ఆర్ బీఐ మొద్దునిద్ర పోతుందా?

Update: 2017-01-13 05:23 GMT
ఎలాంటి తప్పు జరగకుండా పని చేయాల్సిన వ్యవస్థలు కొన్ని ఉంటాయి. మిగిలిన వారు తప్పులు చేసినా ఫర్లేదు కానీ.. కొందరు అస్సలు తప్పులు చేయకూడదు. అలాంటి తప్పులు చేయకూడని జాబితాలో ఆర్ బీఐ ఉండాల్సిన అవసరం ఉంది. మరీ మధ్య ఏం జరుగుతుందో కానీ తప్పుల మీద తప్పులు చేసేస్తున్నారు ఆర్ బీఐ సిబ్బంది.

కొత్త నోట్లను మార్కెట్లోకి తెస్తున్న వేళ.. ప్రింట్రింగ్ మిస్టేక్స్ ఎక్కువ అవుతున్నాయి. నోట్ల రద్దు నేపథ్యంలో కొత్త రూ.500 నోట్లను హడావుడిగా తీసుకొస్తున్నారంటూ ముద్రించిన నోట్లలో లోపాలు ఉండటం.. వాటిని గుర్తించిన అధికారులు ఆ నోట్లను తిరిగి ఆర్ బీఐకి తిప్పి పంపించటం కారణంగా రూ.500 నోట్ల చెలామణిలోకి ఆలస్యం కావటమే కాదు.. ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు.

మొన్నా మధ్య కొత్తగా విడుదల చేసిన రూ.2వేల నోట్లలో కొన్నింటికి గాంధీ బొమ్మ లేకుండా ప్రింట్ కావటమే కాదు.. ఆ నోట్లు మధ్యప్రదేశ్ లోని కొన్ని గ్రామాల్లోని ప్రజల చేతుల్లోకి రావటం..వారు షాక్ తిని బ్యాంకుల వద్దకు వెళ్లగా.. వాటిని వెనక్కి తీసుకొని కొత్త నోట్లను ఇచ్చిన పంపిన వైనం షాకింగ్ గా మారింది. ఈ ఉదంతాన్ని మర్చిపోక ముందే.. మళ్లీ మధ్య ప్రదేశ్ లో మరో షాకింగ్ ఉదంతం బయటకు వచ్చింది.

అక్కడ ఏటీఎంలలో రూ.1500 డ్రా చేసుకున్న వ్యక్తికి మూడు రూ.500 నోట్లు వచ్చాయి. వాటిని చేతిలోకి తీసుకున్న అతను షాక్ తిన్నాడు. ఎందుకంటే.. ఆ నోట్లకు ఒకవైపు మాత్రమే ప్రింట్ కావటం.. రెండోవైపు ఖాళీగా ఉండటంతో అవాక్కు అయ్యే పరిస్థితి.వెంటనే అధికారుల్ని కలిసి.. ఏటీఎంమెషిన్లో తనకు వచ్చిన నోట్ల గురించి చెప్పగా.. వాటిని తీసుకొని కొత్త నోట్లను ఇచ్చి పంపటం గమనార్హం. వరుసగా చోటు చేసుకున్న ఈ రెండు పరిణామాల్ని చూస్తే.. ప్రింట్ అయిన నోట్లను కట్టలు కట్టేసి పంపించటమే తప్పించి.. మళ్లీ క్రాస్ చెక్ చేసే వ్యవస్థ లేదా? అన్న సందేహం కలుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే అంతకుమించిన బాధ్యతారాహిత్యం మరొకటి ఉంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే అనిపించేది ఒక్కటే. చేతికి వచ్చిన నోట్లను ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలన్నట్లుగా పరిస్థితి మారిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News