar News