పిటిషన్ కొట్టివేత.. పిశాచాలకు ఉరే మిగిలింది

Update: 2020-02-14 12:25 GMT
దేశంలోని చట్టాల్ని అర్జెంట్ గా మార్చాల్సిన అవసరం ఉందని వాదించేటోళ్లు చాలామందే కనిపిస్తారు. అయితే.. ఇదంతా అనవసరమైన వాదనగా కొట్టిపారేసేటోళ్లు తక్కువేం కాదు. కానీ.. నిర్భయ దోషులకు విధించిన ఉరిశిక్ష అమలు కాకుండా జాగు చేసే విషయంలో జరుగుతున్న ప్రయత్నాల్ని చూస్తున్న వారంతా మాత్రం.. చట్టంలోని పలు నిబంధనల్ని వెంటనే మార్చాల్సిన అవసరం ఉందన్న మాట పెద్దఎత్తున వినిపిస్తోంది. అత్యంత అనాగరికంగా.. పైశాచికంగా నిర్భయను హత్యాచారానికి పాల్పడిన దోషులకు సుప్రీం ఉరిశిక్ష ఖరారు చేయటం.. ఆ తీర్పు అమలు విషయంలో చట్టంలోని లొసుగుల్ని అడ్డు పెట్టుకొని పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.

ఉరి తీయాల్సిన నలుగురిలో ఇప్పటికే ముగ్గురు ఉరి అమలు కాకుండా చేసుకున్న ప్రయత్నాలు పూర్తి కాగా.. తాజాగా మరో దోషి వినయ్ శర్మ అవకాశాలు పూర్తి అయిపోయినట్లేనని చెబుతున్నారు. రాష్ట్రపతి క్షమాభిక్షను రిజెక్టు చేసిన వేళ.. సుప్రీంకోర్టును మరోసారి అతగాడు ఆశ్రయించాడు. ఈ సందర్భంగా అతడు కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చాడు. జైల్లో తాను తీవ్రమైన టార్చర్ అనుభవించానని.. దీంతో తన మానసిక పరిస్థితి బాగోలేదని.. క్షమాభిక్ష పిటిషన్ పై నిర్ణయం తీసుకునే సందర్భంలో తాను ప్రస్తావించిన విషయాల్ని రాష్ట్రపతి పరిగణలోకి తీసుకోలేంటూ వినయ్ శర్మ పేర్కొన్నారు.

దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయయస్థానం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఉరిశిక్ష అమలు ఆలస్యమయ్యేలా చేస్తున్నప్రయత్నాలకు షాకిస్తూ.. పిటిషన్ ను రిజెక్టు చేసింది. వినయ్ శర్మ తరఫు లాయర్ వినిపించిన వాదనను సుప్రీం కోర్టు రిజెక్టు చేసింది. వినయ్ శర్మ మానసిక స్థితి బాగుందన్న కోర్టు.. ఫిబ్రవరి 12న మెడికల్ రికార్డుల ప్రకారం అతడి ఆరోగ్య స్థితికి ఇబ్బంది లేదని కేంద్రం తరఫు లాయర్ కోర్టు ముందుకు తీసుకొచ్చారు. తాజాగా పిటిషన్ ను కొట్టేయటంతో.. ఉరిశిక్ష అమలు కాకుండా ఉన్న మార్గాలు మూసుకుపోయినట్లేనని చెబుతున్నారు. దీంతో.. ఉరి అమలు మిగిలిందంటున్నారు.


Tags:    

Similar News