ప్ర‌తిప‌క్షాల‌న్నీ క‌లిసి కేసీఆర్‌ ను ఒంట‌రి చేశాయా?

Update: 2019-10-30 16:04 GMT
దాదాపు పాతిక రోజులుగా సాగుతున్న ఆర్టీసీ స‌మ్మెలో కీల‌క ఘ‌ట్టం చోటుచేసుకుంది. ప్ర‌భుత్వం మొండిప‌ట్టు - చ‌ర్చ‌ల్లో ప్ర‌తిష్టంభ‌న నేప‌థ్యంలో...ఆర్టీసీ కార్మికులు నీరుగారిపోకుండా...కార్మికుల్లో ఆత్మస్థైర్యం కల్పించాలన్న లక్ష్యంతో ఆర్టీసీ జేఏసీ సకల జనుల సమర భేరి నిర్వ‌హించింది. హైద‌రాబాద్ సరూర్‌నగర్లో జ‌రిగిన ఈ సభ...తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఓ వైపు...విపక్షాల‌న్నీ ఓ వైపు అనే తేడాను స్ప‌ష్టంగా చూపింది. ఆర్టీసీ కార్మికుల‌కు విప‌క్షాలు - ప్ర‌జాసంఘాలు అండ‌గా ఉన్నాయ‌ని స్పష్టం చేసింది. ఈ స‌భ నేప‌థ్యంలో...ప్ర‌భుత్వ వైఖ‌రిపై స‌హ‌జంగానే ఆస‌క్తి నెల‌కొంది.

ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన సకల జనుల సమరభేరీ సభకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఉపాధ్యాయ‌ - కార్మిక సంఘాల‌తో పాటుగా ఆయా పార్టీల నేత‌లు పాల్గొని ప్ర‌సంగించారు. ఆర్టీసీ సమ్మెకు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి - కొండా విశ్వేశ్వర్ రెడ్డి - వీహెచ్ - బీజేపీ నుంచి వివేక్ - జితేందర్ రెడ్డి - తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం - టీడీపీ తెలంగాణ‌ అధ్యక్షుడు రమణ - వామపక్ష నేతలు తదితరులు మద్దతు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్రభుత్వ వైఖరి సరికాదని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...సకల జనుల సమ్మెకు సమైక్యపాలకులు అనుమతిస్తే..ఇపుడు సభ పెట్టుకుంటామంటే కేసీఆర్ అనుమితవ్వడంలేదని మండిప‌డ్డారు. ఆర్టీసీ నష్టాల్లో లేదని..నష్టాల్లోకి నెట్టివేయబడిందన్నారు. విమానంలో పోసే పెట్రోల్ కు ఒక శాతం వ్యాట్ వసూలు చేస్తున్న కేసీఆర్..ఇవాల పేదోడు తిరిగే ఎర్రబస్సుకు 27 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. విభజనం చట్టం ప్రకారం ఆర్టీసీ ఆస్తులు - అప్పులు పంపకం ఇంకా జరగలేదంటున్నారు కాబట్టి ఏపీలో తీసుకున్న విలీన నిర్ణయం తెలంగాణలో కూడా వర్తిస్తుందన్నారు.ఎర్రబెల్లి అనే ఊసరవెళ్లి ఆర్టీసీ విలీనం తమ అజెండాలో ఉందా అని అన్నారు..ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తామని మీ మేనిఫేస్టోలో ఉందా ? అని ప్రశ్నించారు రేవంత్.  20 శాతం మెఘా కృష్ణారెడ్డికి కట్టబెడతామని మీ మేనిఫెస్టోలో ఉందా? అని అన్నారు. తప్పుడు నివేదికలో కోర్టును కూడా పక్కదారి పట్టిస్తున్నారని రేవంత్ మండిప‌డ్డారు.

బీజేపీ నేత వివేక్ మాట్లాడుతూ...కార్మికుల్లో చీలిక తీసుకొచ్చేందుకు మంత్రులు - ఎమ్మెల్యేలు ప్రయత్నించారని ఆరోపించారు. కానీ మీరు ఒక్కటే - ఏకతాటిగా సమ్మె చేసి.. ఐక్యత ఏంటో నిరూపించారని కొనియాడారు.కార్మికులకు రూ.50 వేలు జీతం వస్తుందని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమకు రూ.20 వేలే వస్తుందని కార్మికులు చెబుతున్నారన్నారు. కార్మికులు కష్టపడి ఆర్టీసీని కాపాడుకుంటున్నారన్నారు. 26 రోజులుగా కార్మికులు శాంతియుతంగా సమ్మె చేస్తుంటే పట్టించుకోవడం లేదన్నారు.

టీజేఏసీ చైర్మ‌న్ కోదండరాం ఈ సంద‌ర్భంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.  ఇప్పటి వరకు 15 మందిని కేసీఆర్ ప్రభుత్వం బలితీసుకుందని…ఇంకా ఎంత మందిని బలితీసుకుంటారని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు జీతాలు అడగటం లేదని… ఆ సంస్థను బతికించాలని కోరుతున్నారని అన్నారు. ఇది మామూలు సమ్మె కాదని…ఆర్టీసీ ఆస్తులను కాపాడటానికి చేస్తున్న సమ్మె అన్నారు. ప్రభుత్వంలో విలీనం అయితే తప్ప ఆర్టీసీ బతకదని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుంటే..మరోసారి ట్యాంక్ బండ్ పై మిలియన్ మార్చ్ నిర్వహిస్తామన్నారు. తమకు మద్దతు తెలిపిన రాజకీయ పార్టీల‌కు ఆర్టీసీ జేఏసీ క‌న్వీన‌ర్ అశ్వత్థామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల గత నెలరోజుల నుంచి జీతాలు లేవని.. కానీ తమ సమస్యల సాదనం కోసం ఇబ్బందులు తప్పవన్నారు. కాగా  ఈ స‌క‌ల‌ భేరీపై టీఆర్ ఎస్ పార్టీ స్పందించ‌లేదు. అయితే - ఇటు ప్ర‌భుత్వ వ‌ర్గాలు - అటు పార్టీ వ‌ర్గాల ద్వారా స‌భ గురించి గులాబీ పెద్ద‌లు అధ్య‌య‌నం చేసిన‌ట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News