కేసీఆర్‌ కు షాకిచ్చే విమ‌ర్శ‌లు చేసిన రేవంత్‌

Update: 2018-01-10 10:39 GMT
పోయిన చోట వెతుక్కోమ‌న్న‌ది వెనుక‌టి సామెత‌. ఇంచుమించే ఆ సామెత మాదిరే వ్య‌వ‌హ‌రిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. ఏ విద్యుత్ అంశాన్ని తీసుకొని విపక్షాల‌కు వ‌ణుకు పుట్టించాల‌ని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారో.. ఇప్పుడు అదే అంశంతో ఆయ‌న‌పై చెరుపుకోలేని మ‌ర‌క వేయాల‌ని త‌పిస్తున్న‌ట్లుగా ఉంది రేవంత్ తీరు చూస్తుంటే.

విద్యుత్ విష‌యంలో తెలంగాణ స‌ర్కారు సంచ‌ల‌న విజ‌యం సాధించిందంటూ ప్ర‌చారం చేసుకుంటున్న కేసీఆర్ స‌ర్కారు మాట‌కు భిన్నంగా స‌రికొత్త ఆరోప‌ణ‌ల్ని తెర మీద‌కు తెస్తున్నారు రేవంత్. రైతులకు 24 గంట‌ల ఉచిత విద్యుత్‌.. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల పాటు కోత‌ల్లేని విద్యుత్ వెలుగుల వెనుక సీఎం కేసీఆర్ చీక‌టి ఒప్పందాలు ఉన్న‌ట్లుగా ఆయ‌న ఆరోపిస్తున‌నారు.

రైతుల కోసం ఎంతైనా విద్యుత్ కొనుగోలు చేస్తామ‌నే హామీ వెనుక రైతుల‌పై ప్రేమ లేద‌ని.. క‌మీష‌న్ పై మాత్ర‌మే ప్రేమ ఉంద‌ని వ్యాఖ్యానించారు. త‌క్కువ ధ‌ర‌కే విద్యుత్ ఇస్తామ‌ని కేంద్రం చెబుతున్నా.. కేసీఆర్ స‌ర్కారు మాత్రం ఛ‌త్తీస్ గ‌ఢ్ తో ఒప్పందాలు చేసుకోవ‌టం ఏమిట‌ని ప్ర‌శ్నించారు.  

గ‌డిచిన కొద్ది రోజ‌లుగా తాను చేస్తున్న‌ట్లే మ‌రోసారి.. విద్యుత్ అంశంపై కేసీఆర్ స‌ర్కారు శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాల్ని బ‌య‌ట‌పెట్టాల‌ని.. అఖిల ప‌క్షం నిర్వ‌హించి.. విద్యుత్ కొనుగోళ్ల‌కు సంబంధించిన వివ‌రాల్ని ప్ర‌క‌టించాల‌న్నారు. 24 గంట‌ల విద్యుత్ కోసం చేస్తున్న కొనుగోళ్ల వెనుక అక్ర‌మాలు జ‌రుగుతున్న‌ట్లుగా చెప్పారు.

ఒక‌వైపు 24 గంట‌లు క‌రెంటు అని తెలంగాణ స‌ర్కారు గొప్ప‌లు చెబుతోంద‌ని.. కానీ తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో 18 తండాల‌కు నేటికీ క‌రెంటు లేద‌న్నారు. త‌న సొంత శాఖ‌లో ఏం జ‌రుగుతుందో తెలీని ప‌రిస్థితుల్లో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ఉన్నార‌ని విమ‌ర్శించిన రేవంత్‌.. మంత్రిని ముఖ్య‌మంత్రి ప‌క్క‌న పెట్టేశార‌న్నారు.

తెలంగాణ‌కు సేవ చేయ‌టానికి తెలంగాణ బిడ్డ‌.. రాజ‌స్థాన్ క్యాడ‌ర్ ఐఏఎస్ అధికారి ర‌మేష్ వ‌స్తే.. ఆయ‌న్ను తిరిగి వెన‌క్కి పంపార‌న్నారు. ఇండియా బుల్స్ కంపెనీని కాపాడేందుకు రోజువారీ కొనుగోళ్ల‌ను రాష్ట్ర స‌ర్కారు చేస్తోందంటూ తీవ్ర ఆరోప‌ణ చేశారు. గుజ‌రాత్‌ కు చెందిన కంపెనీల‌పై కేసీఆర్ ఎందుకు మ‌క్కువ ప్ర‌ద‌ర్శిస్తున్నారో చెప్పాలంటూ కొత్త సందేహాలు క‌లిగే మాట‌లు చెప్పారు. మ‌రి.. రేవంత్ వ్యాఖ్య‌ల‌పై కేసీఆర్ అండ్ కో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News