కేసీఆర్ కొత్త కుట్ర‌ను బ‌య‌ట‌పెట్టిన రేవంత్

Update: 2016-12-26 05:40 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి  మ‌రో సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌ని కేసీఆర్ చేసిన త‌ప్పుల‌ను క‌ప్పి పుచ్చుకునేందుకు కొత్త కుట్ర‌ల‌కు తెర‌తీస్తున్నార‌ని మండిప‌డ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీటీడీపీ న్యాయవిభాగం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన రేవంత్ సీఎం కేసీఆర్ ఇటీవ‌ల తీసుకున్న‌ జోనల్ విధానం ర‌ద్దు నిర్ణయంపై మండిపడ్డారు. గతంలో ఎన్నో పోరాటాలు, ఆత్మ బలిదానాల అనంతరం మేధావులు విస్తృతంగా చర్చించి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు - నగర ప్రాంతాలకు చెందిన వారితో పోటీ పడడం సాధ్యం కాదని గుర్తించారని రేవంత్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే రాజ్యాంగంలోని ఆర్థికల్ 371డి ద్వారా జోనల్ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని ఆయన వివరించారు. ఇప్పటివరకు జోనల్ విధానంలోనే నూతన నియామకాలతోపాటు బదిలీలు కూడా జరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి మంచి విధానానికి కేసీఆర్ త‌న స్వార్థం కోసం దెబ్బ‌కొట్టార‌ని రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కేసీఆర్ ఇటీవ‌ల ముచ్చ‌ట‌ప‌డి చేసిన జిల్లాల పునర్విభజనలో ఎలాంటి శాస్త్రీయ ప్రామాణికతలను పాటించకుండా ఒక జిల్లాలోని ప్రాంతాలను మరొక జిల్లాలోకి విలీనం చేశార‌ని రేవంత్ మండిప‌డ్డారు. ఇలా చేయడం ద్వారా కేసీఆర్ జోనల్ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని గతంలోనే తాము ఈ అంశంపై అభ్యంతరం లేవనెత్తామని ఆయన గుర్తుచేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటు తరువాత జోనల్ వ్యవస్థను కొనసాగిస్తే న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని, అందుకు తాను బాధ్యత వహించాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఒక్క కలం పోటుతో జోనల్ వ్యవస్థను రద్దు చేశారని రేవంత్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ రద్దుతో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు భారీగా నష్టపోయే ప్రమాదముందని చెప్పారు. కొన్ని కార్పోరేట్ విద్యాసంస్థల ఒత్తిడికి అంగీక‌రించి జోన‌ల్‌ వ్యవస్థను రద్దు చేశారని ఆయన ఆరోపించారు. పేద, గ్రామీణ విద్యార్థులకు అన్యాయం చేసే ఈ చర్యపై తాము పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

జోనల్ వ్యవస్థను రద్దు గ్రామీణ నిరుద్యోగుల పట్ల శరాఘాతమని అభిప్రాయపడ్డ రేవంత్టీ డీపీ న్యాయ విభాగం ఈ అంశంపై ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని సూచించారు. అవసరమైతే పేద నిరుద్యోగులకు న్యాయం చేయడానికి, గ్రామీణ ప్రాంతాల వారికి అండగా ఉండటానికి ఎలాంటి పోరాటాలకైనా తాము సిద్ధపడతామని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక విధానాన్ని కాలరాస్తున్న కేసీఆర్‌  నియంతృత్వ ధోరణితో పరిపాలన సాగిస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీలో చేరకపోవడమే అన్యాయమనే రీతిలో వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ వేధింపులకు టీడీపీ న్యాయవిభాగం సరైన సమాధానం చెప్పాలని రేవంత్ సూచించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక ధోరణులపై న్యాయవిభాగం నిఘూ పెట్టాలని, చురుకుగా పనిచేస్తూ ప్రజలకు చేరువ కావాలని హితవు చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News