గ్రౌండ్ రిపోర్ట్ : 'సర్వేపల్లి' లో గెలుపెవరిది?

Update: 2019-03-30 09:26 GMT
అసెంబ్లీ నియోజకవర్గం: సర్వేపల్లి

టీడీపీ: సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి
వైసీపీ : కాకాణి గోవర్ధన్‌ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే జిల్లాలో టీడీపీ కంటే వైసీపీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. జిల్లాలోని 10 నియోజకవర్గాలో కేవలం రెండు చోట్ల మాత్రమే టీడీపీ గెలిచింది. దీంతో జిల్లాలో పట్టు సాధించేందుకు పార్టీ అధినేత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వీటిలో ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఎలాగైనా చేజిక్కిచ్చుంకునేలా ప్లాన్‌ వేశారు. ఇందులో భాగంగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికే టికెట్‌ కేటాయించారు. అటు వైసీపీ తరుపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికే మరోసారి టికెట్‌ కేటాయించింది వైసీపీ. దీంతో సర్వేపల్లిలో పాత ప్రత్యర్థుల మధ్యే పోరు ఉత్కంఠగా సాగుతోంది.

* సర్వేపల్లి నియోజకవర్గం చరిత్ర

మండలాలు: ముత్తకూరు - పొదలకూరు - తోటపల్లి గూడూరు - వెంకటాచలం,

ఓటర్లు: 2లక్షల 20 వేలు

1955లో నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు నాలుగు సార్లు విజయం సాధించారు.టీడీపీ రెండు సార్లు మాత్రమే జెండా ఎగురవేసింది. గత ఎన్నికల్లో వైసీపీ స్థానాన్ని దక్కించుకుంది. నియోజకవర్గంలో ఎన్నో కంపెనీలు ఏర్పడ్డాయి. కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే స్థానికులకు ఉద్యోగాలు కల్పించడంలో సఫలీకృతం కాలేదన్న విమర్శలు వస్తున్నాయి. అలాగే కంపెనీల ఏర్పాటుకు తమ భూములను తీసుకున్న వారి నుంచి పరిహారం అందించడంలో చొరవ చూపలేదన్న విమర్శలున్నాయి.

*సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఈసారైనా గెలుస్తారా..?

1994 - 99లో వరుసగా గెలుపొందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఆ తరువాత ఓడుతూ వస్తున్నారు. 2014లోనూ పరాజయం చెందిన సోమిరెడ్డికి టీడీపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవినిచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రిగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అయితే వరుసగా ఓడుతున్న సోమిరెడ్డి ప్రజలకు చేరువ కాలేదని అంటున్నారు. అంతకుముందు సోమిరెడ్డి ఈ నియోజకవర్గంలో పోటీ చేయరనే ప్రచారం జరిగింది. కానీ ఆయన పట్టుబట్టి మరీ పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలుస్తానని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

అనుకూలతలు:

-టీడీపీలో కీలక నేతగా ఉండడం
-మంత్రిగా పనిచేసిన అనుభవం
-ఐదేళ్లలో పార్టీని బలపర్చడం

ప్రతికూలతలు:

-ప్రత్యర్థి బలమైన నేత కావడం
-రెడ్డి సామాజిర వర్గం దూరంగా ఉండడం
-టీడీపీ కేడర్‌ తక్కువగా ఉండడం

* కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మరోసారి జెండా పాతేనా?

2014 ఎన్నికల్లో కాకాణి గోవర్దన్‌రెడ్డి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోసారి ఆయనకే టికెట్‌ ఇవ్వడంతో రెండోసారి గెలిచేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. ఐదేళ్లలో నియోజకవర్గంలో పట్టు పెంచుకొని కార్యకర్తలకు దగ్గరయ్యారు. అటు జిల్లా వ్యాప్తంగా వైసీపీ బలంగా ఉండడంతో తనకు కలిసి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాని నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలను కాకాణీ పట్టించుకోలేదని విమర్శలున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఏర్పడిన కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తానని అధికారంలోకి వచ్చి పట్టించుకోలేదనే ఆందోళనలు జరిగాయి.

అనుకూలతలు:

-పార్టీ పట్టును సాధించడం
-నియోజకవర్గంలో అభివృద్ధి పనులు
-ప్రత్యర్థి పలుసార్లు ఓడిపోవడం

ప్రతికూలతలు:

-వేధిస్తున్న కేసులు
-ఉద్యోగాల కల్పనలో తాత్సారం

*టఫ్ ఫైట్ లో గెలిచేదెవరు?

మొత్తంగా సర్వేపల్లిలో కాకాణీ వర్సెస్‌ సోమిరెడ్డి అన్నట్లుగానే పోటీ ఉంది. మూడుసార్లు ఓడిన సోమిరెడ్డికి సానుభూతి ఓట్లు పడుతాయా..? లేక మరోసారి కాకాణిని గెలిపించి వైసీపీకి పేరు తెస్తారా..? అనేది చర్చనీయాంశంగా మారింది. సోమరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గెలిస్తే ఆయన ఆధ్వర్యంలో మూడోసారి టీడీపీ జెండా ఎగురవేసినట్లవుతుంది. వైసీపీ సైతం పట్టున్న జిల్లాలో సీటును వదులుకోకుండా గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తుంది. ఓడిన సానుభూతి, అధికార టీడీపీ అండదండలతో సొమిరెడ్డి బలంగా ముందుకు వెళుతున్నారు. మరోవైపు జిల్లాలో బలంగా ఉన్న వైసీపీ గాలి.. బలమైన జగన్ వేవ్ తో కాకాణీ పోరాడుతున్న ఈ ఇద్దరిలో ఎవరి గెలుపు అనేది చెప్పడం కష్టంగా మారింది.. చూడాలి మరి వరుసగా ఓడిపోతున్న సోమిరెడ్డికి ఈసారి కాలం కలిసివస్తుందా.? లేక వైసీపీ మరోసారి స్థానాన్ని నిలబెట్టుకుంటుందో..
   

Tags:    

Similar News