టీటీడీపీ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశానికి రేవంత్‌!

Update: 2017-10-20 07:45 GMT

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ కీలక నేత రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. టీఆర్ ఎస్ పై - కేసీఆర్ పై ఒంటికాలి మీద లేచే రేవంత్ కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్త సంచ‌ల‌నం రేపింది. ఢిల్లీ వెళ్లిన రేవంత్‌...రాహుల్ ను క‌లిశార‌ని, అందుకే రెండు రోజుల పాటు అక్క‌డే మ‌కాం వేశార‌ని పుకార్లు వినిపించాయి. దీంతో, రేవంత్ పై టీడీపీ నేత‌లు  విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే, రేవంత్ కూడా ఏపీ టీడీపీ నేత‌ల‌పై ప్ర‌తి విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇంత జ‌రుగుతున్నా, అధికారికంగా తాను పార్టీ వీడుతున్న‌ట్లు ఎక్క‌డా ప్ర‌క‌టించ‌లేదు. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం ఉద‌యం బంజారాహిల్స్ లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో జ‌రుతుతున్న టీటీడీపీ వర్కింగ్ కమిటీ సమావేశానికి రేవంత్ హాజ‌ర‌య్యారు. అనూహ్యంగా రేవంత్ స‌మావేశానికి రావ‌డంతో టీడీపీ నేత‌లు షాక్ తిన్నారు.

అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ స‌మావేశానికి హాజ‌రైన‌ రేవంత్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ గ‌ట్టిగా నిలదీసినట్టు తెలుస్తోంది. పార్టీ మారుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌పై రేవంత్ ను ఎల్ ర‌మ‌ణ ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ లో చేరుతున్నట్టు వచ్చిన వార్తల గురించి స‌మావేశంలో ప్రస్తావించారు. అసలేం అనుకుంటున్నారో నిజం చెప్పాలని రేవంత్ ను అడిగిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ పార్టీ మారే ఉద్దేశం ఉంటే ఈ సమావేశానికి రాకుండా ఉండాల్సిందని ర‌మ‌ణ అన్న‌ట్లు సమాచారం. అయితే, ర‌మ‌ణ వ్యాఖ్య‌ల‌కు రేవంత్ గ‌ట్టిగా బ‌దులిచ్చిన‌ట్లు తెలుస్తోంది.  తాను పార్టీ మారుతున్నట్టు ఎక్క‌డైన చెప్పానా? అని  రమణను రేవంత్ ఎదురు ప్రశ్నించిన‌ట్లు స‌మాచారం. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో టీటీడీపీ విఫలమవుతోందని రేవంత్ ఆరోపించినట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ స‌మావేశం కొన‌సాగుతోంది. స‌మావేశం పూర్త‌యిన త‌ర్వాత రేవంత్ వ్య‌వ‌హారంపై మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

మ‌రోవైపు ఈ స‌మావేశం విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్  ట్విస్ట్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌టంతో ఈ ప‌ర్య‌ట‌న‌కు లోకేష్ హాజ‌రుకానున్న‌ట్లు పార్టీ నేత‌ల్లో కొంద‌రికి స‌మాచారం అందింది. ఆయ‌న మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో ఈ భేటీ జ‌రుగుతుంద‌ని అంచ‌నావేశారు. అయితే ఈ ముఖ్య‌మైన మీటింగ్‌ కు లోకేష్‌ హాజ‌రుకాక‌పోవ‌డంతో కొంద‌రు టీడీపీ నేత‌లు ఖంగుతిన్నారు. దీనికి కొన‌సాగింపు అన్న‌ట్లుగా....రేవంత్ రెడ్డి హాజ‌రుకావ‌డం డ‌బుల్ ట్విస్ట్ ఇచ్చిన‌ట్ల‌యింద‌ని చ‌ర్చించుకుంటున్నారు.

కాగా, స‌మావేశానికి హాజ‌రయ్యేందుకు 10 గంటలకు ఇంటి నుంచి బయల్దేరిన రేవంత్ 11:30 నిమిషాలకు టీడీపీ భవన్ కు చేరుకున్నారు. ఈ గంటన్నర సేపు ఆయన ఎక్కడికి వెళ్లారన్న దానిపై ప‌లువురు అనేక అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. తాము రేవంత్ తో క‌లిసి కార్తీక మాసం సంద‌ర్భంగా గుడికి వెళ్లామని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. అయితే, ఆ స‌మ‌యంలో రేవంత్‌.....కాంగ్రెస్ నేతలతో సమావేశమైనట్టు పుకార్లు వ‌స్తున్నాయి. కాంగ్రెస్ లో ఆయన చేరికను వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి సోదరులు - డీకే అరుణ తదితరులతో రేవంత్  గోల్కండ హోటల్ లో సమావేశమయ్యారని ప్రచారం జరుగుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులను కలిసి మాట్లాడిన ఆయన, ఆపై డీకే అరుణతో భేటీ అయినట్టు తెలుస్తోంది. రేవంత్ కు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వవద్దని, ఎటువంటి షరతులు లేకుండా వస్తే మాత్రమే పార్టీలోకి ఆహ్వానించాలని పలువురు కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి చెప్పిన‌ట్లు తెలుస్తోంది. తన రాకతో ఎవరికీ ఇబ్బందులు ఉండవని, అందరమూ కలసి ముందుకు సాగుదామని, తనను వ్యతిరేకించే నేతలకు రేవంత్ చెబుతున్నట్టు స‌మాచారం.
Tags:    

Similar News