జగన్ జాతకాన్ని నాడే చెప్పిన రోశయ్య... ?

Update: 2021-12-04 12:04 GMT
కొణిజేటి రోశయ్య. రాజకీయ భీష్ముడు. ఆయన కేవలం తన ప్రతిభతోనే ఇంత ఎత్తుకు ఎదిగారు. కులం బేస్డ్ గా పాలిటిక్స్ మారి దశాబ్దాలుగా కొందరి పెత్తనం మాత్రమే రాజ్యమేలుతున్న రాజ్యంలో తనకంటూ ఒక స్థానాన్ని సృష్టించుకుని తాను రాజుగా నిలబడిన ఘనత అచ్చంగా రోశయ్యదే. ఆయనలో ఎన్నో కోణాలు ఉన్నాయి. ఆయన బహుముఖీయమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. కాంగ్రెస్ తోనే తన మొత్తం రాజకీయ జీవితాన్ని పెనవేసుకుని అందరి మన్ననలు పొందారు, ఎన్నో ఎత్తులు చూశారు.

రోశయ్యకు పదవులు వాటంతట అవే వచ్చాయి. ఆయన అనూహ్యమైన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయ్యారు. అయితే నాడు వైఎస్సార్ దుర్మరణం పాలు అయిన పెను విషాద సందర్భం ఒక వైపు ఉంది, మరో వైపు తెలంగాణా ఉద్యమం ఉంది. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. నాడు ఆయన సీఎం అభ్యర్ధిత్వానికి జగన్ ప్రతిపాదించారు.

ఇక జగన్ వైపు కాంగ్రెస్ లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. దాంతో కాంగ్రెస్ లో ఆయన వర్గం బలంగా ఉండేది. ఈ నేపధ్యంలో జగన్ ఓదార్పు యాత్రలతో సొంత ప్రభుత్వానికే కొంత తలనొప్పి కలిగించారన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపధ్యంలో అధినాయకత్వం జగన్ ని పార్టీ లైన్ లో ఉంచే ప్రయత్నం చేసింది. ఇక రోశయ్య సైతం ఒక దశలో జగన్ని పార్టీ చెప్పినట్లుగా వినాలని సూచించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇవన్నీ పక్కన పెడితే జగన్ గురించి నాడే రోశయ్య జోస్యం చెప్పారు. జగన్ కి రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉందని, ఇంకా ఆయన యువకుడేనని, ఎంతో చూడాల్సి ఉందని అంటూ ఉండేవారు. పార్టీకి విధేయతతో ఉంటే కచ్చితంగా జగన్ కి మంచే జరుగుతుందని కూడా భావించేవారు. అయితే రోశయ్య సీఎం గా ఉండగా జగన్ వర్గం పెద్దగా సహకరించలేదు అన్న విమర్శలు అయితే నాడు వచ్చాయి. ఇక ఆయన ప్లేస్ లో కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం గా ఎంపిక చేయడంతో జగన్ కాంగ్రెస్ కి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు.

మొత్తానికి పార్టీ లైన్ ని జగన్ దాటి బయటకు వచ్చినా రోశయ్య ఊహించినట్లుగానే మంచి భవిష్యత్తుని చూశారు. ఆయన విభజన ఏపీకి సీఎం కావడం కూడా జరిగింది. సీఎం అయ్యాక కూడా జగన్ ఒకసారి హైదారాబాద్ లోని రోశయ్య ఇంటికి వెళ్ళి ఆయన్ని కలిశారు. ఆ విషయాన్ని కూడా రోశయ్య మీడియాకు చెప్పారు. మొత్తానికి వైఎస్సార్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న రోశయ్య జగన్ రాజకీయ భవిష్యత్తు గురించి చెప్పడమే కాదు ఆయన సీఎం కావడాన్ని కూడా చూడడం విశేషంగానే చెప్పుకోవాలి. ఇక రోశయ్యకు జగన్ ఘన నివాళి అర్పిస్తూ ఆయన గొప్ప నేత అని కొనియాడారు.
Tags:    

Similar News