దానికే.. రాష్ట్రప‌తి పాల‌న ఏంది రేవంత్‌?

Update: 2017-12-29 05:23 GMT
ప్ర‌భుత్వాలు చేసే త‌ప్పుల్ని నిర్మాణాత్మ‌కంగా ఎత్తి చూపిస్తూ.. వారు ఇరుకున ప‌డేలా.. స‌మాధానం చెప్పేందుకు విల‌విలాడేలా చేయాలే త‌ప్పించి.. మ‌రీ రొడ్డుకొట్టుడు తీరులో రియాక్ట్ కావ‌టం ఏ మాత్రం బాగోదు. ఇప్పుడు అలాంటి ప‌నే చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి.   

విప‌క్షంలో ఉన్న‌ప్పుడు అధికార ప‌క్షం చేసే త‌ప్పుల్ని ఎత్తి చూపాల్సిన గురుత‌ర బాధ్య‌త ఉంటుంది. అలా అని అడ్డ‌గోలు వాద‌న చేయ‌టంలో అర్థం లేదు. ఓయూలో నిర్వ‌హించాల్సిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ ను నిర్వ‌హించ‌లేక‌పోవ‌టం కేసీఆర్ స‌ర్కారు విఫ‌ల‌మ‌య్యారనే చెప్పాలి. జాతీయ సైన్స్ కాంగ్రెస్ లాంటి భారీ కార్య‌క్ర‌మాన్ని తెలంగాణ స‌ర్కారు ఎందుకు నిర్వ‌హించ‌లేక‌పోయింద‌న్న విష‌యాన్ని సూటిగా నిల‌దీయ‌టంతో పాటు.. ఈ ఇష్యూలో హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎంత దారుణంగా దెబ్బ తిన్న‌ద‌న్న విష‌యాన్ని అంద‌రికి అర్థ‌మ‌య్యేలా చెప్పాలి. కానీ.. రేవంత్ మాత్రం ఈ మాత్రానికే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రప‌తి పాల‌న విధించాలంటూ భారీ డిమాండ్ ను తెర మీద‌కు తేవ‌టంలో అర్థం లేద‌ని చెప్పాలి.

నిజానికి రేవంత్ రెడ్డి మాత్ర‌మే కాదు.. తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల తీరు అందుకు భిన్నంగా ఏమీ లేదు. హైద‌రాబాద్ బ్రాండ్ దెబ్బ తినేలా కేసీఆర్ స‌ర్కారు వ్య‌వ‌హ‌రించార‌న్న విష‌యాన్ని వ‌దిలేసి.. ఎప్ప‌టి మాదిరే తిట్ల వ‌ర్షం కురిపించ‌టం కాంగ్రెస్ నేత‌ల విమ‌ర్శ‌ల్లో క‌నిపిస్తుంది.

ఇలాంటి తీరు ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకునే అవ‌కాశ‌మే ఉండ‌దు. ఒక త‌ప్పు చేసిన‌ప్పుడు ఆ త‌ప్పు కార‌ణంగా రాష్ట్రానికి జ‌రిగే న‌ష్టం ఎంత‌న్న విష‌యం అర్థ‌మ‌య్యేలా ప్ర‌జ‌ల్ని ఎడ్యుకేట్ చేయ‌గ‌ల‌గాలి. ఇలాంటి వ్యూహంతోనే ఎంత‌కూ సాధ్యం కాద‌నుకున్న తెలంగాణ ఉద్య‌మాన్ని న‌డిపించి.. స‌క్సెస్ అయ్యారు.

కానీ.. అలాంటిది వ‌దిలేసి..రోటీన్ త‌ర‌హాలో అధికార‌ప‌క్షంపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించ‌టంలో అర్థం లేద‌నే చెప్పాలి.  ఉద్య‌మ ల‌క్ష్యాల‌కు భిన్నంగా పాల‌న సాగుతోంద‌ని ఒక కాంగ్రెస్ నేత వ్యాఖ్యానిస్తే.. శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య ఉంద‌న్న విష‌యం సైన్స్ కాంగ్రెస్ వాయిదాతో అర్థ‌మైందంటూ మ‌రో కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు.

జాతీయ సైన్స్ కాంగ్రెస్ నిర్వ‌హించ‌లేని ప‌రిస్థితుల్లో తెలంగాణ స‌ర్కారు ఉంద‌న్న భ‌ట్టి మాట‌ల‌కు త‌గ్గ‌ట్లే.. ఎడ్యుకేష‌న‌ల్ బ్లాక్ డే అంటూ ష‌బ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. సైన్స్ కాంగ్రెస్ ను నిర్వ‌హించ‌లేద‌ని సీఎం కేసీఆర్ నైతిక బాధ్య‌త వ‌హిస్తూ ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాలంటూ జీవ‌న్ రెడ్డి డిమాండ్ చేయ‌టం చూస్తే.. చిన్న చిన్న విష‌యాల‌కు పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడే క‌న్నా.. ప్ర‌జ‌ల్లో చ‌ర్చ రేపేలా మాట్లాడితే ఫ‌లితం ఉంటుంద‌న్న విష‌యాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు గుర్తిస్తే మంచిది.
Tags:    

Similar News