శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ (SAS Group) సంచలన సర్వే : చిత్తూరు జిల్లాలో చిత్తు అయ్యేది ఏ పార్టీ....?

Update: 2023-03-10 09:38 GMT
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ జిల్లాకు రాజకీయ ప్రాముఖ్యత ఉంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం తప్ప మొత్తం పదమూడు సీట్లను వైసీపీ కైవశం చేసుకుంది. అయితే ఈసారి ఎలా ఉంటుంది అంటే టీడీపీ బలంగా పుంజుకుంది అని శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ (ఎస్ ఏ ఎస్) సర్వే నివేదిక తెలియచేస్తోంది.

మొత్తం సీట్లలో ఎవరికి ఎన్ని సీట్లు అన్నది తాజాగా ఆ సర్వే వెల్లడించిన సమాచారం మేరకు చూస్తే టీడీపీకి గత ఎన్నికల్లో ఒక్క సీటు వస్తే ఈసారికి అది కాస్తా నాలుగుకు పెరుగుతోంది. అంటే మూడు సీట్లు ప్లస్ లో టీడీపీ ఉంది అన్న మాట. ఇక పదమూడు నాడు గెలిచిన వైసీపీకి కచ్చితంగా వచ్చే సీట్లు ఏంటి అంటే ఎనిమిది అని సర్వే చెబుతోంది. మరో రెండు హోరా హోరీ పోటీలో ఉన్నాయి.

అంటే వైసీపీ ఈ రోజుకీ మెజార్టీ సీట్లను సాధించినా గతంతో పోలిస్తే రాజకీయ నష్టమే అని ఈ సర్వే వెల్లడిస్తోంది. ఇక ఏఏ సీట్లు టీడీపీకి వస్తాయని చూస్తే మదనపల్లి, కుప్పం, నగరి, పలమనేరుగా ఉంది. అలాగే వైసీపీ ఏ సీట్లను గెలుచుకుంటుంది అని చూస్తే తిరుపతి, జీడీ నెల్లూరు, పూతలపట్టు, పుంగనూరు, సత్యవేడు, చంద్రగిరి, చిత్తూరు, తంబలపల్లిగా ఉన్నాయి. హోరా హోరీ పోటీలో ఉన్న సీట్లుగా పీలేరు, శ్రీకాళహస్తిగా చెబుతోంది ఈ సర్వే.

ఇక్కడ చూస్తే నగరి సీట్లో వైసీపీ మహిళా నేత, మంత్రి ఆర్కే రోజా రెండు సార్లు గెలిచారు. ఆమె ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. కానీ ఓటమి ఖాయమే అంటోంది ఈ సర్వే. దాంతో మంత్రి రోజాకు ఇది చేదు సర్వేగానే ఉంది. అలాగే శ్రీకాళహస్తిలో ఉన్న వైసీపీ కీలక నేత బియ్యపు మధుసూదన్ రెడ్డికి పోటా పోటీ ఫైట్ ఉంటుందంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.

అదే టైం లో పీలేరులో కూడా వైసీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది అని అంటున్నారు. ఇక టీడీపీ గెలుచుకునే సీట్లు చూస్తే మదలపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే ఎం నవాజ్ ఓటమి అంచున ఉన్నారు అని సర్వే చెబుతోంది. అలాగే పలమనేరులో చూస్తే వైసీపీ ఎమ్మెల్యే ఎన్ వెంకటే గౌడా ఓడిపోతారని సర్వే చెబుతోంది.

మొత్తానికి చంద్రబాబుని కుప్పంలో ఓడించి మొత్తం క్లీన్ స్వీప్ చేస్తామని వైసీపీ పెద్దలు కలలు కంటున్నారు. కానీ టీడీపీ వేగంగా పుంజుకుంటోంది అని సర్వే చెబుతోంది. 2024 నాటికి ఇంకా పరిస్థితి మెరుగుపడితే మాత్రం వైసీపీకి ఇబ్బందే అంటోంది ఈ సర్వే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News