కేసీఆర్‌-మోడీ ఒక్క‌టే.. స‌యామీ క‌వ‌ల‌లు!

Update: 2023-07-10 09:00 GMT
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌద‌రి.. తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ముఖ్య‌మం త్రి.. కేసీఆర్‌, ఈ దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఇద్ద‌రూ ఒక్క‌టేనని ఇంచుమించు స‌యామీ క‌వ‌ల‌లేన‌ని నిప్పులు చెరిగారు. వారి వ‌ల్ల ఎవ‌రికీ అభివృద్ధి ఫ‌లాలు అంద‌లేద‌ని అన్నారు. తెలంగాణలో బీజేపీకి అడ్రెస్ లేదని దుయ్య‌బ‌ట్టారు. ఆదివారం ఆమె ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలో కేసీఆర్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని రేణుకా చౌద‌రి ఆరోపించారు. కేంద్రం కూడా ముందస్తు ఎన్నికలకు సిద్దమ వుతోందన్నారు. నార్త్‌లో వంద సీట్లకుపైగా బీజేపీ కోల్పోబోతోందని సంచ‌ల‌న బాంబు పేల్చారు. అందుకే మోడీ త‌దిత‌రులు ద‌క్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాల‌ని..ఇ క్క‌డి ప్రాంతీయ పార్టీల‌ను బుజ్జ‌గించి.. న‌యానో భ‌యానో త‌మ‌వైపు తిప్పుకోవాల‌ని చూస్తున్నార‌ని రేణుక వ్యాఖ్యానించారు. బీజేపీ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతోందని, మతతత్వ రాజకీయాలకు ఈ దేశంలో చోటు లేదన్నారు.

పార్లమెంట్‌లో అసభ్యంగా.. అసహ్యంగా ప్రధాని మోడీ అబద్దాలు చెబుతున్నారని రేణుక చౌదరి అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని గాలికి వ‌దిలేసి ఫామ్‌హౌస్‌లో ఉంటున్నారంటూ.. కేసీఆర్‌పై ఆమె విరుచుకుప‌డ్డారు. మోడీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న విష‌యంలో కేటీఆర్, కేసీఆర్‌ల మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదని.. చాలా స్ట్రాట‌జీగా వారు మాట్లాడుతున్నార‌ని అన్నారు. మంత్రి హరీష్ రావు టీవీ సీరియల్స్ రాసుకుంటే భవిష్యత్తు బాగుంటుందన్నారు.

కాంగ్రెస్ గంగా నది లాంటిదని, ఇందులోకి ఎంతో మంది వచ్చి స్నానం చేసి పునీతులవుతున్నారని అన్నారు. సర్వే నివేదికల ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుగుతుందని రేణుక చౌదరి పేర్కొన్నారు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేస్తాన‌ని.. అయితే.. పార్ల‌మెంటుకా అసెంబ్లీకా అన్న‌ది ఆలోచిస్తాన‌ని వ్యాఖ్యానించారు.

Similar News