ముప్పయి సీట్లు పవన్ కి చాలా... మరి ముఖ్యమంత్రి ముచ్చట...?

Update: 2022-12-02 07:33 GMT
వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ఒక్క చాన్స్ ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టిగా కోరుతున్నారు. ఆయన ఇప్పటికి కొన్ని సార్లు బహిరంగంగానే ఒంటరి పోరు గురించి ఈ విధంగా సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. మరో పార్టీతో పొత్తులు అంటే పవన్ సీఎం అయ్యే అవకాశాలు పూర్తిగా లేకుండా పోతాయి. ముఖయంగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే సీట్లు ఎన్నో కొన్ని వస్తాయి కానీ పవన్ కి ముఖ్యమంత్రి ముచ్చట తీరదు.

అయితే ఏపీలో చూస్తే పవన్ ఎవరితో కలసి నడుస్తారు అన్నది ఇప్పటికి ఇంకా తేలని వ్యవహారంగా ఉంది. బీజేపీతో పవన్ మైత్రి సాగుతోంది. కానీ 2014 ఎన్నికల మాదిరిగా బీజేపీ టీడీపీ జనసేన కలసి పోటీ చేయడం కుదురుతుందా అన్నది కూడా లెక్క తేలడంలేదు. అదే సమయంలో ఏపీలో త్రిముఖ పోరు ఉంటుందా అంటే దాని మీద కూడా ఎక్కడా స్పష్టత లేదు.

ఈ నేపధ్యంలో జనసేన వ్యూహాత్మకంగానే సస్పెన్స్ కొనసాగితూ వస్తోంది అని అంటున్నారు. ముందు సొంతంగా బలపడితే ఆ మీదట పొత్తుల సంగతి ఆలోచన చేయవచ్చు అన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటుంది అని లెక్క వేసి చెబుతోంది. దానికి కారణాలు కూడా వివరిస్తోంది. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి ఇప్పటికి ఎక్కడా విమర్శించలేదు.

ఆయన ఎంతసేపూ ఏపీలో వైసీపీని గద్దె దించుతాను అని అంటున్నారు తప్ప తాను అధికారంలోకి రావాలని ధాటీగా చెప్పడంలేదు అన్నది వైసీపీ నేతల ఆరోపణ. దీనికి మరికాస్తా మసాలా జోడిస్తూ ఏపీలోఅ రేపటి ఎన్నికల్లో జనసేన టీడీపీ మధ్య పొత్తులు కచ్చితంగా ఉంటాయని వైసీపీ కీలక నేత సజ్జల రామక్రిష్ణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

అంతే కాదు మరో అడుగు ముందుకేసి ఆయన ఈ పొత్తులలో భాగంగా జనసేనకు టీడీపీ 15 సీట్లు ఇవ్వాలనుకుంటోందని కొత్త విషయం చెప్పారు. అయితే జనసేన ముప్పయి సీట్ల దాకా డిమాండ్ చేస్తోందని, వ్యవహారం అక్కడ ఆగిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇది సంచలనంగా ఉన్నా ఒకింత ఆశ్చర్యంగానూ ఉంది. ఎందుకంటే ఆ పాతిక ముప్పై సీట్లో కోసమే పవన్ కళ్యాణ్ ఇంతలా హడావుడి చేస్తున్నారా అన్నదే ఇక్కడ డౌట్.

ఏపీలో బలమైన సామాజికవర్గానికి సీఎం సీటు మీద మోజు ఉంది. అది దశాబ్దాల కాలంగా కూడా అలాగే ఉండిపోయింది. పవన్ రూపేణ అది తీరుతుందని వారు ఆశిస్తున్నారు. మరి అది జరగాలంటే సోలోగానే జనసేన పోటీ చేయాలి. ఒక వేళ అలా కాకున్నా పొత్తులలో అయినా మంచి నంబర్ తో సీట్లు తీసుకోవాలి.

మరి ఏమీ కాకుండా ముప్పయి సీట్లు తీసుకుని కధ ముగించేస్తే పవన్ ఎప్పటికి సీఎం అవుతారు. అసలు ఇది జరిగేనా. జనసేనలో దీన్ని ఒప్పుకుంటారా. దానికి మించి బలమైన సామాజికవర్గం కూడా దీని మీద ఎంతవరకూ ఆమోదం తెలుపుతుంది అన్నది కూడా చర్చగా అయింది. అయితే తరచి చూస్తే ఇది కేవలం వైసీపీ వ్యూహాత్మకంగా విపక్ష శిబిరంలో గందరగోళం సృష్టించడానికి వేసిన ఎత్తుగడ అని అంటున్నారు.

ఎలా అంటే రేపటి ఎన్నికల్లో పొత్తులు కుదురుతాయని వస్తున్న వార్తల నేపధ్యంలో ఆ పొత్తులు సజావుగా కుదరకుండా ఈ నంబర్ ని ముందు పెట్టి గందరగోళం క్రియేట్ చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది అని అంటున్నారు. అదే టైం లో జనసేన సింగిల్ గా పోటీ చేయలేదని, పొత్తులలో కూడా దాని వాటా మరీ కనికిష్టంగా ఉండబోతోందని చెప్పడం ద్వారా ఆ పార్టీ వీక్ నెస్ ని బయటపెట్టాలను కూడా వ్యూహం రచిస్తున్నారు అని అంటున్నారు. మరి దీన్ని నమ్ముతారా అన్నదే ఇక్కడ చర్చగా ఉంది.

మరి ఇలాంటి ఊహాగానాలకు ప్రచారాలకు సరైన జవాబు చెప్పాల్సింది పవన్ కళ్యాణే అని అంటున్నారు. టీడీపీకి కూడా దీని వల్ల పోయేది ఏమీ లేదు. తక్కువ సీట్లే వారు పొత్తులో భాగంగా ఎటూ ఇవ్వాలని అనుకుంటున్నారు కాబట్టి హ్యాపీగా ఉంటుంది. కానీ ఇజ్జత్ పోయేది పూర్తిగా జనసేనకే. కాబట్టి ఈ రకమైన ప్రచారాలకు ఫుల్ స్టాప్  పడాలీ అంటే జనసేన అధినాయకత్వమే నోరు విప్పాల్సి ఉంటుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News