రెండో రౌండ్ లోనూ రిషి ముందంజ.. ప్రధాని కావటానికి మరో 3 రౌండ్లు!

Update: 2022-07-15 03:59 GMT
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్రిటన్ ప్రధాని రేసులో రెండు రౌండ్ ముగిసింది. మొత్తం ఐదు రౌండ్లలో సాగే ఎన్నికల్లో.. ఐదో రౌండ్లో ఎవరు అధిక్యతను ప్రదర్శిస్తారో.. వారే బ్రిటన్ కు తదుపరి ప్రధానమంత్రి కానున్నారు. తాజాగా ముగిసిన రెండో రౌండ్లో.. దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ బరిలో ఉండటం.. రెండో రౌండ్ లో ముందంజలో దూసుకెళ్లటం తెలిసిందే. దేశ మాజీ ఆర్థిక మంత్రిగా సేవలు అందించిన ఆయన.. ప్రధాని అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక.. బ్రిటన్ ప్రధానిగా వ్యవహరించిన బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేయటానికి రిషి కారణంగా చెబుతుంటారు.

అయినప్పటికీ.. ప్రధానమంత్రి పదవికి జరుగుతున్న ఎన్నికల్లో రిషి మరో అడుగు ముందుకు వేశారు. మూడో రౌండ్ లోనూ అతడి హవా నడుస్తుందని చెబుతున్నారు మూడో రౌండ్లో వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్.. విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ నుంచి ఆయన పోటీని ఎదుర్కొంటున్నారు. ఇక.. రెండో రౌండ్లో రిషి 103 ఓట్లు రాగా.. మోర్డాంట్ కు 83 ఓట్లు మాత్రమే దక్కాయి. మూడో స్థానంలో లిజ్ ట్రస్ కు 64 మంది సపోర్టు చేశారు. రెండో రౌండ్ లో జరిగిన ఓటింగ్ లో అందరి కంటే తక్కువగా ఓట్లు వచ్చిన అటార్నీ జనరల్ సుయెల్లా బ్రావర్ మన్ రేసు నుంచి వైదొలిగారు.

రెండో రౌండ్ లో దూసుకెళ్లిన రిషి.. మూడో రౌండ్ కు వెళ్లిన అనంతరం తనకు మద్దతు పలికిన వారందరికి థ్యాంక్స్ చెప్పారు. దేశానికి సేవ చేసే విషయంలో తన శక్తి మేర ప్రయత్నిస్తానని చెప్పిన రిషి.. సమిష్టిగా దేశ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం చేపట్టి.. దేశాన్ని ఐక్యం చేయొచ్చన్నారు. తన ప్రత్యర్థులు చెప్పినట్లుగా పన్నుల పోటు తగ్గించటం కాకున్నా.. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయటమే తన ప్రధమ లక్ష్యంగా పేర్కొన్నారు.

మూడో రౌండ్ లో బరిలో ఉన్న ప్రతి ఒక్కరు 30 ఓట్లు కనీసం పొందాల్సి ఉంది. ఎవరైతే తక్కువగా ఓట్లు పొందుతారో.. వారు పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పటివరకు వినిపిస్తున్న అంచనాల ప్రకారం భారత మూలాలు ఉన్న రిషికి అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. మరోవైపు యూ గోవ్ (YouGov) పోల్ లో దాదాపు 900 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు మోర్డాంట్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో మాత్రం ఆయనతో పోలిస్తే రిషి చాలా వెనక్కి పడి ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. రానున్న కొద్ది రోజులు భారతీయులంతా ఎంతో ఉత్కంఠతో బ్రిటన్ దేశ పగ్గాలు ఎవరి చేతికి వస్తాయన్న అంశంపై ఎదురుచూస్తున్నారని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News