72 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో సేమ్ సీన్ రిపీట్

Update: 2020-03-23 07:50 GMT
కోటికి పైగా ఉన్న జనాభా ఉన్న మహానగరం ఒకటి పూర్తిగా నిర్మానుష్యం కావటమే కాదు.. రోడ్ల మీదకు వచ్చి చూస్తే.. కనుచూపు మేర వాహనాలు కనిపించని రోజు ఏమైనా ఉందంటే అది ఈ ఆదివారం (మార్చి 22) మాత్రమే అవుతుందేమో? యావత్ నగరం మొత్తం షట్ డౌన్ అయిన ఈ పరిస్థితి గురించి కొందరుఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దాదాపు 72 ఏళ్ల క్రితం ఇప్పటిలాంటి సీనే అప్పట్లోనూ చోటు చేసుకుందని చెబుతున్నారు.

అది మినహా.. మళ్లీ ఎప్పుడూ ఇంతటి నిర్మానుష్యం మరెప్పుడూ చోటు చేసుకోలేదంటున్నారు. జనతా కర్ఫ్యూ ప్రత్యేకత ఏమంటే.. హైదరాబాద్ లోని అది.. .ఇది అన్న తేడా లేకుండా మహా నగరం మొత్తం మూగబోయినట్లు అయిపోయింది.ఎవరికి వారు ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలన్న మాటకు అపూర్వ ప్రతిస్పందన లభించింది. ఇంతకీ 72 ఏళ్ల క్రితం ఏం జరిగింది? అన్న విషయంలోకి వెళితే..

స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత అంటే.. 1948 సెప్టెంబరు 15 నుంచి 17తేదీల్లో హైదరాబాద్ మహా నగరం మొత్తం స్తంభించిపోయింది. ఎందుకంటే.. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో చేరిన సందర్భంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంట నగరంలోని ప్రజల్లో చోటు చేసుకుంది. అందుకే.. వారెవరూ ఆ మూడు రోజులు ఇళ్లల్లో నుంచి బయటకు రాలేదు. అప్పట్లో మిలటరీ భయంతో ఎవరూ బయటకు రాలేదన్న మాట వినిపిస్తోంది.

అప్పట్లో అలా ఉంటే.. ఇప్పుడు మాత్రం స్వీయ నియంత్రణలో ఎవరికి వారు ఇళ్లల్లోనే ఉండిపోయారు. కరోనా వ్యాప్తికి తమవంతుగా బయటకు రాలేదన్న మాట వినిపిస్తోంది. అప్పటితో పోలిస్తే.. ఇప్పుడే గొప్ప ఎందుకంటే? అప్పట్లో నగర జనాభా చాలా పరిమితం. ప్రాంతం కూడా అంతే. కానీ.. ఇప్పుడు అందుకు భిన్నం వందలాది కిలోమీటర్లు వ్యాపించటమే కాదు.. దగ్గర దగ్గర 1.3కోట్ల మంది ప్రజలు ఉన్న మహానగరం.. మొత్తంగా మూసుకుపోవటం.. ఎవరూ బయటకు రాకుండా ఉండటం ఇప్పటికే కాదు.. రానున్న రోజుల్లో కూడా అరుదైన ఘటనగా నిలిచిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Tags:    

Similar News