ఓపెనింగ్ వెళ్లిన పీఎస్ లో సచిన్ వీరాభిమానిని అంత దారుణంగా ట్రీట్ చేశారా?

Update: 2022-01-23 05:30 GMT
సుధీర్ కుమార్ చౌదరి అన్నంతనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ.. క్రికెట్ దేవుడు సచిన్ వీరాభిమానిగా.. ఆయన ఆడే మ్యాచ్ ప్రతి దానికి.. అదెక్కడ జరిగినా విధిగా హాజరయ్యే హార్డ్ కోర్ ఫ్యాన్ అన్నంతనే.. ముఖానికి ఇండియా ప్లాగ్ ను రంగుగా వేసుకొని.. ఉండే సుధీర్ రూపం ఒక్కసారి కళ్ల ముందు కదలాడుతుంది. సచిన్ మీద అభిమానంతో ఆయన ఆడే మ్యాచ్ ఉన్న చోటుకు వెళ్లేందుకు.. ఆస్తుల్ని సైతం అమ్ముకొని వెళ్లిన అతడికి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. కొన్ని సందర్భాల్లో సచిన్ ప్రత్యేకంగా టికెట్ల తీసి ఆయన ప్రయాణ ఖర్చుల్ని భరించేవారు. చివరకు ప్రపంచ కప్ ను సొంతం చేసుకున్న సందర్భంగా.. ఆ ట్రోఫీని తన వీరాభిమాని చేతికి ఇచ్చిన వైనం తెలిసిందే.

అలాంటి సుధీర్ కుమార్.. తొలిసారి క్రికెట్ కు ఏ మాత్రం సంబంధం లేని విషయం మీద వార్తల్లోకి వచ్చారు. బిహార్ లోని ముజఫర్ పూర్ పోలీస్ స్టేషన్ లో తనకు జరిగిన అవమానం గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ వాపోయారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇదే పోలీస్ స్టేషన్ ను రెండేళ్ల క్రితం ప్రారంభించిన సందర్భంగా ఆయన అతిధిగా వెళ్లారు. కట్ చేస్తే.. తాజాగా అదే పోలీస్ స్టేషన్ లో తనకు చేదు అనుభవం ఎదురైనట్లు వాపోయారు.

ఒక కేసు విషయంలో తన సోదరుడు కిషన్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. దీంతో.. తన సోదరుడ్ని కలిసేందుకు తాను పోలీస్ స్టేషన్ కు వెళితే.. డ్యూటీలో ఉన్న అధికారి దుర్భాషలాడటంతో పాటు.. తనను కాళ్లతో తన్ని.. స్టేషన్ బయటకు తోసేశారన్నారు. ఈ నేపథ్యంలో తనకు జరిగిన అవమానం గురించి మీడియాకు తెలియజేశారు. తనను తిట్టటమే కాదు.. గాయపరిచిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏమైనా.. ఓపెనింగ్ చేసిన పోలీస్ స్టేషన్ లోనే ఇలాంటి చేదు అనుభవం ఎదురు కావటం మాత్రం రోటీన్ కు భిన్నమని చెప్పకతప్పదు.

Tags:    

Similar News