మా వార్డ్‌లో రూ.9 ల‌క్ష‌లిచ్చారు.. మాకే తెలియ‌దంటూ వైసీపీ నేత‌ల గోల‌

Update: 2022-02-09 13:30 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్‌ను న‌మ్ముకుని పార్టీ కోసం ప‌ని చేస్తున్న కింది స్థాయి నేత‌లకు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని స‌మాచారం. వైసీపీ అధికారంలోకి రావాల‌ని ప్ర‌జ‌ల‌కు చెప్పి ఓట్లు వేయించిన వాళ్లు.. ఇప్పుడు ఆ జ‌నాల‌కు స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నారు. వైసీపీకి అండ‌గా నిలిచిన వాళ్ల‌కు కాకుండా టీడీపీ వాళ్ల‌కే ప్ర‌భుత్వ సంక్షేమ ఫ‌లితాలు అందుతుండ‌డ‌మే అందుకు కార‌ణం. దీంతో ఆ ప్ర‌జ‌లు వ‌చ్చి త‌మ‌కు అందుబాటులో ఉన్న వైసీపీ నాయ‌కుల‌ను ప్ర‌శ్నిస్తున్నార‌ని తెలిసింది. ఈ నేత‌లు వెళ్లి త‌మ గోడును ఎమ్మెల్యేల‌కు విన్న‌వించుకున్నా ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌డం లేద‌ని తెలిసింది.

ఓట్లు వేయిస్తే..

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి త‌న‌యుడ‌నే పేరుతో యువ నాయ‌కుడ‌నే ముద్ర‌తో చాలా మంది కార్య‌క‌ర్త‌లు జ‌గ‌న్‌తో క‌లిసి న‌డిచేందుకు ముందుకు వ‌చ్చారు. 2014 ఎన్నిక‌ల్లో క్షేత్ర‌స్థాయిలో ఈ నేత‌లు ఎంతో క‌ష్ట‌ప‌డి వైసీపీకి ఓట్లు వేయించారు.  అధికారం ద‌క్క‌క‌పోయినా నిరాశ ప‌డ‌కుండా పార్టీతోనే ఉన్నారు. 2019 ఎన్నిక‌ల్లో మ‌రింత శ్ర‌మించి ప్ర‌జ‌ల‌ను ఒప్పించి జ‌గ‌న్ పార్టీకి ఓట్లు వేసేలా చూశారు. పార్టీ ఘ‌న విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. కొన్ని వార్డుల్లో రూ.ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి మ‌రీ ఓట్లు వేయించార‌ని తెలిసింది. కానీ ఇప్పుడు వాళ్ల‌కే తెలీకుండా టీడీపీ వాళ్ల‌కు ఈబీసీ కింద రూ.9 ల‌క్ష‌లు ఇచ్చార‌ని ఆ వైసీపీ నేత‌లు వాపోతున్నారు. ఆ ల‌బ్ధిదారులు బ‌య‌ట‌కు చెప్ప‌కుండా సైలెంట్‌గా ఉంటున్నారు. కానీ డ‌బ్బులు రాని వాళ్లు మాత్రం వైసీపీ నేతల ఇళ్ల ముందు ఆందోళ‌న చేస్తూ తిడుతున్నార‌ని తెలిసింది.

మా చేతుల్లో ఏముంది?

త‌మ త‌మ వార్డుల్లో ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి వైసీపీకి ఓట్లు వేయిస్తే ఇప్పుడు ప్ర‌భుత్వం టీడీపీ వాళ్ల‌కు మేలు చేస్తుందని కింది స్థాయి నేత‌లు ఎమ్మెల్యేల వ‌ద్ద మొర పెట్టుకుంటున్నారు. కానీ ఆ ఎమ్మెల్యేలు కూడా అంత వాలంటీర్లే చూసుకుంటున్నార‌ని త‌మ‌కేం సంబంధం లేద‌ని చేతులు ఎత్తేస్తున్నార‌ని తెలిసింది.

 జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక సంక్షేమ ప‌థ‌కాల ఫ‌లితాలు ప్ర‌జ‌ల‌కు నేరుగా అందేలా వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి ల‌బ్ధిదారుల ఎంపిక‌, ప‌థ‌కాల అమ‌లు ఇలా అన్నీ వాళ్లే చూసుకుంటున్నారు. జ‌గ‌న్ మీట నొక్క‌గానే ప్ర‌జ‌ల ఖాతాల్లో డ‌బ్బులు ప‌డుతున్నాయి. దీంతో ఎమ్మెల్యేల పాత్ర నామ‌మాత్ర‌మైపోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు కూడా ఇప్ప‌టికే ఈ విష‌యంపై త‌మ అసంతృప్తికి వ్య‌క్తం చేశారు.

ఆ స‌ర్వేతో..

గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్న‌పుడు సాధికార స‌ర్వే చేసి ఆ పార్టీ వాళ్ల‌కు అర్హ‌త లేకున్నా ప‌థ‌కాలు పొందేందుకు ఎలిజిబిలిటీ వ‌చ్చేలా చేసుకున్నార‌ని తెలిసింది. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అర్హుల‌ను గుర్తించ‌డం కోసం ఎలాంటి స‌ర్వే చేయించ‌లేదు. దీంతో అన్ని సంక్షేమ ప‌థ‌కాలు ఆ టీడీపీ వాళ్ల‌కే చేరుతున్నాయ‌ని వైసీపీ నాయ‌కులు అంటున్నారు.

తాము అడ‌గ‌క‌పోయినా వైసీపీ ప్ర‌భుత్వ‌మే ఇస్తుంద‌ని టీడీపీ వాళ్లు చెబుతుంటే ఏం చేయాలో అర్థం కావ‌డం లేద‌ని ఆ నేత‌లు చెబుతున్నారు దీంతో గ్రామంలో త‌ల దించుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని వాపోతున్నారు. పార్టీ కోసం ప‌ని చేస్తున్న కార్య‌క‌ర్త‌లు, కింది స్థాయి నేత‌ల‌ను అధిష్ఠానం ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితం ద‌క్క‌డం లేద‌ని సీఎం జ‌గ‌న్‌పై వాళ్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే ప‌ద్ధ‌తి కొన‌సాగితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వాళ్లు జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా మారే ప్ర‌మాదం ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.
Tags:    

Similar News