జగన్ జాతకం చెప్పేసిన తెలంగాణా ఫైర్ బ్రాండ్

Update: 2022-09-12 23:30 GMT
జగన్ అంటే ఏపీకి సీఎం. మరి తెలంగాణా వారికి ఏంటి సంబంధం అంటే ఉంది. ఎనిమిదేళ్ళ దాకా రెండు రాష్ట్రాలు ఒక్కటిగా ఉన్నాయి. అయితే ఏపీ వ్యవహారాలలో తెలంగాణా నాయకులు  పెద్దగా జోక్యం చేసుకోరు. అలాగే అడపా తడపా ఏపీ టూర్లకు వచ్చే వివిధ పార్టీల  నాయకులు ఎవరైనా కాస్తా ఆచీ తూచీ మాట్లాడుతారు. ఇక ఏపీ నాయకులు  అంతా దాదాపుగా హైదరాబాద్ లోనే ఉంటారు.

కాబట్టి అక్కడ టీయారెస్ సర్కార్ ని అనడానికి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. టోటల్ గా చూస్తే ఏపీయే ఈ విషయంలో కాస్తా అనువు అనుకోవాలి. ఆ మధ్యన తెలంగాణాకు చెందిన బీజేపీ ఎంపీ అరవింద్ వచ్చి ఏపీలో వచ్చే సర్కార్ ఏంటో జోస్యం చెప్పి వెళ్లారు. పనిలో పనిగా తమకు చంద్రబాబు టీడీపీతో పొత్తు ఉండదని కూడా చెప్పేశారు.

ఇక ఇపుడు రేణుకా చౌదరి వంతు. ఈమె తెలంగాణా కాంగ్రెస్ నాయకురాలు. ఖమ్మం ఎంపీగా గెలిచిన నేత. కేంద్ర మంత్రిగా కొంతకాలం పనిచేశారు. అయితే ఆమె అమరావతి రాజధాని విషయంలో మాత్రం ఎక్కువ ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. అంతే కాదు అమరావతి రైతులు అరసవిల్లి దాకా చేపట్టిన మహాపాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి ఆమె అటెండ్ అయ్యారు.

అంతే కాదు ఏపీ సీఎం జగన్ని చెడా మడా నాలుగు రకాలుగా విమర్శించారు. ఎంతలా జగన్ కి పాలన అసలు చేతకాదు అనేశారు. ఆయన మూర్ఖుడు అని దారుణమైన కామెంట్స్ చేశారు. ఏపీలో జగన్ పాలన ఎపుడు పోతుందా అని జనమంతా ఎదురుచూస్తున్నారు అని ఆమె అన్నారు. మరి కొద్ది నెలలలో ఏపీలో జగన్ ఓడడం ఖాయమని కూడా రేణుకమ్మ జోస్యం చెప్పారు.

ఏపీ రాజధాని ఎక్కడికీ పోదని కూడా రేణుక రైతులకు భరోసా ఇచ్చారు. జగన్ మాజీ సీఎం అయ్యాకనే ఏపీలో అమరావతికి ఊపిరి అని కూడా ఆమె చెప్పారు. ఇక పనిలో పనిగా మోడీని, బీజేపీని కూడా విమర్శించారు. అమరావతి రాజధానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి శంకుస్థపాన చేశారు కదా. మరి మూడేళ్ళుగా రైతులు నానా అవస్థలు పడుతుంటే బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు అని నిలదీశారు. ఇపుడు తగుదునమ్మా అని వారు వచ్చి రైతులకు అండగా ఉంటామని అంటున్నారని, వారు ముఖాలు నాడు ఎందుకు కనిపించలేదు, ఎక్కడ దాచారని కూడా ప్రశ్నించారు.

మొత్తానికి రేణుక స్పీచ్ రైతులకు తెగ హుషార్ ఇచ్చేసింది. అంతే కాదు జగన్ని పట్టుకుని మూర్ఖుడు అని,  ఆయన మాజీ సీఎం అవుతారు అని ఆమె చేసిన హాట్ కామెంట్స్ ఇపుడు తెగ వైరల్ అవుతున్నాయి. మరి దీనికి వైసీపీ నుంచి కౌంటర్లు ఉంటాయో లేదో చూడాలి. అన్నట్లు రేణుకమ్మ రైతులకు అండగా తాను ఉంటానని, ఎపుడూ వారి కోసం వస్తూనే ఉంటానని చెప్పి వెళ్లారు. సో రేణుక దూకుడు ఇక ఏపీలో వైసీపీ ఎదుర్కోవాల్సిందే అన్న మాట.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News