ఊరు ఏదైనా స‌రే.. 2 గంట‌లే కాల్చాలట‌!

Update: 2018-11-05 05:44 GMT
సోష‌ల్ మీడియాలో ఒక పోస్ట్ విప‌రీతంగా వైర‌ల్ అయ్యింది. దాని సారాంశం ఏమంటే.. ఏం వొదినా దీపావ‌ళికి పిండివంట‌లు వండ‌ట్లేదా? అంటే.. పండ‌క్కి ఏం వండాలి?  ఏ టైంలో వండాలి?  ఎన్ని ర‌కాలు వండాలి? ఎంత సేప‌ట్లో వండాలి? అన్న రూల్స్ ఏమైనా కోర్టు చెబుతుందేమోన‌ని వెయిట్ చేస్తున్నా.. కోర్టు చెప్పినంత‌నే వంట మొద‌లెడ‌తా? అంటూ చేసిన పోస్టుతో చెప్పాల్సిన విష‌యాన్ని చెప్పేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

కాలుష్యం పేరుతో కానీ.. మ‌రేదో పేరుతో కానీ హిందువుల పండ‌గ‌ల‌కు ఏదో ఒక వివాదాన్ని జ‌త చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. దీనికి త‌గ్గ‌ట్లే అటు ప్ర‌భుత్వాలు కానీ.. ఇటు కోర్టులు కానీ ఈ విష‌యాల మీద త‌మ అభిప్రాయాల్ని వెల్ల‌డిస్తూ.. ఇలానే చేయాల‌న్న గిరి గీయ‌టంపై ప‌లువురు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. కోర్టు మీద భ‌యం.. భ‌క్తి మాత్ర‌మే కాదు గౌర‌వ‌మ‌ర్యాద‌లు ఉన్నాయి. కాకుంటే త‌మ మ‌నోభావాల్ని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌న్న మాట సామాన్యుల నోట ప‌దే ప‌దే వినిపిస్తోంది.

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. దీపావ‌ళి పండ‌గ మ‌రో రెండు రోజుల్లోకి వ‌చ్చేసింది.  ట‌పాసుల షాపులు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. అయితే.. ట‌పాసులు కాల్చే విష‌యంలో ఈ మ‌ధ్య‌న సుప్రీంకోర్టు స‌రికొత్త‌గా ఆదేశాలు ఇవ్వ‌టం.. ఎవ‌రైనా స‌రే రెండు గంట‌ల వ్య‌వ‌ధిలోనే ట‌పాసులు కాల్చాల‌ని తేల్చి చెప్ప‌టం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ విష‌యంపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన కొన్ని ప్ర‌భుత్వాలు సుప్రీంను ఆశ్ర‌యించ‌గా.. వారి వారి సంప్ర‌దాయాల ప్ర‌కారం దీపావ‌ళి ట‌పాసులు కాల్చుకోవ‌చ్చ‌ని.. కాకుంటే కాల్చే ట‌పాసుల వ్య‌వ‌ధి మాత్రం రెండు గంట‌లే ఉంటుంద‌ని తేల్చి చెప్పింది.

దేశ రాజ‌ధానిలో రాత్రి 8 నుంచి 10 మ‌ధ్య‌లో కాల్చాల‌ని చెప్ప‌గా.. తెలంగాణ‌.. ఏపీలోనూ అదే టైంను ఫాలో కానున్నారు. దీంతో.. రెండు తెలుగురాష్ట్రాల్లోని ప్ర‌జ‌లు రాత్రి 8 నుంచి 10 మ‌ధ్య‌లోనే ట‌పాసుల్ని కాల్చాల్సి ఉంటుంది. మా పండ‌గ‌.. మా ట‌పాసులు.. మా ఇష్టం అనుకుంటే మాత్రం తిప్ప‌లేన‌ని చెబుతున్నారు. ఎందుకంటే..రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఆదేశాలు జారీ కావ‌టం.. సుప్రీంకోర్టు పేర్కొన్న రీతిలోనే ఆదేశాలు జారీ చేయ‌టమే కాదు.. ఆయా ప్రాంతాల పోలీసులు ట‌పాసులు కాల్చే విష‌యంలో ప‌రిమితికి మించిన టైంలో కాలిస్తే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.

పండ‌గ వేళ లేనిపోని స‌మ‌స్య‌లు తెచ్చి పెట్టుకునే క‌న్నా.. రాత్రి 8 నుంచి 10మ‌ధ్య‌లో ట‌పాసులు కాల్చేసి ఊరుకుండిపోవ‌టం మంచిద‌ని చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి ప‌రిమితులు మ‌రెన్ని వ‌స్తాయో? ప‌ండ‌గ వేళ‌.. పోలీసులు క‌నుస‌న్న‌ల్లో ట‌పాసులు కాల్చాల్సి వ‌స్తుంద‌న్న మాట‌లు పలువురి నోటి నుంచి వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News