పార్ల‌మెంట్‌లో పెగాసస్ రచ్చ .. మళ్లీ మళ్లీ అదే సీన్ !

Update: 2021-07-27 07:11 GMT
పార్ల‌మెంట్‌ లో విప‌క్షాలు నినాదాల‌తో హోరెత్తిస్తున్నారు. లోక్‌స‌భ, రాజ్య‌స‌భ‌లో నేడు ఉద‌యం భారీ స్థాయిలో విప‌క్షాలు నిర‌స‌న నినాదాలు వినిపించాయి. రాజ్య‌స‌భ‌లో విప‌క్ష స‌భ్యులు వెల్‌లోకి వ‌చ్చి ఆందోళ‌న చేప‌ట్టారు. పెగాస‌స్ ప్రాజెక్టు నివేదిక‌ పై  చ‌ర్చ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. పార్ల‌మెంట్ చ‌ట్టాలు చేసేందుకు ఉంద‌ని, కానీ స‌భ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌తిప‌క్షాలు అడ్డుకుంటున్న‌ట్లు వెంక‌య్య అన్నారు. పార్ల‌మెంట్ దిగ‌జారిన తీరు దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు. అయినా విప‌క్ష స‌భ్యులు ప‌ట్టువీడ‌క‌పోవ‌డంతో స‌భ‌ను ఆయ‌న 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు. ఇక లోక్‌ స‌భ‌లో కూడా విప‌క్ష స‌భ్యులు నినాదాల‌తో కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకున్నారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష స‌భ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు. నినాదాలు తీవ్ర స్థాయికి చేర‌డంతో.. స్పీక‌ర్ ఓం బిర్లా స‌భ‌ను వాయిదా వేశారు. లోక్‌ సభలో 'పెగసాస్ ప్రాజెక్ట్' నివేదికపై చర్చించడానికి కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ వాయిదా తీర్మానం కూడా ఇచ్చారు.

పార్లమెంటు సమావేశాల్లో అధికార, విపక్షాలు ఈ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ ఉదంతంపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. స్పియర్-ఫిషింగ్ పద్ధతులను ఉపయోగించి టెక్స్ట్ లింక్‌లు లేదా మెసేజెస్ క్లిక్స్ ద్వారా మొబైల్ ఫోన్లలోకి స్పైవేర్ జోప్పించే స్థాయి నుంచి... ‘జీరో-క్లిక్’ అటాక్స్‌ ప్రయోగించే స్థాయికి ఎదిగిన స్పైవేర్ పద్ధతులు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ప్రస్తుతం మొబైల్ వినియోగదారులను వణికిస్తున్న ‘పెగాసస్‌’ స్పైవేర్ ని అత్యంత శక్తివంతమైనదిగా టెక్ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఫోన్ యూజర్ ఎలాంటి లింక్ ఓపెన్ చేయకపోయినా.. అసలు ఆ వ్యక్తి ప్రమేయం లేకపోయినా.. పెగాసస్‌ స్పైవేర్ మొబైల్‌ని హ్యాక్ చేసేస్తుంది.

మానవ తప్పిదం లేదా మానవ ఇంటరాక్షన్ లేకుండానే జీరో-క్లిక్ సైబర్ అటాక్స్‌ అనేవి పెగాసస్‌ వంటి స్పైవేర్లకు మొబైల్‌ ని కంట్రోల్ చేయడానికి సహాయ పడుతుంటాయి. నేరుగా సిస్టమ్ పైనే అటాక్ జరుగుతుంది కాబట్టి ఫిషింగ్ అటాక్ గురించి అవగాహన ఉన్నా... లేదా లింక్స్ పై క్లిక్ చేయకూడదు అని తెలిసినా ఎలాంటి ఉపయోగమూ ఉండదు. సాఫ్ట్ వేర్ పైన ఎక్కువగా జరిగే ఈ అటాక్స్ హానికరమైనవా కాదా అనేది నిర్ధారించడానికి సమయం కూడా ఉండదు. ఈ సైబర్ దాడులను గుర్తించడమే కష్ట సాధ్యం కాబట్టి నిరోధించడం అనేది దాదాపు అసాధ్యం. మొబైల్ వినియోగదారులు చేయాల్సిందల్లా తమ సెక్యూరిటీ ప్యాచ్ లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్ యాప్, యాపిల్ ప్లే స్టోర్ల నుంచి మాత్రమే అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ దాడుల నుంచి తప్పించుకోవాలంటే.. మీ అప్లికేషన్లను అన్ ఇన్స్టాల్ చేసి.. బ్రౌజర్స్ ద్వారా మెయిల్స్, మెసేజెస్ చెక్ చేసుకోండి.

దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నిగ్గు తేలనుంది. అటు ప్రతిపక్షాలు, ఇటు మీడియా సంస్థలు పెగసస్ స్పైవేర్‌ పై ఆందోళన వ్యక్తం చేసిన నేపధ్యంలో ఈనెల 28న విచారణ జరగనుంది. మేకిన్ ఇజ్రాయిల్ సాఫ్ట్‌ వేర్ పెగసస్ ఫోన్ ట్యాపింగ్  వ్యవహారం దేశవ్యాప్తంగా ఆందోళన రేపుతోంది. ప్రముఖులందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని, దేశ భద్రతకు ముప్పు వాటిల్లిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పశ్చిమ బెంగాల్ సీఎం  మమతా బెనర్జీ సైతం ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించి విచారించాలని డిమాండ్ చేశారు. అటు ఎడిటర్స్ గిల్ట్ ఆఫ్ ఇండియా సైతం ఈ వ్యవహారంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సొంత పౌరుల ఫోన్లపై, కదలికలపై భారత ప్రభుత్వ సంస్థలు దృష్టి పెట్టినట్టు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. పాత్రికేయులపై నిఘా అంటే పత్రికా స్వేచ్ఛపై దాడి అని ఎడిటర్స్ గిల్ట్   స్పష్టం చేసింది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నాలు దారుణమని విమర్శించింది.
Tags:    

Similar News