శశికళ టార్గెట్ ఎవరు?

Update: 2017-02-15 09:59 GMT
శశికళ అంటే ఇప్పుడు అందరి దృష్టిలో పరాజిత. ముఖ్యమంత్రి పీఠం ఎక్కలేకపోయారు.. జైలుకెళ్లకుండా తప్పించుకోలేకపోయారు. అమ్మ తరువాత అమ్మగా హవా కొనసాగించలేకపోయారు. అనుకున్నవేవీ సాధించుకోలేకపోయారు. అందుకే ఆమె పరాజిత. కానీ.. శశి మాత్రం ఈ పరాజయాలు తాత్కాలికం అనుకుంటోందట. జైలు నుంచి తిరిగొచ్చాక తానేంటో చూపించాలని ఇప్పుడే డిసైడయ్యారట. తనకీ దుస్థితి పట్టడానికి కారణమైన ఎవరినీ వదిలిపెట్టకూడదని ఆమె గట్టిగా నిశ్చయించుకున్నారు. దీంతో ఆమె ఎవరిని టార్గెట్ చేసుకున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
    
శశి టార్గెట్ ఎవరని అనుకుంటే తొలుత వినిపించే పేరు పన్నీర్ సెల్వం. అందులో అనుమానమే లేదు. చెప్పిన మాట విన్నట్లు నటించి రాజీనామా చేసినా మరునాడే అడ్డం తిరగడంతో మొత్తం వ్యవహారం దెబ్బతింది. సో... పన్నీర్ ఆమెకు ఫస్ట్ టార్గెట్. అయితే.. పన్నీర్ అడ్డం తిరిగినా ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని సీఎం కుర్చీ చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా గవర్నరు విద్యాసాగరరావు రూపంలో ఆమెకు మరో అడ్డుగోడ ఎదురైంది.  అయితే... శశికళకు వెంటనే చాన్సివ్వకుండా వెయిట్ చేసింది విద్యాసాగరరావే అయినా కథంతా నడిపించింది బీజేపీ అని.. ఆ పార్టీ పెద్దలు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీలే అని శశికళకు గట్టి నమ్మకం.  పన్నీర్ కు ధైర్యం నూరిపోసి.. ఆయన వెంట ఎమ్మెల్యేలు వచ్చేలా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది వెంకయ్యనాయుడు - అరుణ్ జైట్లీలన్నది శశికళకు ఉన్న ఇన్ఫర్మేషన్. దాంతో వీరందరినీ ఆమె టార్గెట్ గా చేసుకుందని.. మొత్తం బీజేపీనే ఆమె టార్గెట్ చేసిందని తెలుస్తోంది.
    
పన్నీర్ కుట్ర వెనుక బీజేపీతో పాటు డీఎంకే నేతలు కూడా ఉన్నారన్నది శశి  అనుమానం.  ఆమె, ఇప్పటికే వారిపై పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.  దీంతో శశికళ జైల్లో ఉన్నా తన ప్రతినిధిగా పళని స్వామిని సీఎం చేసి..  జైలు నుంచి కూడా తాను సలహాలు, సూచనలు ఇచ్చి నడిపించేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే.. శశికళ టార్గెట్లను పళనిస్వామి ఎంతవరకు పూర్తి చేయగలరన్నది చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News