రాజకీయం అంటే సజ్జల చెప్పినట్లుగా చంద్రబాబు వినటమేనా?

Update: 2022-12-23 03:55 GMT
రాజకీయం అంటే ఏమిటి? అసలు రాజకీయం ఎలా ఉండాలి? అసలు తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీనేనా? లాంటి చిత్ర విచిత్రమైన క్వశ్చన్లు ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామక్రిష్ణారెడ్డి నోటి నుంచి వస్తున్న మాటల్ని వింటే అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది.

తెలంగాణలో చచ్చిపోయిందని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ.. అందుకు భిన్నంగా సీన్ ఉండటం తెలంగాణ అధికార పక్షమైన బీఆర్ఎస్ కే కాదు ఏపీ అధికార పక్షానికి షాకింగ్ గా మారిందన్న మాట వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా తాజా రియాక్షన్స్ ఉన్నాయి. ఖమ్మంలో బాబు సభ హిట్ అయిన వేళ.. వైసీపీ.. బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ముఖ్యులు స్పందించారు.

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామక్రిష్ణారెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీనా? మార్కెటింగ్ ఏజెన్సీనా? అన్నది స్పష్టత ఇవ్వాలని వ్యాఖ్యానించటం గమనార్హం. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. టీడీపీ మనుషులను చూపించి పొత్తు పెట్టుకోవాలని తాను పంపిన స్లీపర్ సెల్స్ ద్వారా బీజేపీ అధిష్ఠానానికి చెప్పించటానికే చంద్రబాబు ఖమ్మంలో సభ పెట్టారన్నారు.

సజ్జల వ్యాఖ్యలు చూస్తున్నప్పుడు.. ఆయన మాటల్లో తేడా కొట్టొచ్చినట్లుగా కనిపించటమే కాదు.. ఖమ్మం సభ వైసీపీ శిబిరంలో ఎంతటి ఇంపాక్టు చూపిస్తుందన్న విషయం అర్థమవుతుందని చెప్పాలి. తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏపీపైనా ప్రభావితం చేస్తాయన్నది నిజం. పైకి బీజేపీ ప్రస్తావన తెస్తూ సజ్జల అండ్ కో తమ వాదనల్ని వినిపిస్తున్నా.. అసలు కారణం వేరే ఉందన్న మాట వినిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిందనుకున్న తెలంగాణలోనూ ఇంతటి ఆదరణ ఉంటే.. ఏపీలో పరిస్థితేమిటన్నది ఇప్పుడు ప్రశ్న. తెలంగాణలో పార్టీ అన్నదే లేకుండా పోయి.. ఏపీలో తమ దెబ్బకు విలవిలలాడిపోతూ.. ప్రభావం అన్నదే లేనట్లుగా తాము చేస్తున్న ప్రచారానికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందన్న సంకేతం తమకు దెబ్బ పడుతుందన్న ఆందోళన సజ్జల మాటల్లో వినిపిస్తోందని చెప్పాలి.
 
సాధారణంగా కొన్ని విషయాన్ని విస్మరించటం ద్వారా.. ప్రాధాన్యతను ఇవ్వకపోవటం ద్వారా.. ప్రత్యర్థి బలంపై ఒక అభిప్రాయం ప్రజల్లో కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే.. అనూహ్యంగా టీడీపీ బలం ఎంత? అన్న విషయం కళ్లకు కట్టినట్లుగా ఖమ్మం శంఖారావం సభ చెప్పేయటంతో.. గొంతులు సవరించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్న మాట వినిపిస్తోంది. రాజకీయపార్టీనా.. మార్కెటింగ్ ఏజెన్సీనా? అంటూ సజ్జల వారికి సందేహం కలిగిన నేపథ్యాన్ని చూస్తే.. ఖమ్మం శంఖారావం సభ తాలుకూ అంచనాలు భారీగా తప్పటమే అన్న మాట వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News