రోహిత్ కులాన్ని మాదాపూర్ పోలీసులు తేల్చారు

Update: 2016-02-27 05:08 GMT
హెచ్ సీయూ రీసెర్చ్ స్టూడెంట్ రోహిత్ ఆత్మహత్య వ్యవహారం ఎంత చర్చనీయాంశమైందో తెలిసిందే. ఈ ఉదంతంలో మరణించిన రోహిత్ దళితుడని.. ఈ కారణంగా ఆయనపై వివక్ష ప్రదర్శించి.. ఆయన మరణానికి కారణమయ్యారంటూ కాంగ్రెస్.. కమ్యూనిస్ట్ పార్టీ నేతలు వాదనలు వినిపించటం తెలిసిందే. మరణించిన విద్యార్థిని.. ఒక విద్యార్థిగా చూసే కన్నా వారి కులం ఆధారంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న రాజకీయపార్టీల తీరుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుంటే.. మరోపక్క రోహిత్ అస్సలు దళితుడే కాదన్న విషయం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.

దీన్లోని నిజానిజాలపై పోలీసులు విచారిస్తున్న సందర్భంలోనే రోహిత్ తండ్రి తెరపైకి వచ్చి తాము వడ్డెర కులానికి చెందిన వాళ్లమని.. దళితులం కాదంటూ తేల్చారు. అయితే.. రోహిత్ తండ్రి.. తల్లి కొద్దికాలం క్రితం విడిపోయారు. అయితే.. తామిప్పుడు కలిసే ఉన్నట్లు ఆయన చెప్పుకున్నారు. మరోవైపు రోహిత్ తల్లి తాను దళితవాడలో మొదటి నుంచి ఉంటున్నట్లు.. తాను దళితురాలినే అని వ్యాఖ్యానించటం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. రోహిత్ కుల నిర్ధారణ కోసం విచారణ జరిపిన పోలీసులు.. అతను వడ్డెర కులస్థుడని తేల్చారు. ఈ విషయాన్ని వెల్లడించిన మాదాపూర్ ఏసీపీ రమణకుమార్.. తాజాగా హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా గురజాలలో ఉన్న రోహిత్ తండ్రి నాగఫణికుమార్.. తండ్రి తరఫు బంధువులు.. గ్రామ సర్పంచ్.. రాధిక సోదరుడు గిరిధర్ కుమార్.. అతని భార్య ధనలక్ష్మి చెప్పిన వివరాలతో పాటు.. రోహిత్ తమ్ముడు రాజ చైతన్య కుమార్ కు తహసీల్దారు ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రం ఆధారంగా రోహిత్ వడ్డెర కులానికి చెందిన వ్యక్తిగా తేల్చారు.

ఇదిలా ఉంటే.. రోహిత్ స్కూల్ రికార్డులు లభించలేదని.. ఇంటర్.. డిగ్రీ రికార్డుల్లో మాత్రం ఎస్సీ మాలగా నమోదు అయి ఉన్నట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే.. రోహిత్ తల్లిని తాము దత్తత తీసుకొన్నట్లుగా చల్ల అంజనీదేవి చెప్పిన విషయంపై విచారణ మిగిలి ఉందని తేల్చారు. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం.. రోహిత్ దళితుడు కాదని.. వడ్డెర కులస్థుడిగా తేలింది. కులం మీద రాజకీయం నడిపే నేతలు తాజాగా రోహిత్ కుల వ్యవహారం మీద ఏమంటారు..?
Tags:    

Similar News