సౌదీ సంచలన నిర్ణయం.. అన్ని విదేశీ విమానాలపై బ్యాన్

Update: 2020-12-22 07:20 GMT
బ్రిటన్ లో విస్తరిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ నేపథ్యంలో పలు దేశాలు అలెర్టు అవుతున్నాయి. తాము కొత్తరకం వైరస్ ను నియంత్రించలేని రీతిలో వ్యాపిస్తోందని బ్రిటన్ ప్రభుత్వం స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో.. పలు దేశాలు మేల్కొన్నాయి. దానికి ముందే.. యూరోప్ లోని పలు దేశాలు.. బ్రిటన్ తో రవాణా రాకపోకల్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. వాటితో పోలిస్తే.. మిగిలిన దేశాలుకాస్త ఆలస్యంగానే స్పందిస్తున్నాయని చెప్పాలి. సోమవారం మధ్యాహ్నం భారత ప్రభుత్వం సైతం బ్రిటన్ నుంచి వచ్చే విమానాల్నే కాదు.. ఇక్కడ నుంచి వెళ్లే విమానాలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబరు 31 వరకు విమాన రాకపోకలు ఉండవని తేల్చేశారు.

ఇదిలా ఉంటే.. సౌదీ అరేబియా మరింత కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది. అత్యవసర సందర్భాల్లో తప్పించి అన్ని విదేశీ విమానాల్ని వారం రోజుల పాటు నిషేధించినట్లుగా స్పష్టం చేసింది. అంతేకాదు.. సముద్ర మార్గంలో.. భూ మార్గంలోనూ దేశానికి వచ్చే అన్ని ప్రవేశాల్ని నిలిపివేస్తున్నట్లుగా ఆ దేశం పేర్కొంది. అవసరాన్ని బట్టి.. మరో వారం పాటు సౌదీలోకి ప్రవేశాల్ని నిలిపివేస్తూ మరో వారం పొడిగించే అవకాశం ఉందంటున్నారు.

క్రిస్మస్ పండుగ నేపథ్యంలో బ్రిటన్ నుంచి భారత్ కు వచ్చేందుకు వీలుగా పెద్ద ఎత్తున విద్యార్థులు ప్లాన్ చేసుకోగా.. వారందరికి నిరాశే మిగిలింది. బ్రిటన్ లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతునన నేపథ్యంలో మరిన్ని దేశాలు ఆంక్షల బాటలోకి వచ్చేశాయి. నెదర్లాండ్స్.. బెల్జియం.. ఇటలీ దేశాలు ఇప్పటికే ఆంక్షల్ని ప్రకటించగా.. తాజాగా ఫ్రాన్స్.. కెనడా.. టర్కీ.. డెన్మార్క్.. హాంకాంగ్.. ఇజ్రాయెల్.. ఆస్ట్రియా.. ఐర్లాండ్.. ఇరాన్.. క్రోయేషియా.. అర్జెంటీనా.. చిలీ.. మొరాకో.. కువైట్ తదితర దేశాలు బ్రిటన్ నుంచి రాకపోకలపై ఆంక్షలు విధించాయి. బ్రిటన్ తో ఉన్న అన్ని సరిహద్దుల్ని మూసివేస్తున్నట్లుగా ఫ్రాన్స్ ప్రకటించింది. కొత్త వైరస్ కు సంబంధించిన ఒక కేసును తమ దేశంలో గుర్తించినట్లుగా ఇటలీ పేర్కొంది.


Tags:    

Similar News