స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ తిరుగు ప్ర‌యాణంలో ఆ అనుభ‌వం

Update: 2017-09-11 04:57 GMT
దేశ ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్య‌పోయేలా చేయ‌ట‌మే కాదు.. దాయాదికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ కు సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర అంశం బ‌య‌ట‌కు వ‌చ్చింది. పాక్ అక్ర‌మిత క‌శ్మీర్ లోని ఉగ్ర‌స్థావ‌రాల‌పై గ‌త ఏడాది నిర్వ‌హించిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌తో ఇండియాస్ మోస్ట్ ఫియ‌ర్ లెస్ - ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడ్ర‌న్ హీరోస్ పేరిట ఒక పుస్త‌కాన్ని పెంగ్విన్ ఇండియా సంస్థ అచ్చేస్తోంది. ఈ పుస్త‌కంలో సైనికుల‌ అనుభ‌వాల‌ను  శివ్ అరేర్‌.. రాహుల్ సింగ్ లు రాశారు.

అస‌మాన ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించిన భార‌త సైనికుల‌కు సంబంధించిన 14 రియ‌ల్ ఘ‌ట‌న‌ల్ని పొందుప‌రిచారు. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌కు నేతృత్వం వ‌హించిన మేజ‌ర్ ఈ పుస్త‌కంలో త‌న‌ను తాను మైక్ టాంగోగా అభివ‌ర్ణించుకోవ‌టం విశేషం. స్ట్రైక్స్ కు ఊరీ ఉగ్ర‌ఘ‌ట‌న‌లో త‌మ స‌హ‌చ‌రుల‌ను కోల్పోయిన రెండు సైనిక బెటాలియ‌న్ల నుంచి మెరిక‌ల్లాంటి క‌మాండోల‌ను ఈ ఆప‌రేష‌న్ కోసం ఎంపిక చేశారు.

ఈ ఆప‌రేష‌న్ గురించి చాలా త‌క్కువ మంది అధికారుల‌కు మాత్ర‌మే తెలుస‌ని.. ఐబీ.. రా ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి రూపొందించిన ఈ దాడి వివ‌రాల‌ను ప్ర‌భుత్వానికి తెలిపిన‌ట్లు పుస్త‌కంలో వెల్ల‌డించారు.  ఈ ఆప‌రేష‌న్‌ను నిర్వ‌హించాల‌న్న ఆదేశంతో దాదాపు 19 మంది క‌మాండోల‌ను వ్య‌క్తిగ‌తంగా ఎంపిక చేసిన‌ట్లుగా మేజ‌ర్ టాంగో పేర్కొన్నారు. శ‌త్రువుల‌పై దాడి చేయ‌టం కంటే సుర‌క్షితంగా తిరిగి రావ‌ట‌మే అతి పెద్ద స‌వాలుగా అభివ‌ర్ణించారు. పాక్ అక్ర‌మిత క‌శ్మీర్ లో పాక్ సైన్యం.. ఐఎస్ ఐ సెక్యూరిటీ క‌ల్పిస్తున్న నాలుగు ఉగ్ర‌వాద స్థావ‌రాల్ని ల‌క్ష్యంగా ఎంచుకున్నామ‌ని తెలిపారు.

పాక్ అక్ర‌మిత క‌శ్మీర్ లో ఇద్ద‌రు ఇన్ఫార్మ‌ర్ల‌ను ఏర్పాటు చేసుకున్నామ‌ని.. అదే స‌మ‌యంలో జైషే మ‌హ‌మ్మ‌ద్‌కు చెందిన ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను భార‌త నిఘా వ‌ర్గాలు కొన్ని రోజుల క్రిత‌మే ఇన్ఫార్మ‌ర్లుగా నియ‌మించుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ప‌క్కా స‌మాచారం అందుకున్న వెంట‌నే ఉగ్రస్థావ‌రాల‌పై దాడికి పాల్ప‌డిన‌ట్లు చెబుతున్నారు.

ఈ ఆప‌రేష‌న్లో క‌మాండోలు ఎం4ఏ1.. ఇజ్రాయిల్ త‌యారీ త‌వోర్ టీఏఆర్‌21.. ఇన్ స్ట‌ల‌జా సీ 90 ఆయుధాల్ని వాడ‌గా.. తాను మాత్రం ఎం4ఏ1 కార్బైన్ తుపాకీని వాడిన‌ట్లుగా పేర్కొన్నారు.

తాము జ‌రిపిన దాడిలో 38 నుంచి 40 మంది ఉగ్ర‌వాదులు.. ఇద్ద‌రు పాక్ ఆర్మీ అధికారులు చ‌నిపోయి ఉంటార‌న్నారు. దాడి అనంత‌రం టీంలోని స‌భ్యుల‌మంతా ఒకేచోట క‌లుసుకున్న‌ట్లుగా చెప్పారు. పీవోకే నుంచి భార‌త్‌ కు సుర‌క్షితంగా తిరిగి రావ‌టం కోసం క‌ఠిన‌మైన మార్గాన్ని ఎంచుకున్నామ‌ని.. త‌మ దాడితో రెచ్చిపోయిన పాక్ సైన్యం త‌మ‌కు అందుబాటులో ఉన్న‌ప్ర‌తి ఆయుధాన్ని విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపింద‌న్నారు.

త‌మ దాడుల్లో పాక్ స్థావ‌రాలు కాలిపోవ‌టంతో.. పాక్ సైన్యం కంట ప‌డ‌కుండా ఉండేందుకు తాము చాలా దూరం శ్ర‌మించాల్సి వ‌చ్చిందని.. చాలా బుల్లెట్లు త‌మ చెవుల ప‌క్క నుంచి వెళ్లిపోయాయన్నారు.  అర్థ‌రాత్రి మొద‌లైన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ అనంత‌రం తెల్ల‌వారుజామున 4.30 గంట‌ల‌కు భార‌త్‌కు సుర‌క్షితంగా చేరుకున్న‌ట్లుగా వెల్ల‌డించారు.


Tags:    

Similar News